Showing posts with label KumariiiShatakam. Show all posts
Showing posts with label KumariiiShatakam. Show all posts

Monday, November 18, 2019

కుమారీ శతకం (Kumari Shatakam) - 9

కుమారీ శతకం (Kumari Shatakam) - 9

పెనిమిటి వలదని చెప్పిన
పని యెన్నడు జేయరాదు బావల కెదుటన్
గనపడగ రాదు కోపము
మనమున నిడుకొనక యెపుడు మసలు కుమారీ!!


తాత్పర్యం:
ప్రతి మహిళా పుట్టినింటి గౌరవాన్ని నిలుపుతూ, మెట్టినింటి మేలు కోసం పాటుపడాలి. భర్త వద్దని చెప్పిన పని ఎప్పుడూ చేయకూడదు. బావల ముందు అర్థం పర్థం లేకుండా తిరుగకూడదు. చీటికి మాటికి కోపాన్ని ప్రదర్శించకుండా మనసులో కల్మషం లేకుండా మెలగాలి. అలాంటి కోడలును ఆ అత్తింటి వారు కన్నకూతురు వలె చూసుకోకుండా ఉంటారా!

Monday, November 11, 2019

కుమారీ శతకం (Kumari Shatakam) - 8

కుమారీ శతకం (Kumari Shatakam) - 8

పతి కత్తకు మామకు స
మ్మతిగాని ప్రయోజనంబు మానగ వలయున్
హిత మాచరింపవలయును
బ్రతుకున కొకవంక లేక పరగు గుమారీ!


తాత్పర్యం:
పుట్టినిల్లయినా, మెట్టినిల్లయినా పెద్దలమాటను కాదని పిల్లలు చేసే పనులేవీ శోభిల్లవు. పెద్దలుకూడా వారి మనసులు బాధ పెట్టకుండా
ప్రవర్తించాలి. అప్పుడే గృహాలు స్వర్గసీమలవుతాయి. భర్త, అత్త, మామలకు ఇష్టం లేని పనులను కోడలు ఎంత ప్రయోజనకరమైనా చేయకపోవడమే మంచిది. అలా ఎవరూ వేలెత్తి చూపించలేని నేర్పరితనంతో
జీవించగలగాలి.

Friday, November 8, 2019

కుమారీ శతకం (Kumari Shatakam) - 7

కుమారీ శతకం (Kumari Shatakam) - 7

ఎన్నాళ్లు బ్రతుక బోదురు
కొన్నాళ్లకు మరణదశల గ్రుంగుట జగమం
దున్నట్టివారి కందఱి
కిన్నిహితము సతము మంచి కీర్తి కుమారీ!


తాత్పర్యం:
సృష్టిలో చావు పుట్టుకలు సహజం. లోకంలో ఎవరైనా సరే, ఎన్నాళ్లో బతకలేరు. అందరూ ఎప్పటికైనా మరణించక తప్పదు. ఎంతటి వారికైనా చావు తథ్యమనే సత్యాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఈ మేరకు సద్గుణాలను అలవర్చుకొని సత్కర్మలతో ఆదర్శవంతమైన జీవితం గడపాలి. అప్పుడే మరణించిన తర్వాత కూడా శాశ్వత కీర్తిని పొందుతారు.

Thursday, August 29, 2019

కుమారీ శతకం (Kumari Shatakam) - 6

కుమారీ శతకం (Kumari Shatakam) - 6

పెనిమిటి వలదని చెప్పిన
పనియెన్నడు చేయరాదు బావలకెదుటన్
కనబడగరఅదు; కోపము
మనసున నిడుకొనక యెపుడు మసలు కుమారీ!


భావం:-
కుమారీ! భర్త వద్దన్న పనియెప్పుడూ చెయ్యకూడదు. బావల యందు నిల్చునిగాని, కూర్చుండి గాని, మాటాడడం లాంటి పనులు చెయ్యవద్దు. ఎవరేమన్నా మనసులో కోపానిని చోటివ్వకూడదు. కోపం పాపపు పనులు చేయిస్తుంది. శాంతంగా మసలుతూ ఉండాలి 

Monday, August 26, 2019

కుమారీ శతకం (Kumari Shatakam) - 5

కుమారీ శతకం (Kumari Shatakam) - 5

దానములు ధర్మకార్యము
లూనంగా గలిగినంత యుక్త క్రియలన్‌
మానవతుల కిది ధర్మము
గా నెఱిగి యొనర్పవలయు గాదె కుమారీ!


తాత్పర్యం:
దానధర్మాలు ప్రతీ ఒక్కరికీ ఆచరణదాయకం. ప్రత్యేకించి వనితలకైతే దానాలు, ధర్మకార్యాలు ఆభరణాల్లా వెలుగొందుతాయి. ‘ఇవి మగవారి పనులు, మావి కావు’ అని అనుకోకుండా మహిళలు తప్పకుండా వీటిని పాటించాలి. అప్పుడే ఉత్తమ మహిళలుగా కీర్తింపబడతారు. కనుక, వారు ఈ నీతిని తెలుసుకొని మసలుకోవాలి. 

Sunday, August 25, 2019

కుమారీ శతకం (Kumari Shatakam) - 4

కుమారీ శతకం (Kumari Shatakam) - 4

నోరెత్తి మాటలాడకు 
మారాడకు కోపపడిన ; మర్యాదలలో
గోరంత తప్పి తిరుగకు
మీరక మీ అత్త పనుల మెలగు కుమారీ !


భావము:-
బిగ్గరగా మాటలాడకు. అత్త గాని , మామ గాని దేనికైనా కోపించి ఏమైనా అంటే నువ్వు ఎదిరించి మాట్లాడకు. మన్ననగా మసలుతూండాలి. ఏ మాత్రం మర్యాదకి దెబ్బ తగిలేట్టు నడచినా నీకూ నీ పుట్టింటి వారికి అపకీర్తి తెచ్చిన దానవవుతావు. అత్త చెప్పిన పని వెంట వెంటనే చేస్తూ ఆమెకి సంతోషం కలిగిస్తూ ఉండు. 

Wednesday, August 14, 2019

కుమారీ శతకం (Kumari Shatakam) - 3

కుమారీ శతకం (Kumari Shatakam) - 3

ఎంతటి యాకలి గలిగిన
బంతిన గూర్చుండి ముందు భక్షింపరు సా
మంతులు బంధువులును నిసు
మంతైనను జెల్లదందు రమ్మ కుమారీ!


తాత్పర్యం:-
పదిమందిలో ఎవరైనా సరే వినయ విధేయతలను మరవకూడదు. ప్రత్యేకించి పంక్తి భోజనాల వేళ ఆకలి దంచేస్తున్నదని తొందరపడి, అందరికంటే ముందు తినడం మంచిదికాదు. అలా తినేవాళ్లను ఎదుటివాళ్లు తిండిపోతుగా ముద్ర వేస్తారు. కాబట్టి, ఇంట్లోని వారంతా కూర్చుని భోజనం చేసేప్పుడు అందరూ వచ్చాకే తినడం షురూ చేయాలి.

Monday, July 22, 2019

కుమారీ శతకం (Kumari Shatakam) - 2

కుమారీ శతకం (Kumari Shatakam) - 2

చెప్పకు చేసిన మేలు నొ
కప్పుడయిన గాని దాని హర్షింపరుగా
గొప్పలు చెప్పిన నదియును
దప్పే యని చిత్తమందు దలపు కుమారీ!


తాత్పర్యం:-
ఆడవారికైనా, మగవారికైనా వర్తించే నీతి ఇది. చేసిన మేలు ఎప్పుడూ చెప్పుకోకూడదు. అలా చెప్పుకొంటే, దానికి విలువ ఉండదు. ఏదో ప్రచారం కోసం చేశారనుకోవచ్చు. పైగా, అదేదో గొప్పలు చెబుతున్నట్టుగానూ ఉంటుంది. నిజంగానే మనం గొప్ప పనే చేసినా సరే, ఎవరికీ చెప్పుకోకుండా ఉండడమే ఉత్తమం. దీనిని మనసులో పెట్టుకొని మెలగాలి సుమా.

Sunday, July 14, 2019

కుమారీ శతకం (Kumari Shatakam) - 1

కుమారీ శతకం (Kumari Shatakam) - 1

పర పురుషులన్న దమ్ములు
వరుడే దైవమ్ము తోడి పడుచులు వదినల్
మరదండ్రు నత్తమామలు
దరదల్లియు తండ్రియనుచు తలపు కుమారీ!


తాత్పర్యం:-
కొత్తగా అత్తవారింటికి వెళ్లే అమ్మాయికి ఉండాల్సిన ఉత్తమ సంస్కారాల్ని బోధించే పద్యమిది. భర్త మినహా పర పురుషులందరినీ అన్నదమ్ములుగా భావించుకోవాలి. తన భర్తే తనకు దైవసమానుడు. భర్త అక్కలూ, చెల్లెండ్లనూ తన అక్కాచెల్లెండ్లలానే తలచుకోవాలి. అలాగే, అత్తామామలను తల్లిదండ్రులుగా ఎంచుకొని మెలగాలి.