Saturday, July 27, 2019

దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 6

దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 6

శ్రీరఘురామ చారు తులసీదళదామ, శమక్షమాది శృం
గార గుణాభిరామ, త్రిజగన్నుత శౌర్య రమా లలామ దు
ర్వార కబంధ రాక్షస విరామ, జగజ్జన కల్మషార్ణవో
త్తారకరామ భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ!



భావం:-
ఇక్ష్వాకువంశం సంపదలకు నెలవు. ఆ వంశంలో యతీపవుసీత రఘుమహారాజు గొప్పవాడు.అటువంటి వంశపరంపరలో పుట్టినవాడు. అందమైన తులసీదళాలతో తయారైన మాలికను ధరించినవాడు. శాంతి, ఓర్పులు అనే మంచి లక్షణాలతో ప్రకాశించేవాడు. ముల్లోకాలలోనూ పొగడ్తలు అందుకున్నవాడు. పరాక్రమం అనే సంపదను ఆభరణంగా కలిగినవాడు. ఎవ్వరికీ ఎదుర్కోవడ ం సాధ్యం కాని కబంధుడనే రాక్షసుని వధించినవాడు. ప్రపంచంలోని మానవులను పాపాలు అనే సముద్రం నుంచి దాటించగల ‘రామా’ అనే పేరుగలవాడు. దయకు సముద్రం వంటివాడు. భద్రాచలం అనే కొండ పైభాగంలో నివాసం ఉన్నవాడు. దశరథ మహారాజుకు ముద్దుల కుమారుడు. ఆయనే శ్రీరాముడు.



ప్రతిపదార్థం: శ్రీ అంటే సంపదలకు నెలవైన; రఘు అంటే రఘుమహారాజు వంశంలో పుట్టిన రామా; చారు అంటే అందమైన; తులసి అంటే తులసి అనే పేరు గల మొక్క; దళ అంటే ఆకులతో; దామ అంటే తయారయిన మాలిక గలవాడా; శమ అంటే శాంతి; క్షమ అంటే ఓర్పు; ఆది అంటే మొదలైన; శృంగార అంటే అందమైన; గుణ అంటే లక్షణాలచేత; అభిరామ అంటే మనోహరుడైనవాడా; త్రిజగత్ అంటే ముల్లోకాల చేత; నుత అంటే పొగడబడిన; శౌర్య అంటే పరాక్రమం; రమా అంటే సంపద అనెడి; లలామ అంటే అలంకారం కలవాడా; దుర్వార అంటే అడ్డుకోలేని; కబంధ అంటే కబంధుడు అనే పేరు గల; రాక్షస అంటే రాక్షసుడిని; విరామ అంటే సంహరించినవాడా; జగత్ అంటే లోకంలోని; జన అంటే ప్రజల; కల్మష అంటే పాపాలు అనే; అర్ణవ అంటే సముద్రాన్ని; ఉత్తారక అంటే దాటించే; నామ అంటే పేరుగలవాడా; కరుణాపయోనిథీ అంటే దయలో సముద్రం వంటివాడా; భద్రగిరి అంటే భద్రాచలంలో కొలువై ఉన్న; దాశరథీ అంటే దశరథుని కుమారుడైన రామా!

No comments:

Post a Comment