Tuesday, July 30, 2019

సుమతీ శతకం (Sumathi Shathakam) - 14

సుమతీ శతకం (Sumathi Shathakam) - 14

కొఱగాని కొడుకుపుట్టిన
కొఱగామియె కాదు తండ్రి గుణములు చెరచున్
చెఱకు తుద వెన్ను పుట్టిన
చెఱకున తీపెల్ల చెరచు సిద్ధము సుమతీ!


భావం:-
ప్రయోజకుడు కాని కొడుకు పుడితే, అతడు ప్రయోజకుడు కాకపోవటమే కాకుండా, తండ్రిలో ఉన్న సుగుణాలకు చెడ్డపేరు తీసుకువస్తాడు. చెరకుగడ చివర కంకి మొలిస్తే, మొలిచిన చోట తీపి ఉండదు. అక్కడ లేకపోవటమే కాక, గడలో ఉన్న తీపినంతటినీ కూడా ఈ కంకి చెడగొడుతుంది. ఇది ప్రపంచమంతటా ఉన్న సత్యం.

కొఱగాని కొడుకు అంటే ఏపనీ చేతకానివాడు, నేర్చుకోని వాడు, ఏ పనీ చేయనివాడు అని అర్థం. ఇలాంటివారినే అప్రయోజకులు అని కూడా అంటారు. కొందరు పిల్లలు ఏ పనీ చేయకుండా, బద్దకంగా, సోమరిగా ఉంటారు. అంతేకాక పనికిమాలిన పనులు అంటే చేయకూడని పనులు చేస్తూ, తండ్రి పేరు చెడగొడతారు. అందరిచేత చివాట్లు తింటారు. అటువంటి కుమారుడిని చెరకులో పుట్టిన వెన్నుతో పోల్చి చెప్పాడు బద్దెన. ప్రపంచంలో ఉండే నిజాలు తెలిస్తేనే కాని ఇటువంటి వాటితో పోలిక చెప్పలేరు.

No comments:

Post a Comment