Wednesday, July 31, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 18

వేమన శతకం (Vemana Shatakam) - 18

తనకు గలుగు పెక్కు తప్పులటుండగా
నొరుల నేర మెంచు నోగి యెపుడు
జక్కిలంబు చూచి జంతి కేరినయట్లు
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
చక్కిలాన్ని చూసి జంతిక వెక్కిరించినట్లు, తను చేసిన తప్పులు ఎన్నో ఉండగా మూర్ఖులు పక్క వాళ్ళ తప్పులను వెదకడానికి మహా ఉత్సాహం చూపిస్తారు. ఇలాంటివారిని అసలు పట్టించుకోకూడదు.

కృష్ణ శతకం (Krishna Shathakam) - 9

కృష్ణ శతకం (Krishna Shathakam) - 9

గోపాల దొంగ మురహర
పాపాలను పారఁద్రోలు ప్రభుఁడవు నీవే
గోపాలమూర్తి దయతో
నా పాలిట గలిగి బ్రోవు నమ్మితి కృష్ణా!


భావం:-
ఓ శ్రీకృష్ణా! నువ్వు స్వర్గలోకాన్ని పరిపాలించావు. లీలామానుష రూపుడివి. మురుడు అనే రాక్షసుడిని చంపినవాడివి. పాపాలను పోగొట్టే రాజువి. అన్నీ నువ్వే. నేను నిన్నే నమ్మాను. నువ్వు నాయందు దయ ఉంచి నన్ను రక్షించు అని కవి ఈ పద్యంలో వివరించాడు.


ప్రతిపదార్థం:-
గో అంటే స్వర్గలోకాన్ని; పాల అంటే పరిపాలించినవాడా; దొంగ అంటే లీలామానుషుడివి అయినవాడా; మురహర అంటే మురుడు అనే పేరుగల రాక్షసుడిని చంపినవాడా; గోపాల అంటే గొల్లపిల్లవాని; మూర్తి అంటే ఆకారం కలిగినవాడా; కృష్ణా అంటే ఓ కృష్ణా; పాపాలను అంటే తప్పు పనులు చేయడం వలన వచ్చే ఫలితాన్ని; పారద్రోలు అంటే పోగొట్టగల; ప్రభుడవు అంటే రాజువు; నీవే అంటే నువ్వే; నిశ్చయము అంటే ఇది నిజమని; నమ్మితి అంటే నమ్మాను; నా పాలిట + కలిగి అంటే నాయందు దయ కలిగి; బ్రోవుము అంటే రక్షించుము.

సుమతీ శతకం (Sumathi Shathakam) - 15

సుమతీ శతకం (Sumathi Shathakam) - 15

బలవంతుడ నాకేమని
పలువురతో నిగ్రహించి పలుకుట మేలా
బలవంతమైన సర్పము
చలిచీమల చేతచిక్కి చావదె సుమతీ!


భావం:-
మంచిబుద్ధికలవాడా! తనకు శక్తి ఉంది కనుక, తనను ఎవ్వరూ ఏమీ చేయలేరనుకునేవారు కొందరు ఉంటారు. వారు ఇతరులందరినీ తీసిపారేసినట్లు మాట్లాడతారు. అందువల్ల వారికి మంచి కలుగదు. ఎంతోబలం ఉన్న పాము అన్నిటికంటె చిన్నప్రాణులైన చీమలకు దొరికిపోయి, ప్రాణాలు పోగొట్టుకుంటుంది.


ప్రపంచంలో చాలామంది తమకు చాలా బలం ఉందని, తనను ఎవ్వరూ ఏమీ చేయలేరనే అహంకారంతో ఉంటారు. ప్రతివారితోనూ అమర్యాదగా ప్రవర్తిస్తారు. ఎవరు పలకరించినా వారిని తక్కువగా చూస్తూ హేళనగా మాట్లాడతారు. తలనిండా విషం ఉన్న పామును సైతం అతి చిన్నవైన చీమలన్నీ క లిసి చంపేస్తాయి. పాములతో పోలిస్తే చీమలకు బలం కాని శక్తి కాని లేదు. అయినప్పటికీ ఐకమత్యం గల కొన్ని చీమలు కలిసి ఆ విషసర్పాన్ని చంపుతాయి. ఇది లోక ంలో ఉన్న వాస్తవం. అటువంటి వాస్తవంతో పోల్చి, మనుషుల ప్రవర్తనను వివరించాడు బద్దెన తన సుమతీ శతకంలో.

వేమన శతకం (Vemana Shatakam) - 17

వేమన శతకం (Vemana Shatakam) - 17

నరుడెయైన లేక నారాయణుండైన
తత్వబద్దుడైన ధరణి నరయ
మరణమున్నదనుచు మదిని నమ్మగవలె
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
మామూలు నరుడైనా గాని, దేవుడైన నారాయణుడైనా గాని, మహ గొప్ప తత్వవేత్తైనా గాని ఎలాంటివారైనా ఈ శరీరానికి మరణమున్నదని తప్పక గ్రహించాలి. ఈ విషయాన్ని మదిలో ఉంచుకొని పరులకొరకు కొంత పాటుపడాలి. ఎవరూ ఇక్కడ శాశ్వతము కాదు.

Tuesday, July 30, 2019

భర్తృహరి సుభాషితాలు (Subhashitaalu) - 2

భర్తృహరి సుభాషితాలు (Subhashitaalu) - 2

సంపదలు కల్గుతరి మహాజనుల హృదయ
మభినవోత్పల కోమలంబగుచు వెలయు
నాపదలు వొందు నప్పుడు మహామహీధ
రాశ్మ సంఘాత కర్మశంబై తనర్చు


భావం:-
మహాత్ముల హృదయాలు సంపదలు, సంతోషాలు కలిగినప్పుడు పూవు వలె మెత్తగా ఉంటాయి. ఆపదలలో చిక్కుకున్న వేళ, కొండల యొక్క రాతిబండ వలె వారి హృదయములు కఠినమగును.

కృష్ణ శతకం (Krishna Shathakam) - 8

కృష్ణ శతకం (Krishna Shathakam) - 8

దండమయా విశ్వంభర
దండమయా పుండరీకదళ నేత్ర హరీ
దండమయా కరుణానిధి
దండమయా నీకునెపుడు దండము కృష్ణా!


భావం:-
సమస్త విశ్వాన్ని భరించినవాడివి. తామరరేకులవంటి కన్నులు గలవాడివి. జాలి దయలకు నిధివంటివాడివి. అటువంటి నీకు నిరంతరం నమస్కరిస్తూనే ఉంటాను.


ప్రతిపదార్థం:-
విశ్వంభర అంటే సమస్త విశ్వాన్ని భరించినవాడా; దండము అంటే నీకు నమస్కారం; పుండరీకదళ అంటే తామరరేకుల వంటి; నేత్ర అంటే కన్నులు కలవాడా; హరీ అంటే ఓ విష్ణుమూర్తీ; దండము అంటే నీకు నమస్కారం; కరుణా అంటే జాలి దయలకు; నిధి అంటే గనియైనవాడా; ఎపుడు అంటే నిరంతరం; దండము అంటే వందనం; కృష్ణా అంటే ఓ శ్రీకృష్ణా; నీకున్ అంటే నీకు, దండము అంటే నమస్కారము.

సుమతీ శతకం (Sumathi Shathakam) - 14

సుమతీ శతకం (Sumathi Shathakam) - 14

కొఱగాని కొడుకుపుట్టిన
కొఱగామియె కాదు తండ్రి గుణములు చెరచున్
చెఱకు తుద వెన్ను పుట్టిన
చెఱకున తీపెల్ల చెరచు సిద్ధము సుమతీ!


భావం:-
ప్రయోజకుడు కాని కొడుకు పుడితే, అతడు ప్రయోజకుడు కాకపోవటమే కాకుండా, తండ్రిలో ఉన్న సుగుణాలకు చెడ్డపేరు తీసుకువస్తాడు. చెరకుగడ చివర కంకి మొలిస్తే, మొలిచిన చోట తీపి ఉండదు. అక్కడ లేకపోవటమే కాక, గడలో ఉన్న తీపినంతటినీ కూడా ఈ కంకి చెడగొడుతుంది. ఇది ప్రపంచమంతటా ఉన్న సత్యం.

కొఱగాని కొడుకు అంటే ఏపనీ చేతకానివాడు, నేర్చుకోని వాడు, ఏ పనీ చేయనివాడు అని అర్థం. ఇలాంటివారినే అప్రయోజకులు అని కూడా అంటారు. కొందరు పిల్లలు ఏ పనీ చేయకుండా, బద్దకంగా, సోమరిగా ఉంటారు. అంతేకాక పనికిమాలిన పనులు అంటే చేయకూడని పనులు చేస్తూ, తండ్రి పేరు చెడగొడతారు. అందరిచేత చివాట్లు తింటారు. అటువంటి కుమారుడిని చెరకులో పుట్టిన వెన్నుతో పోల్చి చెప్పాడు బద్దెన. ప్రపంచంలో ఉండే నిజాలు తెలిస్తేనే కాని ఇటువంటి వాటితో పోలిక చెప్పలేరు.

వేమన శతకం (Vemana Shatakam) - 16

వేమన శతకం (Vemana Shatakam) - 16

గుణములుగలవాని కులమెంచగానేల?
గుణము కలిగెనేని కోటిసేయు
గుణము లేకయున్న గ్రుడ్డిగవ్వయు లేదు
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
మనుషుల కులము కంటే గుణమే ముఖ్యము.మంచి గుణము కలవాని కులమును ఎవరూ అడుగజాలరు. అలాగే ఎంత మంచి కులములో పుట్టినా గుణము లేకపొతే గుడ్డి గవ్వంత విలువ కూడ చేయరు.

Monday, July 29, 2019

దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 7


దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 7

శ్రీరఘురామ చారు తులసీదళదామ, శమక్షమాది శృం
గార గుణాభిరామ, త్రిజగన్నుత శౌర్య రమా లలామ దు
ర్వార కబంధ రాక్షస విరామ, జగజ్జన కల్మషార్ణవో
త్తారకరామ భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ!


భావం:-
ఇక్ష్వాకువంశం సంపదలకు నెలవు. ఆ వంశంలో యతీపవుసీత రఘుమహారాజు గొప్పవాడు.అటువంటి వంశపరంపరలో పుట్టినవాడు. అందమైన తులసీదళాలతో తయారైన మాలికను ధరించినవాడు. శాంతి, ఓర్పులు అనే మంచి లక్షణాలతో ప్రకాశించేవాడు. ముల్లోకాలలోనూ పొగడ్తలు అందుకున్నవాడు. పరాక్రమం అనే సంపదను ఆభరణంగా కలిగినవాడు. ఎవ్వరికీ ఎదుర్కోవడ ం సాధ్యం కాని కబంధుడనే రాక్షసుని వధించినవాడు. ప్రపంచంలోని మానవులను పాపాలు అనే సముద్రం నుంచి దాటించగల ‘రామా’ అనే పేరుగలవాడు. దయకు సముద్రం వంటివాడు. భద్రాచలం అనే కొండ పైభాగంలో నివాసం ఉన్నవాడు. దశరథ మహారాజుకు ముద్దుల కుమారుడు. ఆయనే శ్రీరాముడు.


ప్రతిపదార్థం:-
శ్రీ అంటే సంపదలకు నెలవైన; రఘు అంటే రఘుమహారాజు వంశంలో పుట్టిన రామా; చారు అంటే అందమైన; తులసి అంటే తులసి అనే పేరు గల మొక్క; దళ అంటే ఆకులతో; దామ అంటే తయారయిన మాలిక గలవాడా; శమ అంటే శాంతి; క్షమ అంటే ఓర్పు; ఆది అంటే మొదలైన; శృంగార అంటే అందమైన; గుణ అంటే లక్షణాలచేత; అభిరామ అంటే మనోహరుడైనవాడా; త్రిజగత్ అంటే ముల్లోకాల చేత; నుత అంటే పొగడబడిన; శౌర్య అంటే పరాక్రమం; రమా అంటే సంపద అనెడి; లలామ అంటే అలంకారం కలవాడా; దుర్వార అంటే అడ్డుకోలేని; కబంధ అంటే కబంధుడు అనే పేరు గల; రాక్షస అంటే రాక్షసుడిని; విరామ అంటే సంహరించినవాడా; జగత్ అంటే లోకంలోని; జన అంటే ప్రజల; కల్మష అంటే పాపాలు అనే; అర్ణవ అంటే సముద్రాన్ని; ఉత్తారక అంటే దాటించే; నామ అంటే పేరుగలవాడా; కరుణాపయోనిథీ అంటే దయలో సముద్రం వంటివాడా; భద్రగిరి అంటే భద్రాచలంలో కొలువై ఉన్న; దాశరథీ అంటే దశరథుని కుమారుడైన రామా!

కృష్ణ శతకం (Krishna Shathakam) - 7

కృష్ణ శతకం (Krishna Shathakam) - 7

శ్రీధర మాధవ యచ్యుత
భూధర పురుహూత వినుత పురుషోత్తమ నీ
పాదయుగళంబు నెప్పుడు
మోదముతో న మ్మినాడ ముద్దుల కృష్ణా!


ప్రతిపదార్థం:-
శ్రీ అంటే లక్ష్మీదేవిని; ధర అంటే హృదయమునందు ధరించినవాడా; మాధవ అంటే లక్ష్మికి భర్తయైనవాడా; అచ్యుత అంటే చ్యుతి లేనివాడా (శాశ్వతమైనవాడా); పురుహూత అంటే దేవేంద్రుని చేత; వినుత అంటే పొగడబడినవాడా; భూధర అంటే భూదేవిని ధరించినవాడా; పురుషోత్తమ అంటే పురుషులలో శ్రేష్ఠుడైనవాడా; నీ అంటే నీయొక్క; పాదయుగళంబు అంటే రెండు పాదాలను; ఎప్పుడు అంటే నిరంతరం; మోదముతో అంటే ఆనందంతో; నమ్మినవాడ అంటే నమ్ముకున్నాను; ముద్దుల కృష్ణా అంటే ముద్దులు మూటగట్టిన శ్రీకృష్ణా!


భావం:-
లక్ష్మీదేవిని హృదయం మీద నిలిపినవాడా, శ్రీలక్ష్మికి భర్తయైనవాడా, శాశ్వతుడవైనవాడా, దేవేంద్రునిచేత స్తోత్రం చేయబడినవాడా, భూదేవిని ధరించినవాడా, పురుషులయందు పరమశ్రేష్ఠుడవైనవాడా, ముద్దులు మూటగట్టే రూపం కలవాడా, ఓ శ్రీకృష్ణా, నీ రెండు పాదాలను నిరంతరం సంతోషంతో నమ్మి ఉన్నాను. అటువంటి నన్ను రక్షించు.

సుమతీ శతకం (Sumathi Shathakam) - 13

సుమతీ శతకం (Sumathi Shathakam) - 13

శ్రీరాముని దయచేతను
నారూఢిగ సకల జనులునౌరాయనగా
ధారాళమైననీతులు
నోరూరగ చవులువుట్ట నుడివెద సుమతీ!


భావం:
మంచిబుద్ధిగలవాడా! మీకు కొన్ని నీతులు చెబుతాను, వినండి. ఈ నీతులు నేను చెబుతున్నానంటే అందుకు నా ఇష్టదైవమైన శ్రీరాముని అనుగ్రహమే కారణం. నేను చెప్పబోయేవన్నీ రానున్న కాలంలోనూ ప్రసిద్ధికెక్కుతాయి. అవి ఎవరూ అడ్డుచెప్పలేని ఉత్తమమైనవి. ఒకటి వింటే మరొకటి వినాలనిపించేలా ఉంటాయి. ఎంతో ఉపయోగకరమైనవి కూడా. ఈ నీతులు విన్నవారు చెప్పే విధానం బాగుంది అని ఆశ్చర్యపోతారు.


ఇది బద్దెన రచించిన సుమతీ శతకంలోని మొట్టమొదటి పద్యం. శతకం కాని, ఏదైనా కావ్యం కాని రాసేటప్పుడు మొదటి పద్యాన్ని సర్వసాధారణంగా శ్రీ తో మొదలుపెడతారు. అలాగే మొట్టమొదటి పద్యంలో దైవస్తుతి ఉంటుంది. బద్దెన రాసిన ఈ శతకంలో ప్రతిపద్యం చివర సుమతీ అనే మకుటం వస్తుంది. బద్దెన పద్యంలో తన పేరును పెట్టుకోకుండా రాశాడు ఈ శతకాన్ని. ‘సుమతీ’ అంటే ‘మంచి బుద్ధికలవాడా!’ అని అర్థం.


భర్తృహరి సుభాషితాలు (Subhashitaalu) - 1

భర్తృహరి సుభాషితాలు (Subhashitaalu) - 1

అఘమువలన మరల్చు హితార్ధకలితు
జేయు గోప్యంబుదాచు బోషించు గుణము
విడువడాపన్ను లేవడి వేళనిచ్చు
మిత్రుడీ లక్షణంబుల మెలంగుచుండు


పాపపు పనులు చేయకుండా చూచుట, మేలు చేయుటకే ఆలోచించుట, రహస్యములను దాచిఉంచుట, మంచిగుణాలను అందరికీ  తెలుపుట, ఆపదల్లో తోడుండుట, అవసరానికి సాయపడుట మిత్రుని గుణములు.

Sunday, July 28, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 15

వేమన శతకం (Vemana Shatakam) - 15

ఎద్దుమొద్దువాని కేల శాస్త్రంబులు?
ముద్దునాతి కేల ముసలిమగడు?
చద్దిమిగుల నిల్లు సంసారమేలరా?
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
మొరటువానికి శాస్త్రములతో పని లేదు. ఎవరు చెప్పినా వినడు. పడుచుదానికి ముసలిమొగుడు కిట్టడు. అలాగే చద్ది మిగిలిఉండని ఇల్లు సంసారానికి సరి అవుతుందా?

వేమన శతకం (Vemana Shatakam) - 14

వేమన శతకం (Vemana Shatakam) - 14

ఇంటిలోని కోతి యిరవు కానగలేక
తిరుగ బోవువారు తీరకుంద్రు
కోతి నోకటి నిల్పి కుదురుండలేరయా!
విశ్వదాభిరామ వినురవేమ!

భావం:-
ఇంటిలోన దూరిన కోతి ఎలాగైతే చక చక తిరుగుతూ అన్ని వెతుకుతుంటుందో, అలానే మనస్సు ఒక చోట నిలువక తిరుగుతూ ఉంటుంది. అటువంటి మనస్సును అదుపులో పెట్టడమమే ముక్తికి మొదటి మార్గం.

వేమన శతకం (Vemana Shatakam) - 13

వేమన శతకం (Vemana Shatakam) - 13

ఎంచి యెంచి పూజ లెన్ని చేసిన నేమి?
భక్తి లేని పూజ ఫలము లేదు
కాన పూజ సేయగారణ మెఱుగుడీ
విశ్వదాభిరామ వినురవేమ!

భావం:-
ఎన్నెన్ని పూజలు పేరు పేరున చేసినా ప్రయోజనమేమిటి? భక్తి లేని పూజకి ఫలములేదు గాన పూజ చేసే ముందు దేనికి చేస్తునారో, ఆ కారణం తెలుసుకోవాలి.

వేమన శతకం (Vemana Shatakam) - 12

వేమన శతకం (Vemana Shatakam) - 12

కుక్క గోవుగాదు కుందేలు పులిగాదు
దొమ గజముగాదు దొడ్డదైన
లొభిదాతగాడు లోకంబు లోపల
విశ్వదాభిరామ వినురవేమ


భావం:-
ఎంత భారి శరీరం ఉన్న దోమ ఏనుగు కాలేదు, సౌమ్యంగా ఉన్నా మొరిగే కుక్కెప్పుడు పాలిచ్చే ఆవు కాలేదు, గంభీరంగా ఉన్నా కుందేలు పులి కాలేదు. అలాగే లోభి ఎప్పుడూ దాత కాలేడు.

Saturday, July 27, 2019

సుమతీ శతకం (Sumathi Shathakam) - 12

సుమతీ శతకం (Sumathi Shathakam) - 12

సరసము విరసము కొఱకే
పరిపూర్ణ సుఖంబు లధిక బాధల కొఱకే
పెరుగుట విరుగుట కొఱకే
ధర తగ్గుట హెచ్చుట కొఱకె తథ్యము సుమతీ!


భావం :-
మనసుకు ఆనందం కలిగించేలా మాట్లాడటం, చేష్టలు చేయటం... ఇవన్నీ దుఃఖం కలగటానికే. పరిపూర్ణ సుఖం కలగటం అంటే ఎక్కువ కష్టాలు అనుభవించటానికే. వృద్ధి చెందటం అంటే క్షీణించటం కోసమే. ఒక వస్తువు ధర తక్కువ కావటం అంటే పెరగటం కోసమే. ఇది వాస్తవం.


ప్రతిపదార్థం :-
సరసము అంటే ఆనందం కలిగించేలా మాట్లాడటం, పనులు చేయటం; విరసము కొరకే అంటే బాధలు కలగటం కోసమే; పరిపూర్ణ అంటే పూర్తిస్థాయిలో; సుఖంబులు అంటే సౌఖ్యాలు; అధిక అంటే ఎక్కువ కావటం, బాధల కొరకే అంటే కష్టాల కోసమే; పెరుగుట అంటే వృద్ధిచెందటం; విరుగుట కొరకే అంటే నశించిపోవటానికే; ధర అంటే వెల; తగ్గుట అంటే తగ్గటం; హెచ్చుట కొరకే అంటే అధికం కావటం కోసమే; తథ్యము అంటే వాస్తవం.

జీవితంలో కష్టసుఖాలు ఒకదాని వెంట ఒకటి వస్తుంటాయి. కష్టాలకు కుంగిపోవడం, సుఖాలకు పొంగిపోవడం మంచిది కాదని పెద్దలు చెబుతారు. అధిక ధనం వచ్చింది కదా అని గర్వంతో విర్రవీగకూడదు. అది కొన్నిరోజుల తరవాత మన దగ్గర నుంచి వెళ్లిపోవచ్చు. అలాగే ఇబ్బందులలో ఉన్నామని కుంగిపోకూడదు. ఆ ఇబ్బందులు కూడా ఎన్నో రోజులు ఉండవు. కొన్నాళ్ల తరవాత సుఖాలు వరిస్తాయి. అందుకే ‘పెరుగుట తరుగుట కొరకే’ అనేది నిత్య జీవితంలో వాడుకలోకి వచ్చింది. ఇందుకు చంద్రుడు చక్కని ఉదాహరణ - పదిహేను రోజులకుఒకసారి పౌర్ణమి వస్తే, మరో పదిహేను రోజులకు అమావాస్య వస్తుంది. అదే జీవితం. సుఖదుఃఖాలు రెండింటినీ సమదృష్టితో చూస్తూ స్థితప్రజ్ఞత చూపాలని కవి ఈ పద్యంలో వివరించాడు.

కృష్ణ శతకం (Krishna Shathakam) - 6

కృష్ణ శతకం (Krishna Shathakam) - 6

నారాయణ లక్ష్మీపతి
నారాయణ వాసుదేవ నందకుమారా
నారాయణ నిను నమ్మితి
నారాయణ నన్నుబ్రోవు నగధర కృష్ణా


భావం:-
నీరు నెలవుగా ఉన్న ఓకృష్ణా! లక్ష్మీదేవికి భర్తయైనవాడా! అవతారాలు ధరించిన సమయంలో మానవరూపం ధరించినవాడా, అన్ని లోకాలను నీయందే కలిగినవాడా, నందుని కుమారుడా, శబ్దమే గమ్యంగా కలవాడా, నిన్నే నమ్ముకున్నాను. మానవ సమూహానికి స్థానమైన ఓ కృష్ణా! కొండను ధరించిన నీవు నన్ను రక్షించు.


ప్రతిపదార్థం:-
 నారాయణ అంటే నీరు నెలవుగా ఉన్న; లక్ష్మీపతి అంటే లక్ష్మీదేవికి భర్త అయిన; నారాయణ అంటే అవతారాలు ధరించినప్పుడు మానవ రూపం కలిగిన; వాసుదేవ అంటే వసుదేవుని కుమారుడివైన; నందకుమారా అంటే నందుని కుమారుడివైన; నారాయణ అంటే శబ్దమే గమ్యంగా కలవాడివి; నిను అంటే అటువంటి నిన్ను; నమ్మితి అంటే నమ్మాను; నారాయణ అంటే నరుల సమూహానికి నెలవైనవాడివి; నగధర అంటే కొండను ధరించినవాడివి; కృష్ణా అంటే ఓ కృష్ణా! నన్ను అంటే సామాన్య మానవుడనైన నన్ను; బ్రోవు అంటే రక్షించు.

వేమన శతకం (Vemana Shatakam) - 11

వేమన శతకం (Vemana Shatakam) - 11

అల్పజాతివానికధికారమిచ్చిన
దొడ్డవారినెల్ల తొలగగొట్టు
చెప్పు తినెడు కుక్క చెరకు తీపెరుగునా?
విశ్వదాభిరామ! వినురవేమ!


తాత్పర్యం:-
చెడ్డవాడికి అధికారం ఇస్తే మంచివారందరినీ (దొడ్డవారినెల్ల...) వె ళ్లగొడతాడు. చెప్పులను ఎంతో ఇష్టంగా తినే కుక్కకు, చెప్పు రుచి కంటె చెరుకు రుచి చాలా తియ్యగా ఉంటుంది కదా అని పెడితే, దానికి ఆ చెరుకులోని తియ్యదనం తెలియదు. దాని నోటికి చెప్పుల రుచే తియ్యగా ఉంటుంది. అది దాని జాతి లక్షణం. అలాగే దుష్టుైడె న వాడికి చెడుమాటలే బాగా నచ్చుతాయి. చెడ్డవారినే ఇష్టపడతాడు. తను చేసే చెడుపనులకు చెడ్డవారు మాత్రమే సహాయం అందిస్తారు. అందుకే అల్పజాతివానికి (దుష్టుడైన వానికి) పాలన అధికారం ఇచ్చిన వెంటనే ముందుగా మంచివారిని (దొడ్డవారినెల్ల) ఆయా పనులలోంచి తీసివేస్తాడు. సమాజంలో ఉండే మనుషుల ప్రవర్తనను జంతువుల స్వభావంతో పోల్చి, చిన్నచిన్న పదాలతో ఉండే పద్యంలో చక్కగా వివరించాడు వేమన.

భాస్కర శతకం (Bhaskara Shatakam) - 7

భాస్కర శతకం (Bhaskara Shatakam) - 7

చదువది యెంత గల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా
చదువు నిరర్థకంబు గుణసంయుతులు మెచ్చ రెచ్చటం
బదునుగ మంచికూర నలపాకము చేసిననైన నందు నిం
పొదవెడు నుప్పు లేక రుచిపుట్టగ నేర్చునటయ్య భాస్కరా!


భావం:-
ఒక మనిషి ఎంత విద్వాంసుడైనప్పటికీ, విద్యలోని సారాన్ని కొద్దిగానైనా గ్రహించకపోతే అటువంటి విద్య ఎందుకూ పనికిరాదు. ఆ విద్యను పండితులైనవారెవ్వరూ మెచ్చుకోరు. నలమహారాజులాగ వంట చేసినప్పటికీ అందులో ఉప్పు వేయకపోతే ఆ కూరకు రుచి కలగదు.
చేసే పని సక్రమంగా ఉండాలి. అప్పుడే దానికి పండితులనుంచి, మేధావుల నుంచి తగిన గుర్తింపు వస్తుంది. అంతేకాని, పనిని మొక్కుబడిగా చేయటం వల్ల దానికి గుర్తింపు రాదు అని కవి ఈ పద్యంలో వివరించాడు.


ప్రతిపదార్థం:-
చదువు అంటే విద్య; ఎంత కల్గినన్ అంటే ఎంత ఉన్నప్పటికీ; రసజ్ఞత అంటే ఆ చదువుల సారం తెలియకపోతే; ఇంచుక అంటే ఏ మాత్రమూ; చాలకున్నన్ అంటే ఆ చదువు వ్యర్థమైనది; ఎచ్చటన్ అంటే ఎక్కడైనా గుణసంయుతులు అంటే మంచిగుణాలు కలిగినవారు;ఎవ్వరు అంటే ఏ ఒక్కరూ; మెచ్చరు అంటే పొగడరు; మంచికూరను అంటే చక్కని రుచిని ఇచ్చే కూరను; పదునుగన్ అంటే తగినవిధంగా; నలపాకమున్ అంటే నలమహారాజు చేసేలా తయారు చేసినప్పటికీ; అందులో అంటే ఆ కూరలో; ఇంపు + ఒదవెడున్ అంటే చక్కని రుచిని కలిగించే; ఉప్పులేక అంటే లవణం లేకపోతే; రుచి అంటే జిహ్వ; పుట్టగన్ + నేర్చును + అటయ్య అంటే వస్తుందా? (రాదు అని అర్థం)



దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 6

దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 6

శ్రీరఘురామ చారు తులసీదళదామ, శమక్షమాది శృం
గార గుణాభిరామ, త్రిజగన్నుత శౌర్య రమా లలామ దు
ర్వార కబంధ రాక్షస విరామ, జగజ్జన కల్మషార్ణవో
త్తారకరామ భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ!



భావం:-
ఇక్ష్వాకువంశం సంపదలకు నెలవు. ఆ వంశంలో యతీపవుసీత రఘుమహారాజు గొప్పవాడు.అటువంటి వంశపరంపరలో పుట్టినవాడు. అందమైన తులసీదళాలతో తయారైన మాలికను ధరించినవాడు. శాంతి, ఓర్పులు అనే మంచి లక్షణాలతో ప్రకాశించేవాడు. ముల్లోకాలలోనూ పొగడ్తలు అందుకున్నవాడు. పరాక్రమం అనే సంపదను ఆభరణంగా కలిగినవాడు. ఎవ్వరికీ ఎదుర్కోవడ ం సాధ్యం కాని కబంధుడనే రాక్షసుని వధించినవాడు. ప్రపంచంలోని మానవులను పాపాలు అనే సముద్రం నుంచి దాటించగల ‘రామా’ అనే పేరుగలవాడు. దయకు సముద్రం వంటివాడు. భద్రాచలం అనే కొండ పైభాగంలో నివాసం ఉన్నవాడు. దశరథ మహారాజుకు ముద్దుల కుమారుడు. ఆయనే శ్రీరాముడు.



ప్రతిపదార్థం: శ్రీ అంటే సంపదలకు నెలవైన; రఘు అంటే రఘుమహారాజు వంశంలో పుట్టిన రామా; చారు అంటే అందమైన; తులసి అంటే తులసి అనే పేరు గల మొక్క; దళ అంటే ఆకులతో; దామ అంటే తయారయిన మాలిక గలవాడా; శమ అంటే శాంతి; క్షమ అంటే ఓర్పు; ఆది అంటే మొదలైన; శృంగార అంటే అందమైన; గుణ అంటే లక్షణాలచేత; అభిరామ అంటే మనోహరుడైనవాడా; త్రిజగత్ అంటే ముల్లోకాల చేత; నుత అంటే పొగడబడిన; శౌర్య అంటే పరాక్రమం; రమా అంటే సంపద అనెడి; లలామ అంటే అలంకారం కలవాడా; దుర్వార అంటే అడ్డుకోలేని; కబంధ అంటే కబంధుడు అనే పేరు గల; రాక్షస అంటే రాక్షసుడిని; విరామ అంటే సంహరించినవాడా; జగత్ అంటే లోకంలోని; జన అంటే ప్రజల; కల్మష అంటే పాపాలు అనే; అర్ణవ అంటే సముద్రాన్ని; ఉత్తారక అంటే దాటించే; నామ అంటే పేరుగలవాడా; కరుణాపయోనిథీ అంటే దయలో సముద్రం వంటివాడా; భద్రగిరి అంటే భద్రాచలంలో కొలువై ఉన్న; దాశరథీ అంటే దశరథుని కుమారుడైన రామా!

Friday, July 26, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 10

వేమన శతకం (Vemana Shatakam) - 10

ఎలుక తోలు దెచ్చి యేడాది యుతికిన
నలుపు నలుపే గాని తెలుపు రాదు
కొయ్యబొమ్మను దెచ్చి కొట్టిన బలుకునా
విశ్వదాభిరామ! వినురవేమ!


తాత్పర్యం:-
వ్యక్తుల సహజ గుణాలను ఎప్పటికీ మార్చలేం. ఎలుక తోలును ఏడాది పాటు ఎంత ఉతికినా అది నలుపు రంగుతోనే ఉంటుంది తప్ప, దాని స్థానంలో తెలుపు రంగుకు మారదు కదా. అలాగే, కొయ్యబొమ్మను ఎంత కొడితే మాత్రం ఏం లాభం? అది మాట్లాడుతుందా! కాబట్టి, స్వత:సిద్ధమైన లక్షణాలను మార్చాలని ప్రయత్నించకూడదు.

సుమతీ శతకం (Sumathi Shathakam) - 11

సుమతీ శతకం (Sumathi Shathakam) - 11

స్త్రీల ఎడ వాదులాడక
బాలురతో జెలిమి చేసి భాషింపకుమీ
మేలైన గుణము విడువకు
ఏలిన పతి నిందసేయ కెన్నడు సుమతీ!


తాత్పర్యం:-
మన వ్యక్తిత్వంపై గొప్ప ప్రభావం చూపే కొన్ని మంచి పనులను చిన్న విషయాలుగా తీసి పారేయ కూడదు. అవేమిటంటే: మహిళలతో ఎప్పుడూ గొడవ పడకూడదు. చిన్న పిల్లలతో స్నేహం చేసి మాట్లాడరాదు. మంచి గుణాలను ఎప్పుడూ విడువ వద్దు. అలాగే, భర్త (యజమాని)ను నిందలతో దూషించకూడదు. ఇలాంటివి తప్పక ఆచరించదగ్గది.

దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 5

దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 5

కనక విశాల చేల భవకానన శాతకుఠారధార స
జ్జన పరిపాలశీల దివిజస్తుత సుద్గుణకాండ కాండ సం
జనిత పరాక్రమ క్రమ విశారద శారద కందకుంద చం
దన ఘనసార సారయశ! దాశరథీ కరుణాపయోనిధీ!


తాత్పర్యం:-
బంగారు వర్ణంలో వస్ర్తాలను ధరించిన వాడు, సంసారమనే అడవికి గొడ్డలిమొన వంటివాడు, సజ్జనులను పాలించే వాడు, దేవతలతో స్తోత్రింపబడే వాడు, ఉత్తమ
గుణాలు గలవాడు, విలువిద్యలో నిష్ణాతుడు, శరత్కాల మేఘం, మొల్లలు, గంధం, పచ్చకర్పూరాల వలె నిగ్గు తేలిన కీర్తిగల వాడు సాక్షాత్తు ఆ కరుణాపయోనిధి అయిన శ్రీరామచంద్రమూర్తియే!

సుమతీ శతకం (Sumathi Shathakam) - 10

సుమతీ శతకం (Sumathi Shathakam) - 10

ఎప్పుడు దప్పులు వెదకెడు
నప్పురుషుని గొల్వగూడ దది యెట్లన్నన్
సర్పంబు పడగ నీడను
గప్ప వసించిన విధంబు గదరా సుమతీ!


తాత్పర్యం:-
అర్హులు కాని వారిని సేవించడం వల్ల కలిగే అనర్థాన్ని తెలియజెప్పిన పద్యరత్నమిది. నల్ల తాచుపాము పడగ నీడలో నివసించే కప్ప బతుకు క్షణక్షణం ప్రాణగండమే. ఇదే విధంగా, ఎప్పుడూ అయిన దానికీ, కాని దానికీ దోషాలను వెదికే యజమానిని సేవిస్తే వచ్చే లాభమేమో కానీ అనుక్షణం ప్రమాదకరమైన పరిస్థితే పొంచి ఉంటుంది.

Thursday, July 25, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 9

వేమన శతకం (Vemana Shatakam) - 9

నిండు నదులు పారు నిల్చి గంభీరమై
వెఱ్ఱివాగు పారు వేగబొర్లి
అల్పుడాడు రీతి నధికుండు నాడునా
విశ్వదాభిరామ వినురవేమ!


తాత్పర్యం:-
ఎప్పుడైనా నిండుకుండలు తొణకవు. బాగా నీటితో వుండే నదులు గంభీరంగా ప్రవహిస్తుంటాయి. కానీ, నీళ్లు లేని వెర్రివాగులు మాత్రమే వేగంగా పొర్లి పొర్లి ప్రవహిస్తుంటాయి. ఇదే విధంగా, అల్పులైన దుర్జనులు ఎప్పుడూ ఆడంబరాలే పలుకుతుంటారు. కానీ, సజ్జనులు తక్కువగా, విలువైన రీతిలోనే మాట్లాడుతారు.

కుమార శతకం (Kumara Shatakam) - 6

కుమార శతకం (Kumara Shatakam) - 6

పెద్దలు విచ్చేసినచొ
బద్ధకముననైన దుష్ట పద్ధతి నైనన్
హద్దెరిగి లేవకున్నన్
మొద్దు వలెం జూతురతని ముద్దు కుమారా!


తాత్పర్యం:-
పెద్దలను గౌరవించే పద్ధతిని చక్కగా తెలిపిన నీతిపద్యమిది. పెద్దలు మనమున్న చోటుకు వచ్చినప్పుడు వెంటనే గౌరవప్రదంగా లేచి నిలబడాలి. కానీ, పొగరుతోనో, చిన్నాపెద్ద తేడా తెలుసుకోలేకనో, ఆఖరకు బద్ధకం వల్లనైనా సరే మన హద్దు గ్రహించకుండా, అలానే కూచుండిపోయే వారిని బుద్ధిలేని మొద్దుగా, మూర్ఖునిగా జమకడతారు.

కృష్ణ శతకం (Krishna Shathakam) - 5

కృష్ణ శతకం (Krishna Shathakam) - 5

నీవే తల్లివి దండ్రివి
నీవే నా తోడు నీడ! నీవే సఖుడౌ
నీవే గురుడవు దైవము
నీవే నా పతియు గతియు! నిజముగ కృష్ణా!


తాత్పర్యం:-
పరమాత్మ స్వరూపుడైన శ్రీకృష్ణునే సర్వస్వంగా భావించినపుడు మనకిక తిరుగుండదు. ఆ స్వామినే తల్లిగా, తండ్రిగా, తోడు నీడగా, స్నేహితుడిగా, గురువుగా, దైవంగా భావిస్తూనే అంతటితో ఊరుకోరు చాలామంది. తన ప్రభువూ ఆయనే. ఆఖరకు తనకు దిక్కూమొక్కూ అన్నీ నువ్వే అని వేడుకోవడంలో లభించే తృప్తి అంతటి భక్తులకు తప్ప అన్యులకు తెలియదు.

శ్రీ కాళహస్తీశ్వర శతకం (Srikalahastishwara Shatakam) - 6

శ్రీ కాళహస్తీశ్వర శతకం (Srikalahastishwara Shatakam) - 6

ఆలున్ బిడ్డలు తల్లిదండ్రులు ధనంబంచు న్మహాబంధనం
బేలా నామెడ గట్టినాడవిక నిన్నే వేళంజింతింతు, ని
ర్మూలంబైన మనంబులో నెగడు దుర్మహాబ్దిలో గ్రుంకి యీ
శీలామాలపు జింత నెట్లుడిపెదో శ్రీకాళహస్తీశ్వరా!


తాత్పర్యం:-
భార్యాబిడ్డలు, తల్లిదండ్రులు, ధనార్జన.. వీటి మోహబంధనంలో పడిపోయిన నేను నీ నామ స్మరణను సైతం విస్మరించాను కదా. ఈ బంధాలను కలిగించిన నువ్వే వాటినుంచి నన్ను విడగొట్టాలి సుమా. ఆ మోహపాశంలోంచి నన్ను బయటపడేసి, నీ నామస్మరణామృతాన్ని ఆస్వాదించే అవకాశం ఇవ్వు ఈశ్వరా!

Wednesday, July 24, 2019

కృష్ణ శతకం (Krishna Shathakam) - 4

కృష్ణ శతకం (Krishna Shathakam) - 4

గోపాలుని సేవలో..!
గోపాల దొంగ మురహర
పాపాలను పారద్రోలు ప్రభుడవు నీవే
గోపాలమూర్తి దయతో
నా పాలిట గలిగి బ్రోవు నమ్మితి కృష్ణా!


తాత్పర్యం:-
ఓ శ్రీ కృష్ణా! నువు స్వర్గలోకాన్ని పాలించిన వాడవు. లీలామానుష రూపుడివి. మురుడనే రాక్షసుడిని సంహరించిన వాడివి. పాపాలను పోగొట్టే రాజువు కూడా నీవే. అన్నీ నువ్వే, సర్వమూ నీ మయమే. అందుకే, నేను కూడా మనసా వాచా కర్మనా నిన్నే నమ్ముకున్నాను. నువ్వు నా పట్ల దయ వుంచి నన్ను రక్షించుమయ్యా!

నరసింహ శతకం (Narasimha Shatakam) - 6

నరసింహ శతకం (Narasimha Shatakam) - 6

చిత్తశుద్ధిగ నీకు సేవ జేసెదగాని పుడమిలో జనుల మెప్పులకు గాదు
జన్మ పావనతకై స్మరణ జేసెదగాని, సనివారిలో బ్రతిష్ఠలకు గాదు
ముక్తికోసము నేను మ్రొక్కి వేడెదగాని దండిభాగ్యము నిమిత్తంబుగాదు
నిన్ను బొగడ విద్య నేర్పితినే కాని, కుక్షి నిండెడు కూటి కొరకు గాదు
పారమార్థికమునకు నే బాటుపడితి
గీర్తికి నపేక్ష పడలేదే కృష్ణవర్ణ!
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్టసంహార!నరసింహ! దురితదూర!


తాత్పర్యం:-
నల్లనయ్యా! చిత్తశుద్ధితోనే నీకు సేవ చేశానే కానీ, లోకం మెప్పుకోసం కాదు. జన్మపావనం కావాలనే నీ నామస్మరణ చేశాను కానీ, పేరు ప్రతిష్ఠల కోసం కాదు. ముక్తికోసమే నిన్ను వేడుకొన్నానే తప్ప, భోగభాగ్యాలకు ఆశపడలేదు. విద్య నేర్పుతూ నిన్ను పొగడొచ్చు అనుకొన్నా కానీ, కూటికోసమైతే కాదు. పారమార్థికం కోసమే నా ఆరాటమంతా, కీర్తికోసం కాదు!

భాస్కర శతకం (Bhaskara Shatakam) - 6

భాస్కర శతకం (Bhaskara Shatakam) - 6

తాలిమి తోడ గూరిమి గృతఘ్నున కెయ్యడ నుత్తమోత్తము
ల్మేలొనరించిన గుణము మిక్కిలి కీడగు బాము పిల్లకున్
బాలిడి పెంచిన న్విషము పాయగ నేర్చునె దాని కోఱలం
జాలంగ నంతకంతకొక చాయను హెచ్చునుగాక భాస్కరా!


తాత్పర్యం:-
కృతఘ్నులకు ఎంత సహాయం చేసినా వ్యర్థం. పాముకు పాలు పోసి పెంచితే ఏమవుతుంది? దానితోపాటు విషమూ పెరుగుతుంది. చెరువులో నీరు కూడా ఇంతే. పొలాలకు పారుతుందే తప్ప, వాడనంత మాత్రాన అందులో నిల్వ వుండదు కదా. ఇదే పద్ధతిలో బాధ్యత తెలియని యజమానికి ఎంత ధన సహాయం చేసినా అది వ్యర్థమే అవుతుంది.

సుమతీ శతకం (Sumathi Shathakam) - 9

సుమతీ శతకం (Sumathi Shathakam) - 9

వినదగు నెవ్వరు చెప్పిన
వినినంతనె వేగపడక వివరింపదగున్
కనికల్ల నిజము దెలిసిన
మనుజుడే పో నీతిపరుడు మహిలో సుమతీ!


తాత్పర్యం:-
నిజానిజాలు తెలుసుకోకుండా తొందర పడడం ఎవరికీ మంచిది కాదు. ఎవరు చెప్పేవైనా సరే ముందు శ్రద్ధగా, జాగ్రత్తగా వినాలి. ఆ వెంటనే తాడో పేడో తేల్చుకొంటానంటూ తొందరపడకూడదు. వారు చెప్పిన దానిలో నిజం ఎంత? అబద్ధం ఎంత? అన్నదీ విచక్షణ చేసుకోవాలి. తర్వాతే తగిన నిర్ణయం తీసుకోవాలి. అలాంటి మనిషే అసలైన నీతిపరుడు.

Tuesday, July 23, 2019

కుమార శతకం (Kumara Shatakam) - 5

కుమార శతకం (Kumara Shatakam) - 5

సద్గోష్ఠి సిరియు నొసగును
సద్గోష్ట్యె కీర్తి బెంచు సంతుష్టిని నా
సద్గోష్ఠియె యొనగూర్చును
సద్గోష్ఠియె పాపములను జంపు కుమారా!


తాత్పర్యం:-
ఎప్పుడూ మంచివారితోనే సహవాసం చేయాలి. సజ్జనుల తోడిదే లోకంగా ఉండేవారికి అంతా మంచే జరుగుతుందని చెప్పే చక్కని నీతిపద్యమిది. సిరిసంపదలను, కీర్తి ప్రతిష్ఠలను, సంతృప్తిని మాత్రమే కాదు, ఆఖరకు సర్వపాపాలను హరించే శక్తి సైతం సజ్జనుల సావాసంతోనే లభిస్తుంది. అరుదుగా ఉండే అటువంటి మంచివారు లభించడం ఎవరికైనా అదృష్టమే మరి.

వేమన శతకం (Vemana Shatakam) - 8

వేమన శతకం (Vemana Shatakam) - 8

కోపమునను ఘనత కొంచమై పోవును
కోపమును మిగులగోడు గలుగు
గోపమడచెనేని గోర్కెలు నీడేరు
విశ్వదాభిరామ! వినురవేమ!


తాత్పర్యం:-
కోపంతో మనుషులు సాధించేదేమీ ఉండదని చెప్పిన నీతిపద్యమిది. ఎదుటివ్యక్తుల పట్ల కోపాన్ని ప్రదర్శించడం వల్ల నష్టమే తప్ప లాభమేమీ ఉండదు. పైగా మన ఘనత కాస్తా వారి దృష్టిలో కొంచెమై పోతుంది. ఫలితంగా మనకు ఏదో రూపంలో దు:ఖమూ కలుగుతుంది. కోపాన్ని తగ్గించుకోగలిగితే మన కోర్కెలను నెరవేర్చుకోవచ్చు.

నరసింహ శతకం (Narasimha Shatakam) - 5

నరసింహ శతకం (Narasimha Shatakam) - 5

ఐశ్వర్యములకు నిన్ననుసరింపగ లేదు, ద్రవ్యమిమ్మని వెంటదగుల లేదు
కనకమిమ్మని చాల గష్టపెట్టగ లేదు, పల్లకిమ్మని నోటబలుక లేదు.
సొమ్ములిమ్మని నిన్ను నమ్మి కొల్వగ భూములిమ్మని పేరు పొగడ లేదు
బలము లిమ్మని నిన్ను బ్రతిమాలగా లేదు, పనుల నిమ్మని పట్టుబట్ట లేదు
నేను గోరినదొక్కటే నీలవర్ణ!
చయ్యనను మోక్షమిచ్చిన జాలు నాకు
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!



తాత్పర్యం:-
భగవంతుణ్ణి దేనికోసం ప్రార్థించాలో చెప్పిన నీతిపద్యమిది. ఐశ్వర్యం కోసమో, ద్రవ్యం ఆశించో, బంగారమీయమనో, పల్లకి కావాలనో, సొమ్ములివ్వమనో ఇంకా భూములు, కీర్తి, సామర్థ్యం, ఆఖరకు బతుకుదెరువు కోసం ఏవైనా పనులు అప్పజెప్పమనీ.. ఇలాంటివేవీ అడగకుండా కేవలం మోక్షమొక్కటి ఇస్తే చాలు అన్నదే మన వేడుకోలు కావాలి.

సుమతీ శతకం (Sumathi Shathakam) - 8

సుమతీ శతకం (Sumathi Shathakam) - 8

ఇచ్చునదే విద్య, రణమున
జొచ్చునదే మగతనంబు, సుకవీశ్వరులున్
మెచ్చునదే నేర్పు, వదుకు
వచ్చునదే కీడు సుమ్ము వసుధను సుమతీ!


తాత్పర్యం:-
కొన్ని విషయాలు ఎంతో నిష్ఠూరంలా అనిపించినా నిజానికి ప్రపంచంలో అవే వాస్తవాలు. విద్య లేదా చదువు ఏదైనా సరే, మనిషిని ప్రయోజకుణ్ణి చేసేలా ఉండాలి. ధైర్యంతో పోరాడటానికైనా సిద్ధపడే వాడినే ధీరుడు, పౌరుషవంతుడు అంటారు. మన నేర్పరితనాన్ని కవిశ్రేష్ఠులైన వారు మెచ్చుకోగలగాలి. అలాగే, తగవులేవైనా హాని చేసేవే ఉంటాయి.

Monday, July 22, 2019

శ్రీ కాళహస్తీశ్వర శతకం (Srikalahastishwara Shatakam) - 5

శ్రీ కాళహస్తీశ్వర శతకం (Srikalahastishwara Shatakam) - 5

అంతా మిథ్యయని తలంచి చూచిన నరుండట్లౌ టెరింగిన్ సదా
కాంతాపుత్రులు నర్థముల్ తనువు నిక్కంబంచు మోహార్ణవ
భ్రాంతింజెంది చరించుగాని, పరమార్థంబైన నీయందు దా
చింతాకంతయు చింతనిల్పడు కదా శ్రీకాళహస్తీశ్వరా!


తాత్పర్యం:-
జగత్తంతా మిథ్య, బ్రహ్మమే సత్యం అని తెలిసిన తర్వాత కూడా మానవులు మోక్షసిద్ధి మార్గాన్ని నిర్లక్ష్యం చేస్తారు కదా. సంసార సాగరంలో పడి కొట్టుమిట్టాడుతుంటారు. ఎంతసేపూ భార్యాబిడ్డలు, ధనధాన్యాలు, శరీర పోషణ.. ఇవే శాశ్వతమనే భ్రాంతిలో ఉంటారు. ఈ మాయలోంచి బయటపడే నీ నామపఠనం పట్ల చింతాకు అంతైనా ధ్యాస నిలుపరు కదా.

భాస్కర శతకం (Bhaskara Shatakam) - 5

భాస్కర శతకం (Bhaskara Shatakam) - 5

ఎడ్డె మనుష్యుడే మెఱుగు నెన్ని దినంబులు గూడియుండినన్
దొడ్డ గుణాఢ్యునందు గలతోరవు వర్తనలెల్ల బ్రజ్ఞ బే
ర్పడ్డ వివేకరీతి రుచిపాకము నాలుక గాకెఱుంగునే?
తెడ్డది కూరలోగలయ ద్రిమ్మరుచుండిననైన భాస్కరా!


తాత్పర్యం:-
వెడ్డివారి (మూర్ఖులు) స్వభావం ఎలా ఉంటుందో తెలిపే నీతిపద్యమిది. సత్పురుషులతో ఎన్నాళ్లు సావాసం చేసినా సరే, మూఢులైన వారు సద్గుణాలను ఎప్పటికీ ఒంట పట్టించుకోరు. మంచివాళ్ల ప్రజ్ఞాపాటవాలు వారి మనసుకు ఎక్కవు కాక ఎక్కవు. ఎలాగంటే, వంట ఎంత రుచిగా ఉందో తినే నాలుకకు తెలుస్తుంది కానీ, కలిపే గరిటెకు తెలియదు కదా.

కుమారీ శతకం (Kumari Shatakam) - 2

కుమారీ శతకం (Kumari Shatakam) - 2

చెప్పకు చేసిన మేలు నొ
కప్పుడయిన గాని దాని హర్షింపరుగా
గొప్పలు చెప్పిన నదియును
దప్పే యని చిత్తమందు దలపు కుమారీ!


తాత్పర్యం:-
ఆడవారికైనా, మగవారికైనా వర్తించే నీతి ఇది. చేసిన మేలు ఎప్పుడూ చెప్పుకోకూడదు. అలా చెప్పుకొంటే, దానికి విలువ ఉండదు. ఏదో ప్రచారం కోసం చేశారనుకోవచ్చు. పైగా, అదేదో గొప్పలు చెబుతున్నట్టుగానూ ఉంటుంది. నిజంగానే మనం గొప్ప పనే చేసినా సరే, ఎవరికీ చెప్పుకోకుండా ఉండడమే ఉత్తమం. దీనిని మనసులో పెట్టుకొని మెలగాలి సుమా.

సుమతీ శతకం (Sumathi Shathakam) - 7

సుమతీ శతకం (Sumathi Shathakam) - 7

కూరిమి గల దినములలో
నేరము లెన్నడును గలుగ నేరవు మఱి యా
కూరిమి విరసంబైనను
నేరములే తోచు చుండు నిక్కము సుమతీ!


తాత్పర్యం:-
అందరూ ఇలా వుండకపోవచ్చు. కానీ, ఎక్కువ మంది దృష్టిలో ఇదే నిజం. ఏ ఇద్దరి మధ్యయినా స్నేహం చెడకూడదన్నది నీతి. పరస్పరం మిత్రత్వంతో ఉన్నపుడు ఒకరి నేరాలు మరొకరికి నేరాల్లా కనిపించవు. కానీ, అదే స్నేహం చెడిందా, అంతే. ఎదుటి వ్యక్తి చేసే ప్రతిదీ తప్పుగానే కనిపిస్తుంది. కాబట్టి, ఎంతటి వారికైనా స్నేహం కొనసాగితే ఏ బాధా ఉండదు.

Sunday, July 21, 2019

నరసింహ శతకం (Narasimha Shatakam) - 4

నరసింహ శతకం (Narasimha Shatakam) - 4

గార్థంభున కేల కస్తూరి తిలకంబు? మర్కటంబున కేల మలయజంబు?
శార్దూలమున కేల శర్కరాపూపంబు? సూకరంబున కేల చూతఫలము?
మార్జాలమున కేల మల్లెపువ్వులబంతి? గుడ్లగూబల కేల కుండలములు?
మహిషంబు కేల నిర్మలమైన వస్త్రముల్? బకసంతతికి నేల పంజరంబు?
ద్రోహచింతన చేసెడి దుర్జనులకుమధురమైనట్టి నీ నామ మంత్రమేల?
భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!
దుష్టసంహార! నారసింహ! దురితదూర!


తాత్పర్యం:-
గాడిదకు కస్తూరి తిలకం, కోతికి గంధం వాసన, పులికి చక్కెర వంటలు, పందికి మామిడిపండు, పిల్లికి మల్లెపూల చెండు, గుడ్లగూబకు చెవిపోగులు, దున్నపోతుకు మంచి వస్ర్తాలు, కొంగలకు పంజరం.. ఎందుకు? వాటి అవసరం ఆ జంతువులకు ఉండదు. ఇలాంటి పనులవల్ల ఏమీ ప్రయోజనం ఉండదు. అలాగే, ద్రోహబుద్ధిని ప్రదర్శించే దుర్జనులకు మధురమైన నీ నామము రుచించదు కదా.

శ్రీ కాళహస్తీశ్వర శతకం (Srikalahastishwara Shatakam) - 4

శ్రీ కాళహస్తీశ్వర శతకం (Srikalahastishwara Shatakam) - 4

అంతా మిథ్యయని తలంచి చూచిన నరుండట్లౌ టెరింగిన్ సదా
కాంతాపుత్రులు నర్థముల్ తనువు నిక్కంబంచు మోహార్ణవ
భ్రాంతింజెంది చరించుగాని, పరమార్థంబైన నీయందు దా
చింతాకంతయు చింతనిల్పడు కదా శ్రీకాళహస్తీశ్వరా!


తాత్పర్యం:-
జగత్తు అంతా వట్టి మిథ్య, బ్రహ్మమే పరమసత్యమని తెలియక మనుషులు సంసారసాగరంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఎంతసేపూ భార్యాబిడ్డలు, ధనధాన్యాలు, శరీర పోషణలే ముఖ్యమనుకొని వాటి చుట్టే తిరుగుతున్నారు. ఈ మోహ సముద్రంలోంచి బయటపడాలి. ఆ అద్భుత మార్గాన్ని చూపించేది నీ నామమే కదా ఈశ్వరా!

భాస్కర శతకం (Bhaskara Shatakam) - 5

భాస్కర శతకం (Bhaskara Shatakam) - 5

ఘనుడొకవేళ గీడ్పడిన గ్రమ్మఱ నాతనిలేమి వాపగా
కనుగొన నొక్క సత్ప్రభువుగాక నరాధము లోపరెందఱుం
బెను జెఱు వెండినట్టితఱి బెల్లున మేఘుడుగాక నీటితో
దనుపదుషారముల్ శతశతంబులు చాలునటయ్య భాస్కరా!


తాత్పర్యం:-
పెద్ద చెరువు ఎండిపోయినపుడు చిన్న వర్షంతో అది నిండదు కదా. దానికి తగ్గట్టు అంత పెద్ద వాన పడాల్సిందే. ఏనుగు కింద పడితే అంతటి ఏనుగే దానిని లేవనెత్తాలె. ఇదే మాదిరిగా గొప్పవాడు పేదరికంలో పడితే అతనిని ఆదుకోవడానికి ఎందరు పేదవాళ్లున్నా ప్రయోజనముండదు! ధనవంతుడే (సత్ప్రభువు) ఆదుకోవాలి మరి.

కుమార శతకం (Kumara Shatakam) - 4

కుమార శతకం (Kumara Shatakam) - 4

ధరణీ నాయకు రాణియు
గురు రాణియు నన్నరాణి కులకాంతను గ
న్న రమణి దనుగన్న దియును
ధరనేవురు తల్లులనుచు దలుపు కుమారా!


తాత్పర్యం:-
ఎవరికైనా కన్నతల్లిని మించిన వారుండరు. ఐతే, ఇదే సమయంలో లోకంలో ప్రతి ఒక్కరికీ మరొక అయిదుగురు తల్లులు ఉంటారు. వారినీ కన్నతల్లి మాదిరిగానే తప్పక గౌరవించాలి. వారెవరంటే రాజు భార్య, గురు పత్ని, అన్న భార్య (వదిన), కులకాంత, భార్య తల్లి (అత్త). వీరంతా కన్నతల్లితో సమానమన్నమాట.

Saturday, July 20, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 7

వేమన శతకం (Vemana Shatakam) - 7

మిరపగింజ చూడ మీద నల్లగ నుండు
కొరికి చూడ లోన చురుకు మనును
సజ్జనులగు వారి సారమిట్టుల నుండు
విశ్వదాభిరామ వినురవేమ!


తాత్పర్యం:-
మిరపగింజలు (మిరియాలు) పైకి నల్లగా ఉన్నా వాటిని కొరికి చూస్తే లోపలి కారం చురుక్కున తగులుతుంది కదా. అలాగే, మంచివారు బయటకు కఠినంగా ఉంటారు. వారి మాటలు మనల్ని నొప్పించవచ్చు కూడా. కానీ, వాళ్ల మనసును, విలువను తెలుసుకోగలిగితే అలా ఎందుకు ప్రవర్తించారో, మన శ్రేయస్సునే ఎలా కోరుకుంటున్నారో అర్థమవుతుంది.

సుమతీ శతకం (Sumathi Shathakam) - 6

సుమతీ శతకం (Sumathi Shathakam) - 6

తడ వోర్వక, యొడ లోర్వక
కడు వేగం బడిచి పడిన గార్యం బగునే
తడ వోర్చిన, నొడ లోర్చిన
జెడిపోయిన కార్యమెల్లజేకుఱు సుమతీ!


తాత్పర్యం:-
కొన్ని సందర్భాలలో సహనం విజయాన్ని చేకూరుస్తుంది. ఎలాగో.. సుమతీ శతకకారుడు (బద్దెన) ఈ పద్యరత్నంలో చక్కగా చెప్పారు. ఆలస్యాన్ని, శరీర శ్రమను తట్టుకోకుండా తొందరపాటు ప్రదర్శించకూడదు. ఈ హడావుడిని తగ్గించుకొని, రెంటినీ తట్టుకొంటూ.. ముందుకెళ్లినప్పుడే చెడిపోయిన పనైనా సరే విజయవంతంగా పూర్తవుతుంది.

దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 4

దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 4

ముప్పున గాలకింకరులు ముంగిట వచ్చిన వేళ, రోగముల్
గొప్పరమైనచో గఫము కుత్తుక నిండిన వేళ, బాంధవుల్
గప్పిన వేళ, మీ స్మరణ గల్గునొ గల్గదో నాటి కిప్పుడే
తప్పక చేతు మీ భజన దాశరథీ! కరుణాపయోనిధీ!


తాత్పర్యం:-
శ్రీరామా! నిన్ను సేవించడానికి.. వృద్ధాప్యంలో యమభటులు వాకిట్లోకి వచ్చినప్పుడో, రోగం ఎక్కువైపోయి కఫం గొంతులో నిండినప్పుడో, బంధుగణం చుట్టూ మూగినప్పుడో.. నీ పేరు తలుస్తానో లేదో. కీర్తనలు, భజనలు చేస్తానో లేదో. అందుకే, ఆలస్యం చేయకుండా తక్షణం నీ సేవకు సిద్ధమవుతాను.

నరసింహ శతకం (Narasimha Shatakam) - 3

నరసింహ శతకం (Narasimha Shatakam) - 3

భుజబలంబున బెద్దపులుల జంపగవచ్చు, పాము కంఠము జేత బట్టవచ్చు
బ్రహ్మరాక్షస కోట్ల బాఱద్రోలగవచ్చు, మనుజుల రోగముల్ మాన్పవచ్చు
జిహ్వ కిష్టముగాని చేదు మ్రింగగ వచ్చు, బదను ఖడ్గము చేత నదుమవచ్చు
గష్టమొందుచు ముండ్లకంపలో జొరవచ్చు, దిట్టుపోతుల నోళ్లు కట్టవచ్చు
బుడమిలో దుష్టులకు జ్ఞానబోధ దెలిపి
సజ్జనుల జేయలేడెంత చతురుడైన
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!


తాత్పర్యం:-
భయంకరమైన పెద్దపులులనైనా భుజబలంతో చంపగలం. పాముకంఠాన్ని చేత్తో పట్టుకోగలం. కోటి బ్రహ్మరాక్షసులనైనా పారదోలగలం. మనుషుల రోగాలనూ మాన్పగలం. నాలుకకు రుచింపని చేదునైనా మింగగలం. పదునైన కత్తిని చేత్తో అదుమగలం. కష్టమైనా సరే, ముండ్లకంపలోకి దూరగలం. ఆఖరకు, తిట్టేవాళ్ల నోళ్లనైనా కట్టడి చేయగలం. కానీ, దుష్టులకు జ్ఞానబోధ చేసి, వారిని మంచివారిగా మాత్రం మార్చలేం. ఎంతటి చతురులకైనా ఇది సాధ్యపడదు సుమా.

Friday, July 19, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 6

వేమన శతకం (Vemana Shatakam) - 6

పట్టు పట్టరాదు పట్టి విడువరాదు
పట్టేనేని బిగియ బట్టవలయు
బట్టి విడుచుకన్న బరగ జచ్చుట మేలు
విశ్వదాభిరామ! వినురవేమ!


తాత్పర్యం:-
పట్టుదల అంటే ఎలా ఉండాలో చాలా చక్కగా చెప్పిన పద్యమిది. ఎందుకు, ఏమిటి, ఎలా అని ముందే నిర్ణయించుకొని పట్టుదలకు సిద్ధం కావాలి. ఒకసారి పట్టు పడితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ దానిని విడవకూడదు. పట్టిన పట్టును మధ్యలోనే వదిలేయడమంటే మనిషి మరణంతో సమానం. అంటే, పట్టుదలకు అంత విలువ ఇవ్వాలన్నమాట.

శ్రీ కాళహస్తీశ్వర శతకం (Srikalahastishwara Shatakam) - 3

 శ్రీ కాళహస్తీశ్వర శతకం (Srikalahastishwara Shatakam) - 3

ఘడియల్ రెంటికొ మూటికో ఘడియకో కాదేని నేడెల్లి యో
కడనేడాది కొ యెన్నడో ఎరుగమీ కాయంబు లీ భూమి పై
బడగానున్నవి, ధర్మమార్గమొకటిం బాటింపరీ మానవుల్
చెడుగుల్ పదభక్తియుం దెలియరో శ్రీకాళహస్తీశ్వరా!


తాత్పర్యం:-
ఈ భూమిమీద మానవ జీవితం శాశ్వతం కాదు కదా. ఎప్పటికైనా సరే ఎంతటి వారికైనా మరణం తథ్యం. ఈ సత్యాన్ని అందరూ తెలుసుకోవాలి. ఇది తెలియకో లేదా తెలిసి కూడా ఏమవుతుందిలే అని అనుకొంటారో కానీ చాలామంది పాపపు పనులు చేస్తూ అధర్మమార్గంలోనే జీవిస్తున్నారు. ఒక్క ధర్మాన్నయినా పాటించకుండా అజ్ఞానంతో వుంటున్న ఈ మానవులను సర్వేశ్వరుడివైన నువ్వే క్షమించాలి సుమా.

భాస్కర శతకం (Bhaskara Shatakam) - 4

భాస్కర శతకం (Bhaskara Shatakam) - 4

పండితులైనవారు దిగువందగనుండగ నల్పుడొక్కడు
ద్దండత బీఠమెక్కిన బుధప్రకరంబుల కేమియెగ్గగున్
గొండొకకోతి చెట్టుకొనకొమ్మలనుండగ గ్రిందగండభే
రుండమదేభసింహ నికురుంబములుండవెచేరి భాస్కరా

తాత్పర్యం:-
చెట్టుకింద ఏనుగు, సింహము వంటి మృగముల విలువ చెట్టుపై కోతి ఉన్న తగ్గనట్లే అల్పుడొకడు పీఠమెక్కిన పండితుల విలువ తగ్గదు.

Thursday, July 18, 2019

కృష్ణ శతకం (Krishna Shathakam) - 3

కృష్ణ శతకం (Krishna Shathakam) - 3

హరియను రెండక్షరములు
హరియించును పాతకముల నంబుజ నాభా
హరి నీ నామ మహాత్మ్యము
హరిహరి పొగడంగ వశమె హరి శ్రీకృష్ణా!


తాత్పర్యం:
హరి అన్న రెండక్షరాలకు వున్న శక్తిని తెలిపే అద్భుత భక్తినీతి పద్యమిది. హరి అన్నమాట పలికినంతనే ప్రపంచంలోని పాపాలన్నీ నశించిపోతాయి. అంతేకాదు, హరి అనే ఈ పలుకులోని మహత్తు ఎంత గొప్పదంటే, దీనిని పలికినంతనే జన్మ ధన్యమైనట్టే. అటువంటి మహోత్కృష్టమైన శ్రీమహావిష్ణువు నామస్మరణతో స్వామిని పొగడడం ఎవరి వల్ల అవుతుంది!

కుమార శతకం (Kumara Shatakam) - 3

కుమార శతకం (Kumara Shatakam) - 3

ఏనాడైనను వినయము
మానకుమీ మత్సరమున మనుజేశులతో
బూనకు మసమ్మతము బహు
మానమునను బొందు మిదియె మతము కుమారా!


తాత్పర్యం:-
ఎంతటి వారికైనా సరే, వినయాన్ని మించిన ఆభరణం ఉండదు. ఈర్ష, అసూయలతో ఎవరితోనూ కలహాలకు దిగరాదు. పేదవారి కోపం పెదవికి చేటు కదా. దీనిని దృష్టిలో పెట్టుకొని పెద్దలు, మనకంటే పైవారితో వ్యవహారం నడిపేటప్పుడు ఎప్పటికీ వినయాన్ని వీడకూడదు. ఇంకా, వారితో ఎట్టి పరిస్థితుల్లోనూ వాదప్రతివాదనలు చేయకూడదు. ఇలా మెలకువతో మెలిగితేనే గౌరవ మర్యాదలు పొందగలం.

భాస్కర శతకం (Bhaskara Shatakam) - 3

భాస్కర శతకం (Bhaskara Shatakam) - 3

చదువది యెంత కల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా
చదువు నిరర్థకంబు గుణసంయుతు లెవ్వరు మెచ్చ రెచ్చటం
బద నుగ మంచికూర నల పాకము చేసిన నైన నందు నిం
పాదవెడు నుప్పు లేక రుచి పుట్టగ నేర్చునటయ్య! భాస్కరా!


తాత్పర్యం:-
ఎంత చదివితే ఏం లాభం? అందులోని సారం గ్రహించనంత వరకు అదంతా వ్యర్థమే కదా. మంచి గుణవంతులుగా కావాలంటే చదువులోని పరమార్థాన్ని గ్రహించాలి. ఎలాగైతే, నలభీమ పాకాలకైనా సరే చిటికెడు ఉప్పు లేకపోతే అవి రుచించనట్టు. కనుక, పిల్లలైనా పెద్దలైనా ఏది చదివినా, ఎంత చదివినా మనసు పెట్టి చదవాలి. అందులోని సారాన్ని తెలుసుకోవాలి.

Wednesday, July 17, 2019

నరసింహ శతకం (Narasimha Shatakam) - 2

నరసింహ శతకం (Narasimha Shatakam) - 2

కాయమెంత భయాన గాపాడినంగాని ధాత్రిలో నది చూడ దక్కబోదు
ఏ వేళ నేరోగ మేమరించునొ? సత్త మొందగ జేయు మే చందమునను
ఔషధంబులు మంచి వనుభవించినగాని కర్మ క్షీణంబైనగాని విడదు
కోటివైద్యులు గుంపుగూడి వచ్చినగాని మరణ మయ్యెదు వ్యాధి మాన్పలేరు
జీవుని ప్రయాణ కాలంబు సిద్ధమైన
నిలుచునా దేహమిందొక్క నిమిషమైన?
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్ట సంహార! నరసింహ! దురితదూర!



తాత్పర్యం:-
మన దేహాన్ని ఎంత రక్షించుకుంటే ఏం లాభం? అది శాశ్వతంగా నిలిచేది కాదుగా. ఎప్పుడు, ఏ రోగం వచ్చి ఏ రకంగా నశిస్తుందో ఎవరికీ తెలియదు. ఎంత మంచి చికిత్స చేసినా అది తాత్కాలికమే అవుతుంది. కోటి వైద్యులు వైద్యం చేస్తున్నా రానున్న మరణాన్ని ఎవరూ ఆపలేరు. అశాశ్వతమైన ఈ శరీరాన్ని రక్షించుకోవాలనే తాపత్రయం తప్పు కాకపోవచ్చు. కానీ, అంత్యకాలమంటూ వస్తే దానిని ఎవరూ ఆపకలేకపోగా, ఒక్క క్షణమైనా అది నిలవదు.

భాస్కర శతకం (Bhaskara Shatakam) - 2

భాస్కర శతకం (Bhaskara Shatakam) - 2

సిరిగలవాని కెయ్యెడల, జేసిన మే లది నిష్ఫలం బగున్;
నెఱి గుఱి గాదు; పేదలకు, నేర్పునం జేసిన సత్ఫలం బగున్;
వఱపున వచ్చి మేఘండొకచొ, వర్షము వాడిన చేలమీదటన్
కురిసినం గాక, యంబుధుల గుర్వగ నేమి ఫలంబు భాస్కరా!


తాత్పర్యం:-
ఏ సహాయమైనా, పని అయినా సార్థకత సిద్ధించాలంటే అర్హతగల వారికే చేయాలి. ఎలాగంటే, సంపన్నులకు ధనసహాయం చేయడం వృథా. అదే పేదవారికి చేస్తే ప్రయోజనం కలుగుతుంది. అలాగే, వానలు లేని కాలంలో ఎండిపోయే చేలపైన మేఘాలు వర్షాన్ని కురిపిస్తే సత్ఫలితాలు ఉంటాయి. కానీ, సముద్రంపై వానలు పడితే ఏం లాభం ఉండదు కదా.

వేమన శతకం (Vemana Shatakam) - 5

వేమన శతకం (Vemana Shatakam) - 5

ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు
చూడ జూడ రుచుల జాడ వేరు
పురుషులందు పుణ్య పురుషులు వేరయా
విశ్వదాభిరామ వినురవేమ.


తాత్పర్యము :-
ఉప్పుగల్లు, కర్పూరము చూపులకు ఒకే విధముగా తెల్లగా ఉంటాయి. నోట్లో వేసుకుని రుచి చూస్తేగాని తేడా తెలియదు. అలాగే, మనచుట్టూ ఉండే మనషుల్లోనూ... మంచివారు/గొప్పవారు ఎవరో - కాని వారెవరో అనుభవం ద్వారా మాత్రమే తెలుసుకోగలము.

Tuesday, July 16, 2019

కుమార శతకం (Kumara Shatakam) - 2

కుమార శతకం (Kumara Shatakam) - 2

చేయకుము కాని కార్యము
పాయకుము మఱిన్ శుభం బవని భోజనమున్
జేయకుము రిపు గృహంబున
గూయకు మొరుమనసు నొచ్చు కూత కుమారా!


తాత్పర్యం:-
మన వల్ల సాధ్యం కాని పనిని ఎప్పుడూ చేయబోకండి. అలాగని మంచిపని చేయకుండా ఊరుకోకూడదు కూడా. అట్లాగే, పగవారి ఇంట్లో భోజనం చేయరాదు. అంతేకాదు, తోటివారిని బాధపెట్టేలా నిష్ఠూరపు మాటలు మాట్లాడకూడదు.

శ్రీ కాళహస్తీశ్వర శతకం (Srikalahastishwara Shatakam) - 2

 శ్రీ కాళహస్తీశ్వర శతకం (Srikalahastishwara Shatakam) - 2

కొడుకుల్ పుట్టరటంచు నేడ్తు రవివేకుల్ జీవనభ్రాంతులై
కొడుకుల్ పుట్టరె కౌరవేంద్రున కనేకుల్, వారిచే నేగతుల్
వడసెం? పుత్రులు లేని యా శుకునకున్ బాటిల్లెనే దుర్గతుల్
చెడునే మోక్షపదం మపుత్రుకునకున్ శ్రీ కాళహస్తీశ్వరా!


తాత్పర్యం:-
కొడుకులు పుట్టనంత మాత్రాన ఉత్తమగతులు కలగవని చాలామంది అజ్ఞానంతో బాధపడుతుంటారు. కౌరవేంద్రుడైన ధృతరాష్ర్టునకు వందమంది పుట్టినా, వారివల్ల అతడు ఏం ఉత్తమగతిని పొందాడు? అలాగే, బ్రహ్మచారిగా ఉండి, పుత్రులు లేని శుకమహర్షికి ఏమైనా దుర్గతులు సంప్రాప్తించాయా? ఇదంతా వట్టి భ్రమే తప్ప మరోటి కాదు. పుత్రులు లేని వారికి మోక్షమార్గం ఎప్పుడూ మూసుకుపోదు సుమా.

Monday, July 15, 2019

సుమతీ శతకం (Sumathi Shathakam) - 5

సుమతీ శతకం (Sumathi Shathakam) - 5

బలవంతుడ నాకేమని
బలువురతో నిగ్రహించి పలుకుట మేలా
బలవంత మైన సర్పము
చలిచీమల చేత చిక్కి చావదె సుమతీ


తాత్పర్యం:-
నేను బలవంతుడను, నా వెనక ఎంతో బలగముంది, నన్నెవరూ ఏమీ చెయ్యలేరు అని విర్రవీగ కూడదు.కీడు వాటిల్లును. ఒక్కో సమయంలో బలమైన పాము కూడా చిన్నచిన్న చలిచీమల చేత చిక్కి చచ్చుచుండును.

Sunday, July 14, 2019

కుమారీ శతకం (Kumari Shatakam) - 1

కుమారీ శతకం (Kumari Shatakam) - 1

పర పురుషులన్న దమ్ములు
వరుడే దైవమ్ము తోడి పడుచులు వదినల్
మరదండ్రు నత్తమామలు
దరదల్లియు తండ్రియనుచు తలపు కుమారీ!


తాత్పర్యం:-
కొత్తగా అత్తవారింటికి వెళ్లే అమ్మాయికి ఉండాల్సిన ఉత్తమ సంస్కారాల్ని బోధించే పద్యమిది. భర్త మినహా పర పురుషులందరినీ అన్నదమ్ములుగా భావించుకోవాలి. తన భర్తే తనకు దైవసమానుడు. భర్త అక్కలూ, చెల్లెండ్లనూ తన అక్కాచెల్లెండ్లలానే తలచుకోవాలి. అలాగే, అత్తామామలను తల్లిదండ్రులుగా ఎంచుకొని మెలగాలి.

శ్రీ కాళహస్తీశ్వర శతకం (Srikalahastishwara Shatakam) - 1

 శ్రీ కాళహస్తీశ్వర శతకం (Srikalahastishwara Shatakam) - 1

ఏ వేదంబు పఠించెలూత? భుజగంబే శాస్త్రముల్చూచె, దా
నే విద్యాభ్యసనం బొనర్చెగరి, చెంచేమంత్ర మూహించె, బో
ధావిర్భావని దానముల్ చదువులయ్యా? కావు, మీ పాద సం
సేవాసక్తియె కాక జంతుతతికిన్ శ్రీకాళహస్తీశ్వరా!!


తాత్పర్యం:-
దైవ పాదసేవను మించిన పరమోత్కృష్ట భక్తి మరేమీ ఉండదని చెప్పిన భక్తినీతి పద్యమిది. సాలెపురుగు, ఏనుగు, పాముతో పాటు బోయవానికి సైతం మోక్షసిద్ధి ఎలా కలిగింది? వేదాలు, శాస్త్రాలు, విద్యాభ్యాసం, మంత్రాలు వంటి వాటన్నింటికంటే విలువైంది కాళహస్తీశ్వరుని పాదసేవ. ఆ భాగ్యాన్ని నాకూ కలిగించుము స్వామీ!

భాస్కర శతకం (Bhaskara Shatakam) - 1

భాస్కర శతకం (Bhaskara Shatakam) - 1

దక్షుడు లేని యింటికి బదార్థము వేఱొక చోటనుండి వే
లక్షలు వచ్చుచుండిన బలాయనమై చను గల్లగాదు ప్ర
త్యక్షము వాగులున్ వఱదలన్నియు వచ్చిన నీరు నిల్చునే
యక్షయమైన గండి తెగినట్టి తటాకములోన భాస్కరా!


తాత్పర్యం:-
ఏ కుటుంబానికైనా సమర్థుడైన యజమాని లేకపోతే ఎన్ని లక్షల రూపాయల ఆదాయం వస్తున్నా అది ఎటూ చాలకుండా ఖర్చవుతూ పోతుంది. ఎలాగంటే, గండి పడిన తటాకంలోకి ఎన్ని వాగుల నీళ్లు వచ్చి చేరుతున్నా అవి అందులో నిలువవు. ఎప్పటి కప్పుడు జారుకుంటూనే ఉంటాయి కదా. గృహ ఆర్థిక నిర్వహణ కూడా ఇలాంటిదే మరి.

నరసింహ శతకం (Narasimha Shatakam) - 1

నరసింహ శతకం (Narasimha Shatakam) - 1

ధరణిలో వెయ్యేండ్లు తనువు నిల్వగబోదు, ధనమెప్పటికి శాశ్వతంబు గాదు,
దార సుతాదులు తన వెంట రాలేరు, భృత్యులు మృతిని దప్పింపలేరు,
బంధుజాలము తన్ను బ్రతికించుకొనలేదు, బలపరాక్రమ మేమి పనికిరాదు,
ఘనమైన సకల భాగ్యంబెంత గల్గియు గోచిమాత్రంబైన గొంచుబోడు,
వెఱ్ఱికుక్కల భ్రమలన్ని విడిచి నిన్ను
భజన జేసెడి వారికి బరమ సుఖము
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!


తాత్పర్యం:-
ఎవరూ వెయ్యేండ్లు జీవించరు. ధనం శాశ్వతం కాదు. చనిపోయాక భార్యాపిల్లలు వెంటరారు. సేవకులూ మరణాన్ని తప్పించలేరు. బంధువులైనా బతికించలేరు. బలపరాక్రమమూ పనికిరాదు. వెర్రికుక్కల వంటి భ్రమలను విడిచి పెట్టాలి. అశాశ్వతమైన ఈ ప్రాపంచిక విషయాలను వదిలేసి, శాశ్వతమైన ముక్తికోసం స్వామి భజన చేయడం ఉత్తమోత్తమం!

కుమార శతకం (Kumara Shatakam) - 1

కుమార శతకం (Kumara Shatakam) - 1

పనులెన్ని కలిగి యున్నను
దినదినమున విద్య పెంపు ధీయుక్తుడవై
వినగోరుము సత్కథలను
కాని విబుధులు సంతసించు గతిని కుమారా!


తాత్పర్యం:-
తీరిక లేనంత బిజీగా, ఎన్ని పనుల ఒత్తిడిలో వున్నా కానీ, జ్ఞాన సముపార్జన కోసం బద్ధకానికి పోకుండా సమయం కేటాయించాలి. రోజురోజుకూ మన విద్యాబుద్ధులను పెంచుకొంటూ ఉండాలి. సత్కథలు (మంచికథలు) వినడానికి ఇష్టపడాలి. అప్పుడే మనలోని ప్రజ్ఞ ఇనుమడించి, ఉత్తములు సైతం సంతోషంతో మనల్ని ప్రశంసిస్తారు.

సుమతీ శతకం (Sumathi Shathakam) - 4

సుమతీ శతకం (Sumathi Shathakam) - 4

కసుగాయ గఱచి చూచిన
మసలక తగు యొగరుగాక మధురంబగునా
పసగలుగు యువతులుండగ
బసిబాలల బొందువాడు పశువుర సుమతీ.



పండిన పండు తినక పచ్చికాయ కొరికినచో వగరు తప్ప మధురముగా నుండదు.అట్లే ఇష్టమైన యౌవనవతి పొందు ఆనందముగాని, పసిబాలికల పొందు వికటము.అట్టివాడు పశువుతో సమానము.

వేమన శతకం (Vemana Shatakam) - 4

వేమన శతకం (Vemana Shatakam) - 4

ఎరుకమాలువాడు ఏమేమిచదివిన
జదివినంతసేపు సద్గుణియగు
కదిసి తామరందు గప్పగూర్చున్నట్లు
విశ్వదాభిరామ వినురవేమ


తాత్పర్యం:
తెలివిలేనివాడు ఎన్నినీతి,ధర్మశాస్త్రములు చదివినంత సేపేసజ్జనుడుగా ఉండును. బైటికివస్తే దుర్మార్గములు ప్రారంభించును.కప్పతామరాకుమీద ఉన్నతసేపూఉండి బైటికివచ్చి పురుగుల్నితింటుంది

సుమతీ శతకం (Sumathi Shathakam) - 3

సుమతీ శతకం (Sumathi Shathakam) - 3

పాటెరుగని పతి కొలువును
గూటంబున కెరుక పడని కోమలి రతియున్
జేటెత్త జేయు జెలిమియు
నేటికి నెదురీదినట్టు లెన్నగ సుమతీ.


తాత్పర్యం:-
పనియందు కష్ట సుఖములు తెలుసుకోలేని అధికారి సేవ, ఇష్టములేని స్త్రీతో సంభోగము,చెడు స్నేహము ఏటికి ఎదురీదినట్లు కష్టము కలుగ జేయును.

దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 3

దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 3

దీక్షవహించి నాకొలది దీనుల నెందరి గాచితో జగ
ద్రక్షక తొల్లి యాద్రుపదరాజ తనూజ తలంచినంతనే
యక్షయమైన వల్వలిడి తక్కట నామొర చిత్తగించి
ప్రత్యక్షము గావవేమిటికి దాశరథీ కరుణాపయోనిధీ!


తాత్పర్యం:-
రామా! పట్టుదలతో నావంటి దీనుల నెందరినో రక్షించితివి.ద్రౌపది కోరగానే చీరలు ఆక్షయముగా నిచ్చితివి.నామొర వినవేమి?

వేమన శతకం (Vemana Shatakam) - 3

వేమన శతకం (Vemana Shatakam) - 3

కనియు గానలేడు కదిలింప డానోరు
వినియు వినగ లేడు విస్మయమున
సంపద గలవాడు సన్నిపాతక మది
విశ్వదాభిరామ వినురవేమ


తాత్పర్యం:-
కొందరు ధనవంతులు పేదవారిని చూడగనే అతడేమి యడుగునో యని వేషభాష లనిబట్టి పేదయని గ్రహించి చూసీ చూడనట్లూరకుంటారు.మాటలు విననట్లుంటారు. సన్నిపాతరోగ మొచ్చినట్లుందురు.

కృష్ణ శతకం (Krishna Shathakam) - 2

కృష్ణ శతకం (Krishna Shathakam) - 2

పాలను వెన్నయు మ్రుచ్చిల
రోలను మీతల్లి గట్ట రోషము తోడన్
లీలా వినోది వైతివి
బాలుడవా బ్రహ్మగన్న ప్రభుడవు కృష్ణా


తాత్పర్యం:-
పాలు,వెన్నదొంగిలించితిని తంటాలుతెస్తున్నావని మీఅమ్మనిన్నురోటిక్కడితే నువ్వు రోషముతో ఆరోలు దొర్లించుకుంటూ వెళ్ళిచెట్లనుకూల్చి లీలావినోదం చూపావు.బ్రహ్మనుగన్న తండ్రివి.

వేమన శతకం (Vemana Shatakam) - 2

వేమన శతకం (Vemana Shatakam) - 2

ఎరుగువాని దెలుప నెవ్వడైనను చాలు
నొరుల వశముగాదు ఓగు దెల్ప
యేటివంక దీర్ప నెవ్వరి తరమయా
విశ్వదాభిరామ వినురవేమ


తాత్పర్యం:-
వివేకవంతునికి మనము ఏదైనా తెలియజేయుట సులభము. మూర్ఖునికి ఏదైననూ జెప్పుట ఎవరి తరమూకాదు.వంకర టింకరగా పారుతున్నయేరుని తిన్నగా పారునట్లు చేయుట ఎవరితరమూ కాదుకదా!

సుమతీ శతకం (Sumathi Shathakam) - 2

సుమతీ శతకం (Sumathi Shathakam) - 2

పనిచేయు నెడల దాసియు
ననుభవమున రంభ మంత్రి యాలోచనలన్
దనభుక్తి యెడల తల్లియు
యనదగు కులకాంత యుండ నగురా సుమతీ


తాత్పర్యం:-
భార్య ఇంటిపనులు చేయునపుడు సేవకురాలు గాను, భోగించునపుడు రంభ వలెను, సలహాలు చెప్పునప్పుడు మంత్రి వలెను, భుజించు నప్పుడు తల్లివలెను ఉండవలయును.

సుమతీ శతకం (Sumathi Shathakam) - 1

సుమతీ శతకం (Sumathi Shathakam) - 1

మాటకు బ్రాణము సత్యము
కోటకు బ్రాణంబు సుభట కోటి ధరిత్రిన్
బోటికి బ్రాణము మానము
చీటికి బ్రాణంబు వ్రాలు సిద్ధము సుమతీ.


తాత్పర్యం:-
మాటకు సత్యము,కోటకు మంచి భటుల సమూహము, స్త్రీకి సిగ్గు, ఉత్తరమునకు సంతకము ప్రాణము వలె ముఖ్యమైనవని అర్ధము.

కృష్ణ శతకం (Krishna Shathakam) - 1

కృష్ణ శతకం (Krishna Shathakam) - 1

హరి సర్వస్వంబున గలడని
గరిమను దైత్యుండుపలుక గంబములోనన్
ఇరవొంద వెడలిచీల్పవె
శరణన బ్రహ్లాదుండుసాక్షియె కృష్ణా!

తాత్పర్యం:-
కృష్ణా! హిరణ్యకశిపుడు అడుగగా ప్రహ్లాదుడు నీవుఅంతటా నిండియున్నావని చెప్పగా స్థంభములోనుండీపుట్టి గొప్పవెలుగుతోవచ్చి ప్రహ్లాదుడు చూస్తుండగా అతడి తండ్రినిచంపితివి.

వేమన శతకం (Vemana Shatakam) - 1

వేమన శతకం (Vemana Shatakam) - 1

ధనము గూడబెట్టి ధర్మంబు సేయక
తాను దినక లెస్స దాచుగాక
తేనె నీగ గూర్చి తెరువరి కీయదా
విశ్వదాభిరామ వినురవేమ


తాత్పర్యం:-
కొందరు ధనమును సంపాదించి ఒకరికి దానము చేయక తాము తినక కూడబెడతారు. తేనె టీగలు ఇలాగే పువ్వు పువ్వునా వాలి సంపాదించిన తేనెని కూడబెడతాయి దానిని మనిషి వాడుకుంటాడు.

దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 2

దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 2

మామక పాతకవ్రజము మాన్పనగణ్యము చిత్రగుప్తుడే
మేమని వ్రాయునో శమనుడేమి విధించునో కాలకింకర
స్తోమ మొనర్చుటేమొ విన జొప్పడదింతకుమున్నె దీనచిం
తామణి యెట్లు గాచెదవొ దాశరథీ! కరుణాపయోనిధీ!

తాత్పర్యం:-
నాపాపములు లెక్కలేనివి చిత్రగుప్తుడేమని వ్రాయునో యముడేశిక్షవేయునో ముందుగా తెలియదు.రామా! నిన్నేనమ్మాను.

దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 1

దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 1

సిరిగల నాడు మైమరచి చిక్కిన నాడు దలంచి పుణ్యముల్
పొరిబొరి సేయనైతినని పొక్కిన గల్గునె గాలిచిచ్చుపై
గెరలిన వేళ దప్పికొని కీడ్పడు వేళ జలంబు గోరి త
త్తరమున ద్రవ్వినం గలదె దాశరథీ! కరుణాపయోనిధీ!



తాత్పర్యం:-
సత్కార్యాలు (మంచిపనులు) అనుకొన్న వెంటనే చెయ్యాలి. దైవభక్తి విషయంలోనూ అంతే. వృద్ధాప్యం వచ్చాక, అయ్యో ఒక్క పుణ్యకార్యమైనా చేయలేకపోయానే అని బాధపడితే ఏం ప్రయోజనం? గాలి ఎప్పుడైతే బాగా వీస్తుందో అప్పుడు దాని ప్రభావం వల్ల మంటలు పెరుగుతై. దాహం తీర్చుకోవడానికి వేసవి పూట బావి తవ్వితే దప్పిక తీరేనా!