Wednesday, July 24, 2019

నరసింహ శతకం (Narasimha Shatakam) - 6

నరసింహ శతకం (Narasimha Shatakam) - 6

చిత్తశుద్ధిగ నీకు సేవ జేసెదగాని పుడమిలో జనుల మెప్పులకు గాదు
జన్మ పావనతకై స్మరణ జేసెదగాని, సనివారిలో బ్రతిష్ఠలకు గాదు
ముక్తికోసము నేను మ్రొక్కి వేడెదగాని దండిభాగ్యము నిమిత్తంబుగాదు
నిన్ను బొగడ విద్య నేర్పితినే కాని, కుక్షి నిండెడు కూటి కొరకు గాదు
పారమార్థికమునకు నే బాటుపడితి
గీర్తికి నపేక్ష పడలేదే కృష్ణవర్ణ!
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్టసంహార!నరసింహ! దురితదూర!


తాత్పర్యం:-
నల్లనయ్యా! చిత్తశుద్ధితోనే నీకు సేవ చేశానే కానీ, లోకం మెప్పుకోసం కాదు. జన్మపావనం కావాలనే నీ నామస్మరణ చేశాను కానీ, పేరు ప్రతిష్ఠల కోసం కాదు. ముక్తికోసమే నిన్ను వేడుకొన్నానే తప్ప, భోగభాగ్యాలకు ఆశపడలేదు. విద్య నేర్పుతూ నిన్ను పొగడొచ్చు అనుకొన్నా కానీ, కూటికోసమైతే కాదు. పారమార్థికం కోసమే నా ఆరాటమంతా, కీర్తికోసం కాదు!

No comments:

Post a Comment