Sunday, December 1, 2019

కృష్ణ శతకం (Krishna Shathakam) - 82

కృష్ణ శతకం (Krishna Shathakam) - 82

చుక్కల నెన్నగ వచ్చును
గ్రక్కున భూరేణువులను గణుతింపనగున్‌
జొక్కపు నీ గుణజాలము
నక్కజమగు లెక్కపెట్ట నజునకు కృష్ణా!


తాత్పర్యం:
ఆకాశంలో నక్షత్రాలను, భూమిపై ధూళిరేణువులను ఎంత కష్టమ్మీదైనా సరే, ఎంతో కొంత లెక్కించగలమేమో. కానీ, అనంతమైన శ్రీకృష్ణ పరమాత్మలోని సద్గుణాలను లెక్క పెట్టడం ఎవరి తరమవుతుంది! ఇది ఆఖరకు ఆ బ్రహ్మకైనా సాధ్యం కాదు. అలాంటిది మానవ మాత్రులం మేమెంత స్వామీ!

Monday, November 18, 2019

సుమతీ శతకం (Sumathi Shathakam) - 76

సుమతీ శతకం (Sumathi Shathakam) - 76

పరనారీ సోదరుడై
పరధనముల కాసపడక పరులకు హితుడై
పరుల దనుబొగడ నెగడక
పరులలిగిన నలుగనతడు పరముడు సుమతీ!


తాత్పర్యం: 
పరస్త్రీలపట్ల సోదరుడిలా మెలగాలి. ఇతరుల ధనానికి ఎంతమాత్రం ఆశపడకూడదు. తోటివారంతా తనను ఇష్టపడేలా ప్రవర్తించాలి. ఎదుటివారు పొగుడుతుంటే ఉప్పొంగిపోకూడదు. ఎవరైనా కోపగించుకొన్నప్పుడు తాను కూడా అదే పంథాలో ఆగ్రహాన్ని ప్రదర్శించరాదు. ఇలాంటి ఉత్తమగుణాలను కలిగివున్నవాడే శ్రేష్ఠుడుగా గుర్తింపబడతాడు.

వేమన శతకం (Vemana Shatakam) - 755

వేమన శతకం (Vemana Shatakam) - 755

నీళ్లలోన మొసలి నిగిడి యేనుగు దీయు
బయట కుక్కచేత భంగపడును
స్థానబలిమిగాని తన బలిమి కాదయా
విశ్వదాభిరామ వినురవేమ!


తాత్పర్యం:
నీళ్లలో ఉన్నంత సేపే మొసలి శక్తి పనిచేస్తుంది. ఏనుగును సైతం నీళ్లలో ఉండి పట్టిందంటే ఎట్టి పరిస్థితుల్లో అది విడువదు. అదే నేలపైకి వచ్చిందా అంతటి మొసలికి కూడా శక్తి క్షీణించినట్లే. ఆఖరకు కుక్కతోకూడా దానికి భంగపాటు తప్పదు. ఎందుకంటే, ఎవరి బలానికైనా అసలు మూలం స్థానవిలువనుబట్టే అని తెలుసుకోవాలి.

కృష్ణ శతకం (Krishna Shathakam) - 81

కృష్ణ శతకం (Krishna Shathakam) - 81

చిలుకనొక రమణి ముద్దులు
చిలుకను శ్రీరామ యనుచు శ్రీపతి పేరుం
బిలిచిన మోక్షము నిచ్చితి
వలరగ మిము దలచు జనుల కరుదా కృష్ణా!!


తాత్పర్యం:
శ్రీ కృష్ణ పరమాత్మ ఎంత దయామయుడంటే, తన నామాన్ని తలచిన వారికి తప్పక మోక్షమిస్తాడు. ఒక చిలుకకు శ్రీరామ అని పేరు పెట్టుకొన్న ఓ స్త్రీ, ఆ మేరకు నిత్యం ఆ పేరుతో దానిని పిలిచినందుకే ఆమెకు మోక్షాన్ని ప్రసాదించాడు. అటువంటిది ఏకంగా ఆయన పేరు తలచిన జనులకు ఎవరికైనా మోక్షాన్ని ఇవ్వకుండా ఉంటాడా!

కుమారీ శతకం (Kumari Shatakam) - 9

కుమారీ శతకం (Kumari Shatakam) - 9

పెనిమిటి వలదని చెప్పిన
పని యెన్నడు జేయరాదు బావల కెదుటన్
గనపడగ రాదు కోపము
మనమున నిడుకొనక యెపుడు మసలు కుమారీ!!


తాత్పర్యం:
ప్రతి మహిళా పుట్టినింటి గౌరవాన్ని నిలుపుతూ, మెట్టినింటి మేలు కోసం పాటుపడాలి. భర్త వద్దని చెప్పిన పని ఎప్పుడూ చేయకూడదు. బావల ముందు అర్థం పర్థం లేకుండా తిరుగకూడదు. చీటికి మాటికి కోపాన్ని ప్రదర్శించకుండా మనసులో కల్మషం లేకుండా మెలగాలి. అలాంటి కోడలును ఆ అత్తింటి వారు కన్నకూతురు వలె చూసుకోకుండా ఉంటారా!

Thursday, November 14, 2019

భాస్కర శతకం (Bhaskara Shatakam) - 86

భాస్కర శతకం (Bhaskara Shatakam) - 86

ఉరుగుణవంతు డొడ్లుదన కొండపకారము సేయునప్పుడున్
బరహితమే యొనర్చు నొకపట్టుననైనను గీడుజేయగా
నెఱుగడు నిక్కమే కదయ దెట్లన గవ్వముబట్టి యెంతయున్
దరువగ జొచ్చినం బెరుగు తాలిమి నీయదె వెన్న భాస్కరా!!


తాత్పర్యం:
మంచి చేసిన వారికి మంచి, చెడు చేసిన వారికి చెడు చేయడంలో గొప్పతనం ఏమీ ఉండదని మన పెద్దలు అంటారు. మంచి చేసిన వారికి మంచి చేయడం మరింత గొప్ప మానవత్వం అనిపించుకొంటుంది. అలాగే, చెడు చేసిన వారికి ప్రతిగా చెడునే చేయకుండా, మంచి చేయడమే ఉత్తమ లక్షణం. ఇదే గుణవంతుని తత్వం కూడా. ఎలాగైతే, పెరుగును ఎంత చిలికినా వెన్ననే వస్తుందో అలా.

కృష్ణ శతకం (Krishna Shathakam) - 80

కృష్ణ శతకం (Krishna Shathakam) - 80

నారాయణ లక్ష్మీపతి
నారాయణ వాసుదేవ నందకుమారా
నారాయణ నిను నమ్మితి
నారాయణ నన్ను బ్రోవు నగధర కృష్ణా!


తాత్పర్యం:
నారాయణ అన్న నామాన్ని ఎన్నిసార్లు పలికినా తనివి తీరదు కదా. ఓ శ్రీ కృష్ణా! నువు మహాలక్ష్మీపతివి. ఇటు వసుదేవునికి, అటు నందునికి సుపుత్రుడవైనావు. బ్రహ్మాండమైన కొండనే ఆభరణంగా ధరించిన వీరుడవు. నాకు నువ్వు తప్ప మరెవరు దిక్కు, నిన్నే నమ్ముకొన్నాను. నను బ్రోవుమయా స్వామీ!

నరసింహ శతకం (Narasimha Shatakam) - 15

నరసింహ శతకం (Narasimha Shatakam) - 15

గౌతమీ స్నానాన గడతేరుదమటన్న మొనసి చన్నీళ్లలో మునుగలేను
దీర్ఘయాత్రలచే గృతార్థు డౌదమటన్న బడలి నీమంబులె నడపలేను
దానధర్మముల సద్గతిని జెందుదమన్న ఘనముగా నాయొద్ద ధనము లేదు
తపమాచరించి సార్థకము నొందుదమన్న నిమిషమైన మనస్సు నిలుపలేను
కష్టములకోర్వ నా చేతగాదు, నిన్ను
స్మరణ జేసెద నా యథాశక్తి కొలది
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!


తాత్పర్యం:
పవిత్ర గౌతమీ (గోదావరి) నదిలో చన్నీళ్ల స్నానం చేయలేను. తీర్థయాత్రలు చేసే ఓపికా లేదు. దానధర్మాలు చేయడానికి కావలసినంత ధనం లేదు. ముక్కు మూసుకొని తపస్సు చేయడానికి మనోనిగ్రహం లేదు. ఇంకే కష్టాలనూ భరించలేను. నాకు చేతనైన మేర నీ నామస్మరణ చేస్తాను. ఇదొక్కటే నాకున్న నిర్మల భక్తికి
నిదర్శనం స్వామీ!

కుమార శతకం (Kumara Shatakam) - 41

కుమార శతకం (Kumara Shatakam) - 41

ఆచార్యున కెదిరింపకు
బ్రోచిన దొర నిందసేయ బోకుము
కార్యా లోచనము లొందజేయకు
మాచారము విడువ బోకుమయ్య కుమారా!


తాత్పర్యం:
నేర్పరులైన వారి వ్యక్తిత్వం అత్యంత విలక్షణం. మన గురువును ఎప్పుడూ ఎదిరించకూడదు. అన్నం పెట్టే యజమానిపై ఎలాంటి నిందలూ వేయరాదు. చేసే పనులను గురించి అదే పనిగా ఆలోచిస్తూ వృథాగా కాలక్షేపం చేస్తూ కూచుంటే ఏ ప్రయోజనమూ ఉండదు. ఇటువంటి మంచి నడవడికలతో మెలిగే వారు నిజమైన నేర్పరులు.

భాస్కర శతకం (Bhaskara Shatakam) - 85

భాస్కర శతకం (Bhaskara Shatakam) - 85

ఊరక వచ్చు బాటుపడ కుండినవైన ఫలంబదృష్టమే
పారగగల్గువానికి బ్రయాసము నొందిన దేవదానవుల్
వారలటుడుండగా నడుమ వచ్చిన శౌరికి గల్గెగాదె శృంగా
రపుబ్రోవు లక్ష్మియును గౌస్తుభరత్నము రెండు భాస్కరా!


తాత్పర్యం:
అదృష్టవంతులకు ఇతరుల ప్రయాసలకు అతీతంగా మంచి ఫలితాలు లభిస్తుంటాయి. ఎదుటివారి కష్టనష్టాల ప్రభావం వీరిపై ఏ మాత్రం పడదు. అందుకే, అదృష్టవంతులకు ఎప్పుడూ నిశ్చింతే. ఎందుకంటే, అన్నీ మంచి ఫలితాలే కనుక. ఎలాగంటే, దేవదానవులు పాలకడలిని చిలుకుతూ కష్టపడుతుంటే, శ్రీమహావిష్ణువుకు లక్ష్మీదేవి లభించినట్లు.

నరసింహ శతకం (Narasimha Shatakam) - 14

నరసింహ శతకం (Narasimha Shatakam) - 14

పసరంబు పంజైన బసులకాపరి తప్పు, ప్రజలు దుర్జనులైన బ్రభుని తప్పు,
భార్య గయ్యాళైన బ్రాణనాథుని తప్పు, తనయుడు దుడుకైన దండ్రి తప్పు,
సైన్యంబు చెదరిన సైన్యనాథుని తప్పు, కూతురు చెడుగైన మాత తప్పు,
అశ్వంబు దురుసైన నారోహకుని తప్పు, దంతి మదించ మావంతు తప్పు,
ఇట్టి తప్పు లెఱుంగక యిచ్చ వచ్చి
నటుల మెలగుదు రిప్పుడీ యవని జనులు
భూషణ వికాస! శ్రీధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!!


తాత్పర్యం:
పశువులు దారితప్పితే కాపరిది, ప్రజలు చెడ్డవారైతే రాజుది, భార్య గయ్యాళితనానికి భర్తది, కొడుకు దుడుకుతనానికి తండ్రిది, కూతురు చెడునడతకు తల్లిది, సైన్యం పిరికిదైతే సైన్యాధిపతిది, గుర్రం ఆగిపోతే రౌతుది.. తప్పవుతుంది. ఎవరికి వారు ఇలా తమ తప్పుల్ని తెలుసుకోక ఇష్టం వచ్చినట్లు వుంటే ఎలా? నీవైనా వారికి జ్ఞానోదయం కలిగించు స్వామీ!!

భర్తృహరి సుభాషితాలు (Subhashitaalu) - 45

భర్తృహరి సుభాషితాలు (Subhashitaalu) - 45

మాతా నిందతి నాభినందతి పితా భ్రాతా న సంభాషతే!
భృత్యః కుప్యతి నా2నుగచ్ఛతి సుతాః కాంతాపి నాలింగ్యతే!
అర్థప్రార్థనశంకయా న కురుతే సల్లాపమాత్రం సుహృత్!
తస్మా దర్థ ముపార్జయ శ్రుణు సఖే హ్య2ర్థేన సర్వే వశాః!!

ఓయి మిత్రమా!నే చెప్పు హితమాలింపుము.ధనము లేనిచో తల్లి దూషించును; తండ్రి మెచ్చుకొనడు; సోదరులు మాట్లాడరు; సేవకుడు మిడిసిపడును; కుమారుడును చెప్పినమాట వినడు; భార్య దగ్గరకు చేరబోదు; బదులు అడుగుననే శంకతో మిత్రులు మాట కూడ ఆడరారు; గనుక ధనము ఆర్జింపుము. ధనమునకు అందరూ వశులగుదురు.

అదన్నమాట సంగతి. అందుకే ధనసంపాదన కోసం మనం ఇన్ని పాట్లు పడేది.కాని అదే అంత ముఖ్యమా? దానిని మించిన విలువలు ఇంకా ఎన్నో ఉన్నాయే.మరి వాటి సంగతి? ఇది ఎవరికి వారుగా నిర్ణయించుకోవలసిన విషయం.

కృష్ణ శతకం (Krishna Shathakam) - 79

కృష్ణ శతకం (Krishna Shathakam) - 79

వడుగుడవై మూడడుగుల
నడిగితివౌ భళిరభళిర యఖిల జగంబుల్
తొడిగితివి నీదు మేనునన్
గడు చిత్రము నీ చరిత్ర ఘనమవు కృష్ణా!


తాత్పర్యం:
శ్రీకృష్ణ పరమాత్మ లీలలు ఎంత చెప్పినా తక్కువే. వామనావతారం ఎంత విచిత్రం! బాలబ్రహ్మచారివై బలి చక్రవర్తిని కేవలం మూడడుగుల జాగను మాత్రమే దానంగా అడిగినావు. రెండే రెండు అడుగులతో అఖిల జగాలను అన్నింటినీ ఎలా ఆక్రమించావో కదా. ముచ్చటగా మూడో అడుగుతో బలిని కబలించిన నీ ఘనమైన చరిత్ర అద్భుతం కదా.

సుమతీ శతకం (Sumathi Shathakam) - 75

సుమతీ శతకం (Sumathi Shathakam) - 75

కమలములు నీట బాసిన
కమలాప్తుని రశ్మి సోకి కమిలిన భంగిన్
తమ తమ నెలవులు దప్పిన
తమ మిత్రులు శత్రులౌట తథ్యము సుమతీ!


తాత్పర్యం:
తామర (కమలం) నీటిలో ఉన్నంత సేపు సూర్యరశ్మి తాకి వికసిస్తుంది. కానీ, దానిని నీటినుంచి బయటకు తెస్తే అదే సూర్యరశ్మి తాకి కొంత సమయానికి వాడిపోతుంది. ఎవరైనా సరే, తాము ఉండాల్సిన చోట ఉంటేనే విలువ, గౌరవం. స్థానభ్రంశం చెందితే జరగకూడనివి జరగవచ్చు. ఒక్కోసారి మిత్రులు సైతం శత్రువులుగా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

వేమన శతకం (Vemana Shatakam) - 754

వేమన శతకం (Vemana Shatakam) - 754

హీనగుణము వాని నిలుజేర నిచ్చిన
నెంతవానికైన నిడుము గలుగు
ఈగ కడుపు జొచ్చి యిట్టట్టు సేయదా
విశ్వదాభిరామ వినురవేమ!


తాత్పర్యం:
దుర్గుణాలు కలిగిన వారిని ఎంత మాత్రం దరి చేరనీయరాదు. వీలైనంత వరకు వారిని దూరంగా ఉంచడమే మేలు. పొరపాటున అలాంటి వారిని ఇంట్లో వుంచుకొంటే, ఎంతటి వారికైనా సరే కష్టాలు తప్పవు. కర్మ కాలి ఈగ ఒకవేళ మన కడుపులోకి చేరితే.. ఇంకేమైనా ఉందా? లోన అది చేసే హాని ఇంతా అంతా కాదు కదా.

Monday, November 11, 2019

దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 83

దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 83

అండజవాహ నిన్ను హృదయంబున నమ్మిన వారి పాపముల్‌
కొండల వంటివైన వెసగూలి నశింపక యున్నె సంత తా
ఖండల వైభవోన్నతులు గల్గక మానునె మోక్ష లక్ష్మికై
దండ యొసంగకున్నె తుద దాశరథీ కరుణాపయోనిధీ!


తాత్పర్యం:
స్వామీ! రామచంద్రమూర్తీ!! నిన్నే నమ్మి, మనసారా కొలిచిన వారికి నువ్వెన్నటికీ లోటు చేయవు కదా. అలాంటి వారి పాపాలు కొండలంతగా వున్నా సరే వాటిని నువ్వు నశింపజేస్తాయి. నీ కరుణా కటాక్షాలతో వారికి అఖండ వైభవాలు కలుగకుండా ఉండవు! ఆఖరకు మోక్షలక్ష్మి కూడా వారిని వరించేస్తుంది కదా.

వేమన శతకం (Vemana Shatakam) - 753

వేమన శతకం (Vemana Shatakam) - 753

ఎద్దుకైనగాని యేడాది తెల్పిన
మాట దెలసి నడచు మర్మమెఱిగి
మొప్పె తెలియలేడు ముప్పదేండ్లకునైన
విశ్వదాభిరామ వినురవేమ!


తాత్పర్యం:
మూర్ఖుని మనసు ఎప్పటికీ మారేది కాదు. దానిని మార్చడం ఎవరి తరమూ కాదు కూడా. అందుకే, అలాంటి వారినే మూర్ఖుడు అన్నారు. ఆఖరకు మనిషి వలె ఆలోచించలేని ఎద్దుకైనా ఒక ఏడాదిపాటు ఒక పద్ధతిని అలవాటు చేస్తే అది మన మర్మాన్ని ఎరిగి నడచుకొంటుంది. కానీ, ముప్పయేండ్లపాటు ఎన్ని బోధించినా మూర్ఖునికి బోధపడదు.

కుమార శతకం (Kumara Shatakam) - 40

కుమార శతకం (Kumara Shatakam) - 40

తనయుడు చెడుగై యుండిన
జనకుని తప్పన్నమాట సతమెఱుగుదు గా
వున నీ జననీ జనకుల
కు నపఖ్యాతి యగురీతి గొనకు కుమారా!


తాత్పర్యం:
పిల్లలను కన్నంత మాత్రాన మన బాధ్యత తీరిపోతుందా? వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దనవసరం లేదా? గాలికి వదిలేస్తే ఏ పిల్లలైనా చెడుగులై పోతారు. అందుకే, ఉదా॥కు కుమారుడు చెడ్డవాడయ్యాడంటే తండ్రిదే తప్పుగా భావించాలి. కూతురు విషయంలో తల్లి బాధ్యత వహించాలి. అలాగే, పిల్లలు కూడా తమ కన్నవారి పరువు తీసే పనులు చేయకూడదు.

దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 82

దాశరథి శతకం(Dhasharathi Shatakam) - 82

శ్రీ రఘురామ చారుతులసీ దళధామ శమక్షమాది శృం
గార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్య రమాలలామ దు
ర్వార కబంధరాక్షస విరామ జగజ్జన కల్మషార్ణవో
త్తారకనామ భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ!


తాత్పర్యం:
శ్రీరఘువంశ తిలకుడు, పవిత్ర తులసీమాలలు ధరించినవాడు, శాంతి, ఓర్పు వంటి సుగుణాల కోవిదుడు, మూడు లోకాల వాసులు కొనియాడదగిన శౌర్యపరాక్రమాలను ఆభరణాలుగా గలవాడు, కబంధుడు వంటి ఎందరో రాక్షసులను హతమార్చినవాడు, ప్రజల పాపాలను ఉద్ధరించేవాడు, దయసాగరుడు.. ఆ రామచంద్రమూర్తి ఎంత గొప్పవాడో కదా.

భాస్కర శతకం (Bhaskara Shatakam) - 84

భాస్కర శతకం (Bhaskara Shatakam) - 84

తడవగరాదు దుష్టగుణుదత్త మెరుంగ యెవ్వరైన నా
చెడుగుణమిట్లు వల్లదని చెప్పిన గ్రక్కున గోపచిత్తుడై
గదుదెగ జూచుగా మఱుగగాగిన తైలము నీటిబొట్టుపై
బదునెడ నాక్షణం బెగసి భగ్గు మండకయున్నె భాస్కరా!!


తాత్పర్యం:
దుష్టులకు దూరముండడమే మంచిది. ఎందుకంటే, వారి గుణమే అంత. దుర్జనులని తెలిశాక ఏ మాత్రం వారికి నీతులు చెప్పే సాహసానికి పూనుకోకూడదు. ఎలాంటి హితవాక్యాలూ వారి చెవి కెక్కవు. పైగా, కోపంతో మంచిమాటలు చెప్పిన వారికే చెడు తలపెడతారు. బాగా కాగిన నూనె నీటిబిందువును ఎలాగైతే దహించి వేస్తుందో అలాగ!

కుమారీ శతకం (Kumari Shatakam) - 8

కుమారీ శతకం (Kumari Shatakam) - 8

పతి కత్తకు మామకు స
మ్మతిగాని ప్రయోజనంబు మానగ వలయున్
హిత మాచరింపవలయును
బ్రతుకున కొకవంక లేక పరగు గుమారీ!


తాత్పర్యం:
పుట్టినిల్లయినా, మెట్టినిల్లయినా పెద్దలమాటను కాదని పిల్లలు చేసే పనులేవీ శోభిల్లవు. పెద్దలుకూడా వారి మనసులు బాధ పెట్టకుండా
ప్రవర్తించాలి. అప్పుడే గృహాలు స్వర్గసీమలవుతాయి. భర్త, అత్త, మామలకు ఇష్టం లేని పనులను కోడలు ఎంత ప్రయోజనకరమైనా చేయకపోవడమే మంచిది. అలా ఎవరూ వేలెత్తి చూపించలేని నేర్పరితనంతో
జీవించగలగాలి.

నరసింహ శతకం (Narasimha Shatakam) - 13

నరసింహ శతకం (Narasimha Shatakam) - 13

మాన్యంబులీయ సమర్థుడొక్కడు లేడు, మాన్యముల్ చెఱుప సమర్థులంత,
యెండిన యూళ్ల గోడెఱిగింప డెవ్వడు, బండిన యూళ్లకు బ్రభువులంత,
యితడు పేదయటంచు నెఱింగింప డెవ్వడు, గలవారి సిరులెన్నగలరు చాల,
దన యాలి చేష్టలదప్పెన్న డెవ్వడు బెఱకాంత తప్పెన్న బెద్దలంత,
యిట్టి దుష్టు కధికార మిచ్చినట్టి
ప్రభువు తప్పులటంచును బలుకవలెను
భూషణ వికాస! శ్రీధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!


తాత్పర్యం:
భూములిచ్చే వారొక్కరైనా ఉండరు కానీ, ఆక్రమణకైతే సిద్ధం. బంజర్ల గోడు ఎవరికీ పట్టదు కానీ పండిన పంటలకైతే ముందుంటారు. పేదవారిని పట్టించుకొనే వారుండరు కానీ సంపన్నుల సిరులైతే కావాలి. తమ భార్యల తప్పులు పట్టవు కానీ, పరస్త్రీలపట్ల చింత ఒలకబోస్తారు. ఇలాంటి వారిని అందలమెక్కించే ముందు ప్రభువులే ఆలోచించాలి కదా స్వామీ!

కృష్ణ శతకం (Krishna Shathakam) - 78

కృష్ణ శతకం (Krishna Shathakam) - 78

దండమయా విశ్వంభర
దండమయా పుండరీకదళ నేత్రహరీ
దండమయా కరుణానిధి
దండమయా నీకు నెపుడు దండము కృష్ణా!!


తాత్పర్యం:
సమస్త విశ్వాన్ని భరిస్తూ పాలించేవాడు, తామర రేకుల వంటి అద్భుతమైన కన్నులు గలవాడు, హృదయం నిండా కరుణనే నింపుకొన్న సముద్రమంతటి దయామయుడు ఎవరంటే శ్రీమహావిష్ణువే. సృష్టికంతటికీ స్థితికారుడైన ఆ బ్రహ్మాండ నాయకుణ్ణి ఎంత వేడుకొన్నా తక్కువే. ఎన్నిసార్లు ఆయనకు ప్రణామాలు సమర్పించినా తనివితీరదు కదా.

కుమార శతకం (Kumara Shatakam) - 39

కుమార శతకం (Kumara Shatakam) - 39

తమ్ములు తమయన్న యెడ భ
యమ్మును భక్తియును గలిగి యారాధింపన్‌
దమ్ముల నన్నయు సమ్మో
దమ్మును బ్రేమింప గీర్తి దనరు కుమారా!


తాత్పర్యం:
రక్తసంబంధంలోని గొప్పతనం ఇదే కదా మరి. ప్రత్యేకించి సొంత అన్నదమ్ములైన వారు ఎలా వుండాలో చెప్పిన నీతిపద్యమిది. తమ్ములు తమ అన్నపట్ల భయంతోపాటు భక్తినీ కలిగి ఉండాలె. అలాగే, అన్నలు కూడా తమ తమ్ములపట్ల అంతే అనురాగాన్ని చూపించాలె. అప్పుడే ఆ అన్నదమ్ముల అనుబంధం అజరామరం (శాశ్వతం) అవుతుంది.

కృష్ణ శతకం (Krishna Shathakam) - 77

కృష్ణ శతకం (Krishna Shathakam) - 77

దశకంఠుని బరిమార్చియు
కుశలముతో సీత దెచ్చి కొనియు నయోధ్య
న్విశదముగ కీర్తి నేలితి
దశరథ రామావతార ధన్యుడ కృష్ణా!


తాత్పర్యం:
రామావతారంలో దశరథ మహారాజుకు సుకుమారునిగా జన్మించితివి. ఆసాంతం అద్భుతమైన రామావతారాన్ని పరిసమాప్తి చేశావు. పది తలల రావణాసురుని హతమార్చావు. సీతమ్మతో క్షేమంగా అయోధ్యా నగరానికి వచ్చావు. యుగయుగాలుగా కీర్తింపదగ్గ స్థాయిలో రాజ్యాన్ని పరిపాలించావు. నీవెంత ధన్యుడవో కదా కృష్ణా!

Friday, November 8, 2019

భాస్కర శతకం (Bhaskara Shatakam) - 83

భాస్కర శతకం (Bhaskara Shatakam) - 83

అదను దలంచికూర్చి ప్రజనాదర మొప్ప విభుండు కోరినన్
గదిపి పదార్థ మిత్తురటు కానక వేగమె కొట్టి తెండనన్
మొదటికి మోసమౌ, బొదుగు మూలము గోసిన బాలుగల్గునే
పిదికిన గాక భూమిబశుబృందము నెవ్వరికైనా భాస్కరా!


తాత్పర్యం:
పాలిచ్చే గోవునైనా, శ్రమకోడ్చే పశువులనైనా మచ్చికతో ఆదరింపజేసుకోవాలి. కానీ, పాలకోసం పొదుగును కోయడం, పనుల కోసం హింసించడం మంచిదికాదు. పాలకుడు కూడా ప్రజల మనసును తెలుసుకొని పన్నులు విధించాలి. అలా కాకుండా దౌర్జన్యానికి దిగితే వారి మనసు గెలువలేరు. కనుక, దేనినైనా ప్రేమతోనే జయించాలి మరి.

నరసింహ శతకం (Narasimha Shatakam) - 12

నరసింహ శతకం (Narasimha Shatakam) - 12

నరసింహా! నీ దివ్యనామ మంత్రముచేత దురితజాలము లెల్ల దోలవచ్చు
నరసింహా! నీ దివ్యనామ మంత్రముచేత బలువైన రోగముల్ పాపవచ్చు
నరసింహా! నీ దివ్యనామ మంత్రముచేత రివు సంఘములు సంహరింపవచ్చు
నరసింహా! నీ దివ్యనామ మంత్రముచేత దండహస్తుని బంట్ల దఱుమవచ్చు
భళిర! నే నీ మహామంత్ర బలముచేత
దివ్య వైకుంఠ పదవి సాధించవచ్చు!
భూషణ వికాస! శ్రీధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!


తాత్పర్యం:
పావనమైన నరసింహ మంత్ర ప్రభావంతో అన్ని పాపాలనూ తొలగించుకోవచ్చు. తీవ్ర రోగాలను దూరం చేసుకోవచ్చు. విరోధులను మట్టుపెట్టవచ్చు. యమభటులనైనా పారిపోయేలా చేయవచ్చు. నీ నామ మహత్తును తెలుసుకోవడం ఎవరి తరమూ కాదు. నేనైతే చక్కగా దివ్యమైన ఆ వైకుంఠ పదవినే సాధిస్తాను. అనుగ్రహించు స్వామీ!

సుమతీ శతకం (Sumathi Shathakam) - 74

సుమతీ శతకం (Sumathi Shathakam) - 74

సరసము విరసము కొరకే
పరిపూర్ణ సుఖంబు అధికబాధల కొరకే
పెరుగుట విరుగుట కొరకే
ధర తగ్గుట హెచ్చుకొరకే తథ్యము సుమతీ!


తాత్పర్యం:
ఏదైనా అతి పనికిరాదని పెద్దలు అన్నారు. ఒక్కోసారి విపరీతానికి పోతే, సరసం విరసానికి, పరిపూర్ణ సుఖం కూడా అధిక బాధలకు, నిలువునా పెరగడం విరగడానికి దారితీస్తాయి. ధరలు తగ్గుతున్నాయని సంతోషపడితే రాబోయే కాలంలో పెరగడానికే దీనినొక సూచనగా భావించాలన్నమాట. అందుకే, ఒదుగుతూ ఎదిగితే ఏ బాధా లేదన్నారు.

వేమన శతకం (Vemana Shatakam) - 752

వేమన శతకం (Vemana Shatakam) - 752

చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు
కొంచెమైన నదియు గొదవు గాదు
విత్తనంబు మఱ్ఱివృక్షంబునకు నెంత
విశ్వదాభిరామ వినురవేమ!


తాత్పర్యం:
పుణ్యం కొంచెమైనా సరే, దానిని చిత్తశుద్ధితో చేయాలి. అప్పుడు దానికి తప్పక తగిన ప్రతిఫలం లభిస్తుంది. మర్రివిత్తనం చిన్నదైనంత మాత్రాన అది పెద్ద వృక్షంగా ఎదగకుండా ఉంటుందా! అందుకే, మంచిపని మంచివిత్తనంతో సమానమని పెద్దలు అన్నారు. సద్బుద్ధితో ఏది చేసినా, ఎంత చేసినా విజయం సిద్ధిస్తుందని అందరూ తెలుసుకోవాలి!

కుమార శతకం (Kumara Shatakam) - 38

కుమార శతకం (Kumara Shatakam) - 38

ఉన్నను లేకున్నను పై
కెన్నడు మర్మంబు దెలుప నేగకుమీ నీ
కన్న తల్లిదండ్రుల యశం
బెన్న బడెడు మాడ్కి దిరుగు మెలమి కుమారా!


తాత్పర్యం:
ఎవరూ పుట్టుకతో సంపన్నులు కాలేరు. శ్రమతోనే ఏదైనా సాధ్యమవుతుంది. కాబట్టి, ఇంట్లో సంపదలు ఉన్నా, లేకున్నా కుటుంబ రహస్యాలు బయటపెడుతూ, పరువు తీసే పనులు చేయరాదు. మనల్ని కన్నవారికి పేరు ప్రఖ్యాతులు వచ్చేలా, పదిమంది వారిని పొగిడేలానే మన ప్రవర్తనలు ఉండాలి సుమా.

కుమారీ శతకం (Kumari Shatakam) - 7

కుమారీ శతకం (Kumari Shatakam) - 7

ఎన్నాళ్లు బ్రతుక బోదురు
కొన్నాళ్లకు మరణదశల గ్రుంగుట జగమం
దున్నట్టివారి కందఱి
కిన్నిహితము సతము మంచి కీర్తి కుమారీ!


తాత్పర్యం:
సృష్టిలో చావు పుట్టుకలు సహజం. లోకంలో ఎవరైనా సరే, ఎన్నాళ్లో బతకలేరు. అందరూ ఎప్పటికైనా మరణించక తప్పదు. ఎంతటి వారికైనా చావు తథ్యమనే సత్యాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఈ మేరకు సద్గుణాలను అలవర్చుకొని సత్కర్మలతో ఆదర్శవంతమైన జీవితం గడపాలి. అప్పుడే మరణించిన తర్వాత కూడా శాశ్వత కీర్తిని పొందుతారు.

వేమన శతకం (Vemana Shatakam) - 751

వేమన శతకం (Vemana Shatakam) - 751

జాతి, కులములంచు జనులెల్ల బద్దులై,
భావ పరమునందు బ్రాలుమాలి,
చచ్చి పుట్టు చుంద్రు జడమతులై భువి
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
జాతులు, కులాలు, మతాలు అంటూ వాటికి బానిసలై, వివేచనా ఙానము నశించి, చచ్చి పుడుతుంటారు మూర్ఖులు. వీరు ఎన్ని జన్మలెత్తినా మనుషులందరూ సమానమే అని తెలుసుకోలేరు. మనమందరూ సోదరభావముతో కులభేదాలు విడిచి జీవించినప్పుడే ఈ భూదేవికి అసలైన శాంతి.

వేమన శతకం (Vemana Shatakam) - 750

వేమన శతకం (Vemana Shatakam) - 750

కలిమిజూచియీయ గాయమిచ్చినయట్లు
సమున కీయ నదియు సరసతనము
పేదకిచ్చు మనువు పెనవేసినట్లుండు
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
తనకంటే ధనికునికి పిల్లనిచ్చినచో, శరీరముకోసి ఇచ్చినంత భాద పెట్టగలరు. మనము చేసిన శ్రమ మాత్రమే మిగులుతుంది. సమానునికి ఇస్తే కొంత నయము. మనకంటే పేద వానికిస్తే ఆ పొత్తు పది కాలాలు ఉంటుంది. కాబట్టి పొత్తులోనైనా పంతములోనైనా సమఉజ్జి అవసరము.

వేమన శతకం (Vemana Shatakam) - 749

వేమన శతకం (Vemana Shatakam) - 749

యాత్రపోయినాత డెన్నాళ్ళు తిరిగిన
బాదమైన ముక్తి పదవి గనడు
మనసు నిల్పునతడు మహనీయ మూర్తిరా!
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
మనసులో మలినము పెట్టుకుని ఎన్ని యాత్రలు చేసినా ముక్తి రాదు. నిశ్చలమైన మనసు కలవాడే ఉత్తమోత్తముడు. కాబట్టి మనలోని చెడుని తొలగించి మంచిని పెంచుకోవడానికి ప్రయత్నించాలి.

వేమన శతకం (Vemana Shatakam) - 748

వేమన శతకం (Vemana Shatakam) - 748

జాతి వేఱులేక జన్మక్రమంబున
నెమ్మదిన నభవుని నిలిపెనేని
అఖిల జనులలోన నతడు ఘనుడండయా!
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
పుట్టిన నాటినుంచే జాతి భేదముమరచి సర్వేశరుడను మనసులో నిల్పినవాడే ఉత్తముడు. అతడే ముక్తిని పొందగలడు. కాబట్టి అందరూ కుల మత బేధాలు వదిలి శాంతిగా ఉండి సజ్జనులు కావాలి.

Wednesday, November 6, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 747

వేమన శతకం (Vemana Shatakam) - 747

మునిగి మునిగి మునిగి ముద్దయై ముద్దయై
వనరి వనరి వనరి పక్కి పక్కి
తిరిగి తిరిగి తిరిగి దిమ్మరైపోదురు
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
తత్వము తెలియని మూర్ఖులు పుణ్యతీర్ధాలలో మునిగినా, కాకులవలే దేవాలయాలన్ని తిరిగినా, కడుపు కాల్చుకుని ఉపవాసాలు చేసినా ముక్తి లభించదు.

వేమన శతకం (Vemana Shatakam) - 746

వేమన శతకం (Vemana Shatakam) - 746

బల్లిపలుకులు విని ప్రజలెల్ల తమ పనుల్
సఫలములగు ననుచు సంతసించి,
కానిపనులకు దమ కర్మ మటందురు
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
మూర్ఖులు ప్రయత్నమేమి లేకుండా బల్లి పలుకులు వినగానే తమ కార్యము సఫలమవుతుందని సంతోషిస్తారు. ఒకవేళ అవకపోతే తమ కర్మమని వాపోతారు. పనులు ప్రయత్నముతో అవుతాయని ఈ మూర్ఖులకి ఎంత చెప్పినా అర్దం కాదు. శకునాలు విడిచి కష్టపడుట మేలు.

వేమన శతకం (Vemana Shatakam) - 745

వేమన శతకం (Vemana Shatakam) - 745

వేలకొలది భువిని వేషముల్ దాల్తురు
ప్రాలుమాలి బువ్వఫలముకొఱకు
మేలుకాదు; మదిని మిన్నందియుండుము
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
ఈ లోకములో కూటి కొరకు, కోటి వేషాలు వేస్తారు జనులు.ఇటువంటివన్ని తృప్తిలేని జీవితాలు. ఎన్ని పనులుచేసినా వీరికి తృప్తి ఉండదు. అది మన మనసులో ఉంటుందని తేలుసుకోలేరు, మూర్ఖులు.

వేమన శతకం (Vemana Shatakam) - 744

వేమన శతకం (Vemana Shatakam) - 744

ధైర్యయుతున కితర ధనమైన నరు
దాన మిచ్చినపుడె తనకు దక్కె
ఎలమి మించుపనికి నెవరేమి సేతురు?
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
ధైర్యవంతుడు ఎటువంటి కార్యముచేసినా సఫలమవుతుంది. దాని ఫలములు ఖచ్చితంగా దక్కుతాయి. పైగా అది తన వద్ద ఉంచుకోక ఇతరులకు దానిమిస్తాడు. ఇటువంటి వాడు ఉత్తములలోకెల్ల ఉత్తముడు. ఈ లోకములో దెన్నైనా ధైర్యముతో సాధించవచ్చు, కాబట్టి పిరికితనము కట్టిపెట్టి ధైర్యముతో పని మొదలుపెట్టాలి.

వేమన శతకం (Vemana Shatakam) - 743

వేమన శతకం (Vemana Shatakam) - 743

దేవుడనగ వేఱుదేశమందున్నాడే?
దేవుడనగ దనదు దేహముపయి
వాహనంబునెక్కి వడిగదులును చూడు
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
దేవుడనేవాడు ఇంకో దేశంలోనో ఇంకో లోకంలోనో ఉన్నాడా ఏమిటి. దైవము మన శరీరంలోని అణువణులో ఇమిడి ఉన్నాడు. ఈ సత్యాన్ని తెలుసుకోలేక మూర్ఖులు వాహనమెక్కి దేవాలయాల్లో దైవ వేటకు బయలుదేరుతారు.

వేమన శతకం (Vemana Shatakam) - 742

వేమన శతకం (Vemana Shatakam) - 742

ప్రజలెఱుంగ బ్రతుకు బట్టభద్రుడు కాడు
పై గిరీటముండు బ్రభుడుకాడు
ఓగు దెలిసి పలుకు యోగీశ్వరుడుకాడు
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
ధైర్యవంతుడు పట్టభద్రుడుకాకున్నను ప్రజలు గుర్తిస్తారు, రాజు కాకున్నను గౌరవిస్తారు అలాగే యోగి కాకున్నను మంచి చెడ్డలు ఎరిగి జాగ్రత్తగా మాట్లడుతారు. కాబట్టి సమాజంలో మన్నన పొందడానికి ధైర్యం కలిగి ఉండాలి. చెడ్డని ఎదిరించగలగాలి.

వేమన శతకం (Vemana Shatakam) - 741

వేమన శతకం (Vemana Shatakam) - 741

రక్తిలేని పనులు రమ్యమై యుండునా?
రక్తికలిగెనేని రాజు మెచ్చు
రాజు మెచ్చు రక్తి రమణులు మెత్తురు
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
మనకు ఇష్టము లేని పనులు చేస్తే మన దగ్గరి వారి మెప్పు కూడ పొందలేము. అదే ఏ పనైనా మనసుపెట్టి ఇష్టముతో చేస్తే రాజు కూడ మెచ్చుకుంటాడు. రాజేంటి, అందమైన యువతుల మెప్పుకూడ అవలీలగా పొందవచ్చు. కాబట్టి చేసే ప్రతి పని ఇష్టపడి శ్రద్దగా చేయాలి.

వేమన శతకం (Vemana Shatakam) - 740

వేమన శతకం (Vemana Shatakam) - 740

సకల విద్యలందు సంపన్నులైయున్న
నట్టివారు పరిచయమున జౌక
పెరటిచెట్టు మందు పరికింప మెచ్చరు
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
పెరటిలో ఉన్న చెట్టు ఎలగైతే మందుగా పనికిరాదో, అలాగే బాగా పాండిత్యమున్న వారు మనకు దగ్గరివారైతే, వారి యందు వారి పాండిత్యమందు మనకు చులకన భావము కలుగుతుంది.

వేమన శతకం (Vemana Shatakam) - 739

వేమన శతకం (Vemana Shatakam) - 739

చిలుకనోరుగట్టి చిత్తజుమెడగటి
కచ్చడంబు బిగియగట్టికొన్న
మనసు వశముగాదె? మహినేమి పాపమో?
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
తీయగా పలికే నోటిని నొక్కి, మన్మథుని నిగ్రహించడానికి గోచి బిగించి కట్టినా మనసు మన మాట వినదు. ఇదెక్కడి కర్మరా నాయనా?

వేమన శతకం (Vemana Shatakam) - 738

వేమన శతకం (Vemana Shatakam) - 738

ఘటము నింద్రియముల గట్టివేయగలేక
చావు వచ్చునపుడు సన్న్యసించు
నాత్మశుద్దిలేక యందునా మోక్షంబు?
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
వయస్సులో ఉన్నప్పుడు ఇంద్రియ నిగ్రహములేక, ముక్తి కొరకు మరణకాలమాసన్నమవగానే సన్న్యాసము తీసుకొందురు. అంత మాత్రముచేత ముక్తి కలుగదు. అత్మశుద్ది ఇంద్రియ నిగ్రహము ఉన్నప్పుడే ముక్తి కలుగుతుంది.

Tuesday, November 5, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 737

వేమన శతకం (Vemana Shatakam) - 737

దగ్గఱకుము పాపదాంభికులము నీవు
మోసపుత్తురయ్య దోసమనక
క్రూరమృగములట్టివారురా నమ్మకు
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
తీయని మాటలు చెప్పే దాంభికులు మహ మోసగాళ్ళు. వారి దగ్గరకు పొరపాటున కూడ చేరకూడదు. క్రూర జంతువులులాంటి వారు, ఇతరులను మోసపుచ్చడం పాపమని అనుకోక తెలికగా మోసపుచ్చుతారు.

వేమన శతకం (Vemana Shatakam) - 736

వేమన శతకం (Vemana Shatakam) - 736

చదువు చదవనేల? సన్యాసి కానేల?
షణ్మతముల జిక్కి చావనేల?
అతని భజనచేసి యాత్మలో దెలియుండీ
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
సన్యాసి అయ్యి వేదాంతాలన్ని చదివి ఆరు మతాలలో చిక్కి చావడం కన్నా, అత్మతత్వాన్ని తెలుసుకోని నిర్గుణస్వరూపుడైన భగవంతుని సేవించడం ఉత్తమం.

వేమన శతకం (Vemana Shatakam) - 735

వేమన శతకం (Vemana Shatakam) - 735

కొండ రాళ్ళు తెచ్చి కోరిక గట్టిన
గుళ్ళలోన త్రిగి కుల్లనేల
పాయరాని శివుడు ప్రాణియై యుండంగ
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
కొండలు పగులగొట్టి తెచ్చిన రాళ్ళతో గుళ్ళు కట్టి ఆ గుళ్ళకు యాత్రలుగా పోయి ఆ రాళ్ళ మద్యనే శివుడున్నాడనుకోవడం అఙానం. ప్రాణంతో ఉన్న మనుష్యుల్లో ఉన్న దేవునికోసం ప్రాణంలేని రాళ్ళలో వెతకడం శుద్ద దండగ. మానవుడే దేవుడు.

వేమన శతకం (Vemana Shatakam) - 734

వేమన శతకం (Vemana Shatakam) - 734

రాతి బసవని గని రంగుగా మొక్కుచూ
గనుక బసవనిగని గుద్దుచుండ్రు
బసవ భక్తులెల్ల పాపులూ తలపోయ
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:- జీవం లేని నందిని మొక్కి జీవమున్న ఎద్దును భాదలు పెడుతూ ఉంటారు మూర్ఖులు. ఇలాంటి మూర్ఖులను మించిన పాపులు ప్రపంచంలో ఉండరు.

వేమన శతకం (Vemana Shatakam) - 733

వేమన శతకం (Vemana Shatakam) - 733

టిప్పణములు చేసి చప్పని మాటలు
చెప్పుచుందురన్ని స్మృతులు శ్రుతులు
విప్పి చెప్పరేల వేదాంతసారంబు?
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
తమ పాండిత్యాన్ని తెలియచెప్పడానికి మూర్ఖులు వేదాలని, ధర్మ శాస్త్రాలని, వ్యాఖ్యలని వివరిస్తారు కాని వీటి యోక్క సారాంశాన్ని ఒక్క ముక్కలో మాత్రం చెప్పలేరు. వీరి గొప్పతనమంత పదాల గారడీ తప్ప పాండిత్యం శూన్యం.

వేమన శతకం (Vemana Shatakam) - 732

వేమన శతకం (Vemana Shatakam) - 732

తనువులస్థిరమని ధనము లస్థిరమని
తెలుపగలడు తాను తెలియలేడు
చెప్పవచ్చు బనులు చేయుట కష్టమౌ
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
శరీరము, ధనము అశాశ్వతాలని దాంభికుడు ఇతరులకు నీతులు చెపుతూ ఉంటాడు, కాని తాను మాత్రము ఆచరించడు. ఇటువంటి నీతులు చెప్పడం తెలికే గాని చేయడం మహా కష్టం.

వేమన శతకం (Vemana Shatakam) - 731

వేమన శతకం (Vemana Shatakam) - 731

పరమయోగులమని పరము చేరగలేని
మాయజనులకెట్లు మంచి కలుగు?
వేషములను విడిచి విహరిమప ముక్తియౌ
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
యోగిలాగ వేషలు కట్టి కొన్ని బోధనలు చేసినంత మాత్రాన దాంభికులు ముక్తి పొందలేరు. కాబట్టి ఇలాంటి వేషాలు విడిచి సక్రమంగా నడవాలి. మంచి నడవడికె ముక్తికి మూల మార్గం.

వేమన శతకం (Vemana Shatakam) - 730

వేమన శతకం (Vemana Shatakam) - 730

నీళ్ళమునగనేల? నిధులబెట్టగనేల?
మొనసి వేల్పులకును మ్రొక్కనేల?
కపటకల్మషములు కడుపులోనుండగా
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
కడుపులో కపటము, కల్మషము పెట్టుకుని దానధర్మాలకని డబ్బు నిల్వచేసి, పుణ్య స్నానాలు చేసి, దేవునికి మొక్కినంత మాత్రాన ప్రయోజనము ఉండదు. ఎటువంటి చెడు ఆలొచనలు లేని మంచి మనసుతో దేవుని తలచుకుంటే చాలు.

వేమన శతకం (Vemana Shatakam) - 729

వేమన శతకం (Vemana Shatakam) - 729

దొంగమంత్రములకు దొరకునా మోక్షంబు
చేతగానిచేత చెల్లదెపుడు
గురువటండ్రె వాని గుణమీనుడనవలె
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
నీచమైన దాంభికులు గురువులమని నీచమంత్రములు చెప్పి మోసగిస్తుంటారు. అట్టి వారు గుణవిహీనులు. వారిని నమ్మరాదు. మనకు ఆత్మశుద్ది లేకుండా అటువంటివారు చెప్పె మాటలు ఎన్ని విన్నా మోక్షము లభించదు.

వేమన శతకం (Vemana Shatakam) - 728

వేమన శతకం (Vemana Shatakam) - 728

జడలు గట్టనేల? సన్యాసి కానేల?
ఒడలు విఱుచుకొనెడి యోగమేల?
ముక్తికాంతబట్టి ముద్దాడనేకదా?
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
ముక్తి కోసం సన్యాసి అయి జడలు ధరించక్కరలేదు, శరీరాన్ని విరుచుకుంటూ యోగ విద్యలు చేయనక్కరలేదు. వీటన్నిటికంటే కూడ సులభమైన మార్గాలు ఎన్నో ఉన్నాయి.

Monday, November 4, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 727

వేమన శతకం (Vemana Shatakam) - 727

జాతులందు మిగుల జాతియేదెక్కువో?
యెఱుకలేక తిరుగ నేమిఫలము?
యెఱుక కలుగువాడె యెచ్చైన కులజుడు
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
జాతులన్ని సమానమే. ఒకటి ఎక్కువ కాదు మరొకటి తక్కువ కాదు. ఙానము లేకుండా తనది పెద్ద కులమమి చెప్పుకొని తిరిగిన ప్రయోజనముండదు. ఎవరైతే ఙానము కలిగి ఉంటారో వారిదే గొప్పకులము. ఙానము అన్నిటికన్న గొప్పది. కాబట్టి మూర్ఖునివలే కులాన్ని ప్రదర్శించకుండా ఙానాన్ని సంపాదించాలి.

వేమన శతకం (Vemana Shatakam) - 726

వేమన శతకం (Vemana Shatakam) - 726

ఉపవసించినంత నూఱబందిగ బుట్టు
తపసియై దరిద్రతను వహించు;
శిలకుమ్రొక్కనగునె జీవముగల బొమ్మ?
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
తిండి తినక ఉపవాసాలుండి శరీరన్ని భాద పెడితే మనుజన్మలో ఊర పందియై పుడతారు.అలానే ఎంత తప్పస్సు చేసే ముని అయినా కాని లాభం లేదు. ఎందుకంటే జీవముండి ఎంతో చైతన్యముకల మానవుడు ప్రాణములేని రాతికి దండము పెట్టి ఫలము ఆశిస్తున్నాడు కదా?

వేమన శతకం (Vemana Shatakam) - 725

వేమన శతకం (Vemana Shatakam) - 725

వేడుచున్నయట్టె విషయంబు జూపుచు
గోత దింపుసుమ్ము కొండెగాడు
చేర్చరాదు వాని జెఱుచును తుదినెట్లొ
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
కొండెగాడు/మోసగాడు అతి వినయము చూపిస్తూ మనల్ని మాయ చేసి గోతిలోకి త్రోస్తాడు. అటువంటి వానిని చేరతీస్తే గోతిలో పడక తప్పదు. ఎంత అవసరమున్నా వానికి దూరముగా ఉండటమే ఉత్తమము.

వేమన శతకం (Vemana Shatakam) - 724

వేమన శతకం (Vemana Shatakam) - 724

సకల జీవములను సమముగా నుండెడి
యతని క్రమము దెలియు నతడె యోగి
అతడు నీవెయనుట నన్యుండు కాడయా!
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
ఈ భూమి మీద ఉన్న సమస్త ప్రాణులను ఒకే దృష్ఠితో చూడగలిగిన వాడే నిజమైన యోగి. అన్నిటిలోను ఉన్నది ఒకే బ్రహ్మమని అదే బ్రహ్మము నీలో కూడ ఉన్నదని గ్రహింపుము.

వేమన శతకం (Vemana Shatakam) - 723

వేమన శతకం (Vemana Shatakam) - 723

మర్మమెఱుగలేక మతములు కల్పించి
యుర్విజనులు దుఃఖమెందుచుంద్రు
గాజుటింటి కుక్క కళవళపడురీతి
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
మనుషులు అన్నిటికి మిన్న అయిన ఆత్మతత్వము గుర్తించక మత భేధములు పాటిస్తున్నారు. కుక్కలు అద్దములో తన బింబాన్ని చూసుకుని మొరిగినట్టుగా మొరుగుతున్నారు. మతములేవి లేవని తెలుసుకోవడమే మనిషి యొక్క నిజమైన మతము.

వేమన శతకం (Vemana Shatakam) - 722

వేమన శతకం (Vemana Shatakam) - 722

గోలి పాతబెట్టి కోరి తా మునినంచు
మనసులోన యాశ మానలేడు
ఆకృతెన్నవేఱికాశ యెన్నగ వేఱు
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
బయటకు కనిపించే వేషధారణ వేరు, మనసులో ఉండే ఆశ వేరు.నడుముకి గోచి కట్టుకుని మునిగా భావించేవాడెవ్వడు ఆశను జయించలేడు. అలా అనుకునే యోగిపుంగవుడు ఉభయభ్రష్టుడు.

వేమన శతకం (Vemana Shatakam) - 721

వేమన శతకం (Vemana Shatakam) - 721

ముక్కుపట్టి యీడ్చు ముండను చేపట్టి
తిక్కయెత్తి నరుడు తిరుగుచుండు
ఎక్కడి తల్లిదండ్రు లేమైన దనకేల?
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
గయ్యాలితనము గల భార్య దొరికిన వాడు, ఆమెను భరించలేక దేశాలు పట్టి తిరుగుతూ ఉంటాడు. అటువంటి వాని తల్లిదండ్రులెమై పోతారో అని తలుచుకుంటుంటే భాద కలుగుతుంది.

వేమన శతకం (Vemana Shatakam) - 720

వేమన శతకం (Vemana Shatakam) - 720

మానసమున మంచి మల్లెపూలచవికె
బావితోటజేసి బాలగూడి
భోగినయ్యెదనన బోయె బోకాలంబు
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
పెరట్లో మల్లెపాదును వేసి, దాని నీటికోసము బావి తవ్వి, అది ఎదిగి పెద్దదయ్యాక, దానికింద పందిరి వేసి, ఆ పందిరి కింద మంచము వేసి, దాని మీద మంచి భామతో సరససల్లపములు సాగిస్తామని మనస్సునందు ఊహించుకోంటూ ఉంటారు మూర్ఖులు. అటువంటి ఊహల మూలంగా కాలము వ్యర్ధమేగాని ప్రయోజనమేమి ఉండదు. కాబట్టి ఊహలు కట్టిపెట్టి కష్టపడుట మేలు.

వేమన శతకం (Vemana Shatakam) - 719

వేమన శతకం (Vemana Shatakam) - 719

మంటిలోన బుట్టి మంటిలోన బెరిగి
మన్ను జూచి జనులు మగ్నులైరి
మన్ను మన్నుజేర మది నిల్పలేరయా?
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
మనుషుని శరీరమే మన్ను. అందరూ మట్టిలో పుట్టి మట్టిలో కలిసిపోవలసిందే. ఇంత సాధారణమైన ఙానము కూడ లేక జనులు అఙానముతో కొట్టుకుంటుంటారు.

వేమన శతకం (Vemana Shatakam) - 718

వేమన శతకం (Vemana Shatakam) - 718

ఇసుక బొక్కు రాయి యినుమును జర్మంబు
కసవుపొల్లుగట్టి కట్టపెట్టి
పల్లు దోమినంత బరిశుద్దులగుదురా?
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
ఇసుక బొగ్గు మొదలైన వాటితో పళ్ళను, సున్ను పిండి, వెపనూనెతో చర్మాన్ని బాగ రుద్దినంత మాత్రాన మనుషులు పరిశుద్దులైపోరు. ఎప్పుడైతే దురాలోచనలను మాని మనస్సును శుభ్రంగా ఉంచుకుంటారో అప్పుడే పరిశుద్దులవుతారు.

Saturday, November 2, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 717

వేమన శతకం (Vemana Shatakam) - 717

ఉప్పులేని కూర యొప్పదు రుచులకు
పప్పులేని తిండి ఫలములేదు
అప్పులేనివాడు యధిక సంపన్నుడు
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
పప్పులేని భోజనము, అలానె ఉప్పులేని కూర నోటికి రుచించవు. లోకంలో అప్పులేని వాడె అందరికన్న ధనవంతుడి కింద లెక్క.

వేమన శతకం (Vemana Shatakam) - 716

వేమన శతకం (Vemana Shatakam) - 716

అరయ దఱచు కల్లలాడెది వారింట
వెడల కేల లక్ష్మి విశ్రమించు?
నీరమోటుకుండ నిలువనిచందాన
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
చిల్లుకుండలో ఏవిధంగా నైతే నీరు నిలవదో అదే విదంగా అబద్దాలాడి మనుషులను మోసగించే వారి ఇంట లక్షి నిలువదు.

వేమన శతకం (Vemana Shatakam) - 715

వేమన శతకం (Vemana Shatakam) - 715

చంపదగినయట్టి శత్రువు తనచేత
జిక్కినేని కీడు చేయరాదు
పొసగ మేలుచేసి పొమ్మనుటే చాలు
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
ఆగర్భ శత్రువు తమ చేత చిక్కినను వానికి ఎటువంటి కీడు చేయక దయతలచి వాణ్ణి విడిచిపెట్టుటయే ఉత్తమ ధర్మము. ఇంతకు మించి సాధుగుణం ఈ భూప్రపంచంలో లేదు. కాబట్టి అందరూ క్షమాగుణం అలవాటు చేసుకోవాలి.

వేమన శతకం (Vemana Shatakam) - 714

వేమన శతకం (Vemana Shatakam) - 714

చేకొనుచును తమకు చేసాచినంతలో
చెడిన ప్రజల రక్ష చేయకున్న
తమది సాగుటేమి? తమ తను వదియేమి?
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
తనని శరణుకోరి వచ్చిన వారికి దయతలచి రక్షించి కాపాడుట మన కనీస ధర్మం. అట్లు చేయని వాని పుట్టుక కూడ వ్యర్దం.

వేమన శతకం (Vemana Shatakam) - 713

వేమన శతకం (Vemana Shatakam) - 713

గుణయుతునకు మేలు గోరంత చేసిన
కొండయగును వాని గుణము చేత
కొండయంత మేలు గుణహీనుడెఱుగునా?
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
గుణవంతునికి ఒక చిన్న సహాయం చేసినా కూడ పెద్దదిగా భావించి కృతఙతాభావంతో ఉంటాడు. అది అతని సహజగుణం. కాని చెడ్డ గుణం కలవారికి ఎంత సహాయం చేసినా పట్టించుకోనట్లే ఉంటారు. అటువంటి వారికి ఏవిధమైన సహయము చేసినా మనమే భాద పడాలి.

వేమన శతకం (Vemana Shatakam) - 712

వేమన శతకం (Vemana Shatakam) - 712

ఇరుగుపొరుగు వారికెనయు సంపదజూచి
తనకు లేదటన్న ధర్మమేది?
ధర్మమన్న దొల్లి తన్నుక చచ్చిరి
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
ఇరుగు పొరుగు వారిని చూసి, వారికి ధనమున్నదని మీకు లేదని దుఃఖింపకూడదు.వెనుకటి జన్మలో దాన ధర్మాలు చేస్తే ఇప్పుడు సంపద వచ్చియుండేది. అప్పుడేమియు చేయకుండా ఇప్పుడెల వస్తుంది? కావున బుద్ది తెచ్చుకుని ఇప్పుడు దానము చేస్తే కనీసము మరుజన్మలో అయిన ధనము పొందగలవు.

వేమన శతకం (Vemana Shatakam) - 711

వేమన శతకం (Vemana Shatakam) - 711

కోటిదానమిచ్చి కోపంబు పొందుచో
బాటిసేయ రతని బ్రజలు మెచ్చి;
సాత్విక గుణముల సజ్జనుడగునయా
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
కోటి రూపాయలు దానమిచ్చినా ఎప్పుడూ కోపంగా ఉండే వాడిని ఎవరూ మెచ్చుకోరు. ఎప్పుడైనా సాత్విక గుణమున్నవాడే సజ్జనుడు అనిపించుకుంటాడు. కాబట్టి కోపాన్ని అదుపులో పెట్టుకుని శాంతిగా మెలగడం అలవాటుచేసుకోవాలి.

వేమన శతకం (Vemana Shatakam) - 710

వేమన శతకం (Vemana Shatakam) - 710

కూరయుడుకు వెనుక కూడునా కసవేర?
యెఱుకగల్గి మునుపె యేరవలయు;
స్థలము తప్పువెనుక ధర్మంబు పుట్టునా?
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
కూర ఉడికే ముందే అందులో ఉన్న చెత్తని వేరుచేసి పారేయాలి. ఒకసారి ఉడికిన తరువాత చెత్త తీయడం ఎవరికీ సాధ్యము కాదు.అలానే సమయము తప్పిన యెడల ధర్మము చేయడము సాధ్యము కాదు. కాబట్టి సరి అయిన సమయములో జాగు చేయక ధర్మాన్ని ఆచరించాలి.

వేమన శతకం (Vemana Shatakam) - 709

వేమన శతకం (Vemana Shatakam) - 709

వంపుకఱ్ఱగాచి వంపు తీర్చగవచ్చు
కొండలన్ని పిండిగొట్టవచ్చు
కఠినచిత్తు మనసు కరగింపగారాదు
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
వంకరగా ఉన్న కర్రను కాల్చి తిన్నగా చేయవచ్చు. కొండలనైనా కష్టపడి పిండి చేయవచ్చు. కాని కఠినమైన మనసు కలవాడిని దయామయుడిగా చేయలేము.

వేమన శతకం (Vemana Shatakam) - 708

వేమన శతకం (Vemana Shatakam) - 708

బిడియ మింతలేక పెద్దను నేనంచు
బొంకములను బల్కు సంకళ్చునకు
ఎచ్చు కలుగుదిచట, జచ్చిన రాదట
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
మూర్ఖుడు తనకు తానే పెద్ద వాడిని గొప్ప వాడినని బింకాలు పోతుంటాడు. కాని అటువంటి వాడికి ఇంటా బయట ఎటువంటి మర్యాద ఉండదు. వాడు చచ్చినా గౌరవం పొందలేడు. గొప్పతనము మనకు ఇతరులు ఇచ్చేది కాని మనకు మనము ఇచ్చుకునేది కాదు.

Friday, November 1, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 707

వేమన శతకం (Vemana Shatakam) - 707

కైపుమీఱువేళ గడకుజేరగరాదు
అనువుదప్పి మాటలాడరాదు
సమయమెఱుగనతడు సరసుండుకాదయా?
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
బుద్దిమంతుడైన వాడు సమయానుకూలంగా నడుచుకుంటాడు. ఎలాగంటే కల్లు తాగి మత్తెక్కి ఉన్నవాని జోలికి పోడు. ఎటువంటి సమయములోనైనా అదుపుతప్పి మాట్లాడడు. ఇటువంటి మంచి లక్షణాలు కలవానికెప్పుడు అపకారము జరుగదు.

వేమన శతకం (Vemana Shatakam) - 706

వేమన శతకం (Vemana Shatakam) - 706

పైరు నిడిన వాని ఫల మదే సఫలంబు
పైరు నిడని వాడు ఫలము గనునె?
పైరు నిడిన వాడు బహు సౌఖ్యవంతుడౌ?
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
పైరు వేసి దానిని బాగా సంరక్షించిన వానికే పంట చెందుతుంది.ఏమి వేయకుండా ఊరికే కూర్చున్న వానికి పంట ఏవిధంగా దోరుకుతుంది. అదే విధంగా ఎంత చదివిన వానికైనను ప్రయత్నింపనిదే ఙానము రాదు.

వేమన శతకం (Vemana Shatakam) - 705

వేమన శతకం (Vemana Shatakam) - 705

వ్యాధి కలిగెనేని వైద్యుని చేతను
మందు తినకకాని మానదెందు
చెంత దీపమిడక చీకటి పాయునా?
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
వచ్చిన రోగాన్ని కుదుర్చుకోవడానికి మందు తినాలి. చీకటిని పోగొట్టుకోవడానికి దీపము కావాలి. అలానే మనలో ఉన్న అఙానాన్ని నిర్మూలించడానికి విద్య కావాలి.

వేమన శతకం (Vemana Shatakam) - 704

వేమన శతకం (Vemana Shatakam) - 704

నక్కనోటికండ నదిలోని మీనుకై
తిక్కపట్టి విడిచి మొక్కుచెడద?
మక్కువపడి గ్రద్ద మాంసమెత్తుకపోవు
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
తన దగ్గర ఉన్న మాంసపు ముక్కతో తృప్తి చెందక, నదిలోన చెపను చూసిన వెంటనే, నక్క తన దగ్గరున్న మాంసపు ముక్కను జాగ్రత్తగా ఒడ్డున పెట్టి చేపను పట్టుకోవడానికి నదిలోకి దిగుతుంది. ఈ లోపులో గ్రద్ద ఒడ్డున ఉన్న మంసాన్ని తన్నుకుపోతుంది, చేప నక్క చూపునుంచి చేజారిపోతుంది. అదేవిధంగా లోభి అత్యాశకి పొయి ఉన్నదంతా నష్టపోతాడు. కాబట్టి మనదగ్గరున్న దానితో సంతృప్తి పడటం మేలు.

వేమన శతకం (Vemana Shatakam) - 703

వేమన శతకం (Vemana Shatakam) - 703

తిరుపతికి బోవ దురక దాసరికాడు,
కాశికేగ పంది గజము కాదు,
కుక్క సింహమగునె గోదావరికిబోవ
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
తిరుపతికి పోయినా తురక దాసరికాలేడు. కాశికి పొయినా పంది ఏనుగు కాలేదు. గోదావరిలో మునిగినా కుక్క సింహము కాలేదు. అలానే ఎన్ని ఘనకార్యాలు చేసినా నీచుడు ఉత్తముడు కాలేడు.

వేమన శతకం (Vemana Shatakam) - 702

వేమన శతకం (Vemana Shatakam) - 702

వద్దనంగబోదు వలెననగారాదు
తాను చేసినట్టి దానఫలము
ఉల్లమందు వగవకుండుటే యోగంబు
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
మీరు చేసిన దానముయొక్క ఫలితము వద్దంటే విడిపోదు అలానే దానము చేయకుండా రమ్మంటే రాదు.కాబట్టి ఫలితాలగురించి ఆలోచించకుండా తమ తమ తాహతుకి తగ్గట్టు దానము చేయుటయే మేలు.

వేమన శతకం (Vemana Shatakam) - 701

వేమన శతకం (Vemana Shatakam) - 701

రాళ్ళు పూజచేసి రాజ్యముల్ తిరిగియు
కానలేరు ముక్తికాంత నెపుడు
తానయుండుచోట దైవంబు నుండదా?
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
మూర్ఖులకు దైవము తావు తెలియక మోక్షం కోరకు విగ్రహాలను పూజించుట, అడవులు, దేశదేశాలు పట్టి తిరుగుట చేస్తుంటారు.దైవము తన మనస్సులోనే ఉన్నాడని తెలుసుకోలేరు. తీర్ధయాత్రలు మాని మనస్సులోనున్న దైవాన్ని పూజించుటయే మేలు.

వేమన శతకం (Vemana Shatakam) - 700

వేమన శతకం (Vemana Shatakam) - 700

దానధర్మములకు దగు రేపురేపని
కాల వ్యయము చేయు గష్టజనుడు
తానునేమియౌనొ? తనబ్రతుకేమౌనొ?
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
అనుకున్న వెంటనే దానము చేయకుండా "రేపు రేపు" అంటూ జాప్యము చేస్తాడు మూర్ఖుడు.రేపు అన్నది అసత్యమని తెలుసుకోలేడు.రేపు అన్నది రావచ్చు రాకపోవచ్చు. రేపు తన పరిస్థితి ఎలా ఉంటుందో తనకే తెలియదు. కాబట్టి చేసే దానాన్ని వాయిదా వేయకుండా తక్షణమే చేయడం మంచిది.

వేమన శతకం (Vemana Shatakam) - 699

వేమన శతకం (Vemana Shatakam) - 699

ఆడదానిజూడ నర్ధంబు జూడగ
బమ్మకైన బుట్టు దిమ్మతెగులు
బ్రహ్మయాలిత్రాడు బండిరేవున ద్రెంప
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
ఆడువారిని, బంగారాన్ని మరియు ధనాన్ని చూసి ఆశ పుట్టనిది ఎవరికి. సాక్షాత్తు బ్రహ్మకూడ తనకు వరుసకు కుమార్తె అయిన సరస్వతి దేవిని చూసి మోహించలేదా? అందుకే అంటారు బ్రహ్మకైన పుట్టు దిమ్మతెగులు అని.

వేమన శతకం (Vemana Shatakam) - 698

వేమన శతకం (Vemana Shatakam) - 698

ఇంద్రియ పరవశు డధమం
డింద్రియపరవశుడె భక్తియెడ మధ్యముడౌ
డింద్రియ జయడుత్తముడు జి
తేంద్రియసంధికుడు విన మహేశుండు వేమా


భావం:-
ఇంద్రియాలకు లొంగు వాడు అధముడు. ఇంద్రియాలకు దాసుడైనను భక్తి కలవాడు మధ్యముడు. ఇంద్రియాలను జయించినవాడు ఉత్తముడు. అలాంటి జితేంద్రియుడు ఈశ్వరునితో సమానం.

Saturday, October 26, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 697

వేమన శతకం (Vemana Shatakam) - 697

జనన మరణమువేళ స్వాతంత్ర్యమూ లేదు
తేను లేదు మున్ను పోనులేదు
నడుమగర్తననుట నగుబాటు కాదటే
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
ఫుట్టే చచ్చె వేళలయందు స్వాతంత్ర్యము లేదు. పోని తన వెంట తీసుకొచ్చింది లేదు తీసుకు పోయేది లేదు. మద్యలో మాత్రము అన్నిటికి తామే కర్తనని చెప్పుకుంటారు.

వేమన శతకం (Vemana Shatakam) - 696

వేమన శతకం (Vemana Shatakam) - 696

జాతి మతము విడిచి చని యోగి కామేలు
జాతితోనె యున్న నీతి వలదె?
మతము బట్టి జాతి మానకుంట కొఱంత
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
జాతిని ఆశ్రయించు వాడు ఎన్నటికి నీతిని వదలరాదు. జాతి కంటే నీతి ఎక్కువ. అలానే మతముని నమ్మిన వాడు జాతిని అశ్రద్ద చేయకుఊడదు. మతము కంటే జాతియే గొప్ప. అసలు వీటన్నిటిని వదిలి యోగి అగుట ఇంకా మేలు.

వేమన శతకం (Vemana Shatakam) - 695

వేమన శతకం (Vemana Shatakam) - 695

ఙాన నిష్ఠ బూని మేను మఱుచువాడు
కాని కాడు మోక్ష కమి గాని
నియమ నిష్ఠ లుడిపి నిర్గుణ ముందురా
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
ఙానాన్ని పొందాలనే ఆలొచనతో తన దేహాన్ని తనే మరుచు వాడు మొక్షాన్నే కాని కామాన్ని కోరడు. అటువంటి వారు కచ్చితంగా ఙానము పొందగలుగుతారు. కాబట్టి ఙానం కోసం శరీరాన్ని అదుపులో ఉంచుకోవాలి.

వేమన శతకం (Vemana Shatakam) - 694

వేమన శతకం (Vemana Shatakam) - 694

మైల కోకతోడ మాసిన తల తోడ
ఒడలి మురికి తోడ నుండెనేని
అధిక కులజుడైన నట్టిట్టు పిలువరు
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
మురికిగా ఉన్న బట్టలతోటి, మాసిన తలతోటి, ఒంటినిండా మురికి పట్టిన వాడు ఉత్తమ కులముకలవాడే అయినా వాడిని ఎవరు గౌరవించరు. కాబట్టి పరిశుభ్రంగా ఉండటం మనుషులకు ఎంతో ముఖ్యం.

వేమన శతకం (Vemana Shatakam) - 693

వేమన శతకం (Vemana Shatakam) - 693

వేషభాష లింక గాషాయ వస్త్రముల్
బోడినెత్తి లొప్ప బొరయుచుంద్రు
తలలుబోడులైన దలపులు బోడులా?
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
వేషభాషలు మార్చి, కాషాయ బట్టలు ధరించి తలలకు గుండు కొట్టించుకుని యోగులమని చెప్పుకుని తిరుగుతుంటారు. తలలు బోడిగా ఉన్నంత మాత్రాన మనస్సులో ఉన్న కోరికలు బోడిగా ఉంటాయా ఏమిటి. నిజమైన యోగత్వం కోరికలని త్యజించినప్పుడే కలుగుతుంది.

వేమన శతకం (Vemana Shatakam) - 692

వేమన శతకం (Vemana Shatakam) - 692

వేషభాష లింక గాషాయ వస్త్రముల్
బోడినెత్తి లొప్ప బొరయుచుంద్రు
తలలుబోడులైన దలపులు బోడులా?
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
వేషభాషలు మార్చి, కాషాయ బట్టలు ధరించి తలలకు గుండు కొట్టించుకుని యోగులమని చెప్పుకుని తిరుగుతుంటారు. తలలు బోడిగా ఉన్నంత మాత్రాన మనస్సులో ఉన్న కోరికలు బోడిగా ఉంటాయా ఏమిటి. నిజమైన యోగత్వం కోరికలని త్యజించినప్పుడే కలుగుతుంది.

వేమన శతకం (Vemana Shatakam) - 691

వేమన శతకం (Vemana Shatakam) - 691

కనకమృగము భువిని కలుగదం చెఱుగడా
రాముడెఱుక కల్గు రాజుకాడొ?
చేటుకాలమునకు చెడుబుద్ది పుట్టెడు
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
బంగారు జింక భూమి మీద ఉండదని రామునికి తెలియదా? ఆపద కాలమందు విచక్షణాఙానం పూర్తిగా నశించును. కాబట్టె రాముడు జింక కొరకు వెళ్ళి మోసపోయాడు.

వేమన శతకం (Vemana Shatakam) - 690

వేమన శతకం (Vemana Shatakam) - 690

శిలలు దేవతలని స్థిరముగా రూపించి
మంటిపాలెయైన మనుజులెల్ల
మంటిలోని రాళ్ళ మదిలోన దెలియరు
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
శిలలను పూజిస్తూ దేవతలని నమ్మిన వారు చివరకు మట్టిలో కలిసిపోతారు కదా! కాని ఆ మట్టిలోనే దేవుడున్నాడని తెలుసుకోలేకపోతున్నారు.

వేమన శతకం (Vemana Shatakam) - 689

వేమన శతకం (Vemana Shatakam) - 689

తేలునకుండును తెలియగొండి విషంబు
ఫణికినుండు విషము పండ్లయందు
తెలివిలేనివాండ్ర దేహమెల్ల విషంబు
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
తేలుకు తోకలో విషము ఉంటుంది, పాముకు కోరలలో విషము ఉంటుంది కాని మూర్ఖునికి ఒళ్ళంతా విషమే. కాబట్టి తెలివితక్కువ మూర్ఖుడు మన మిత్రుడైనను వానితో జాగ్రత్తగా మసలడం మంచిది.

వేమన శతకం (Vemana Shatakam) - 688

వేమన శతకం (Vemana Shatakam) - 688

కుళ్ళుబోతునొద్ద గూడి మాటాడిన
గొప్ప మర్మములను చెప్పరాదు
పేరు తీరుదెల్ప నూరెల్ల ముట్టించు
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
మూర్ఖుడు, కుళ్ళుబోతు అయిన వాడితో కబుర్లు చెప్పకూడదు. ఒకవేళ చెప్పినా రహస్య విషయాలు అసలు చెప్పరాదు. అలా చెప్తే వాడి కుళ్ళుబోతు తనము వల్ల ఊరంత చాటించి మన పరువు తీస్తాడు.

వేమన శతకం (Vemana Shatakam) - 687

వేమన శతకం (Vemana Shatakam) - 687

గుఱ్ఱమునకు దగిన గుఱుతైన రౌతన్న
గుఱ్ఱములు నడుచు గుఱుతుగాను
గుర్తు దుర్జనులకు గుణము లిట్లుండురా
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
రౌతు సరిగా ఉన్నప్పుడే గుర్రము మంచి దారిలో నడుస్తూ ఉంటుంది. కొంచెమైన ఏమరుపాటుగా ఉన్న దారి తప్పుతుంది. అప్పుడు దాన్ని శిక్షించి సరి అయిన దారిలోకి తేవాలి. అలానే దుర్జనుణ్ణి కూడ అవసరమైతే శిక్షించి సరియైన దారిలోకి తేవాలి.

వేమన శతకం (Vemana Shatakam) - 686

వేమన శతకం (Vemana Shatakam) - 686

గుణికి భువిని విద్య గోరంత యబ్బిన
కొండయగును వాని గుణముచేత
కొండయంత విద్య గుణహీనుడెఱుగడు
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
ఉత్తముడైనవానికి కొంచెము విద్య అబ్బినను వాని గుణముచేత గొప్పవానిగా కీర్తింపబడతాడు. అదే విధంగా చెడ్డ వాడికి ఎంత ఎక్కువ విద్య వచ్చినను వాని గుణము చేత ఎవరూ వానికి విలువ ఇవ్వరు.కాబట్టి విద్యకంటే ముందు మంచి గుణము అలవర్చుకోవాలి.

వేమన శతకం (Vemana Shatakam) - 685

వేమన శతకం (Vemana Shatakam) - 685

కండ చక్కెఱయును గలియ బాల్పోసిన
తఱిమి పాము తన్ను దాకుగాదె?
కపటమున్నవాని గన్పెట్టవలె సుమీ!
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
బాగా చక్కెర కలిపి మంచి పాలు పోసినను పాము చంపడానికి వెనుకపడినట్లే, కపటమున్నవాడు ఎంత సహయము చేసినను మనల్ని మోసపుచ్చడానికి ప్రయత్నిస్తుంటాడు. కాబట్టి కపటులకి దూరంగా ఉంటూ, వారి మీద ఒక కన్నేసి ఉంచడం మంచిది.

వేమన శతకం (Vemana Shatakam) - 684

వేమన శతకం (Vemana Shatakam) - 684

కొండెగాడు చావ గొంపవాకిటికిని
వచ్చిపోదురింతే వగపులేదు
దూడ వగచునె భువి దోడేలు చచ్చిన?
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
దుర్జనుడు అయిన వాడు చచ్చినా, జనులు వాని ఇంటి ముందు నుంచి తొంగి చూచి వెళ్ళిపోతారే కాని పట్టించుకోరు. ఏమి భాద పడరు. తోడేలు చచ్చిపోతే దూడలు ఏమి భాద పడవు కదా! ఇదీ అంతే.

వేమన శతకం (Vemana Shatakam) - 683

వేమన శతకం (Vemana Shatakam) - 683

కొండముచ్చు పెండ్లి కోతి పేరంటాలు
మొండివాని హితుడు బండవాడు
దుండగీడునకు కొండెడు దళవాయి
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
కొండముచ్చు పెళ్ళికి కోతి పేరంటాలు అయినట్టు, మొండివాడికి బండవాడు మిత్రుడైనట్టు, దుర్మార్గునికి అబద్దాలకోరు సహాయపడును. కాబట్టి ఇటువంటి మూర్ఖులకు దూరంగా ఉండటం మంచిది.

వేమన శతకం (Vemana Shatakam) - 682

వేమన శతకం (Vemana Shatakam) - 682

ఎడ్డెవానికి గురుతోర్చి చెప్పినగాని
తెలియబడునె యాత్మ దెలివిలేక
చెడ్డ కొడుకు తండ్రి చెప్పిన వినడయా!
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
మూర్ఖునికి ఎంత వివరించి చెప్పినా ప్రయోజనము ఉండదు. మంచిని అర్ధం చేసుకునే తెలివి లేక ఇంకా మూర్ఖంగానే ఉంటాడు. అదే విధంగా చెడ్డ వాడైన కొడుకు, తండ్రి ఎంత మంచి చెప్పినను వినిపించుకోక చెడ్డ దారిలోనే జీవిస్తాడు.

వేమన శతకం (Vemana Shatakam) - 681

వేమన శతకం (Vemana Shatakam) - 681

కలువపూలవంటి కన్నులుండిననేమి?
చిలుక పలుకులట్లు పలుకనేమి?
తెలివి బలిమి గల్గి తేజరిలిననేమి?
తులువ గామి నలరు నెలత వేమ!


భావం:-
అందమైన చక్కని కన్నులు కలిగి యుండినను, చిలుకలా ఇంపుగా మాట్లాడే స్వరము కలిగినను తెలివితేటలు ఉన్నప్పుడే స్త్రీ ఒక యోగ్యురాలిగా రాణించును. తెలివిలేని యెడల హీనురాలగును. కాబట్టి అందచందాల కంటే తెలివితేటలు పెంచుకొనుటకు స్త్రీలు ప్రయత్నించాలి.

వేమన శతకం (Vemana Shatakam) - 680

వేమన శతకం (Vemana Shatakam) - 680

చంపగూడ దెట్టి జంతువునైనను
చంపవలయు లోకశత్రుగుణము
తేలుకొండిగొట్ట దేలేమిచేయురా?
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
నోరులేని మూగ జీవాలను చంపకూడదు. దేన్నైనా నిర్మూలించాలి అంటే లోకములో మనష్యుల మద్య ఉండే శత్రుభావనలను నిర్మూలించాలి. మనకు హాని చేసే తేలుని చంపకుండా దాని కొండిని తీసివేస్తే అది మనల్ని ఏమి చేయలేదు.

వేమన శతకం (Vemana Shatakam) - 679

వేమన శతకం (Vemana Shatakam) - 679

వాదమాడడెపుడు వరుస నెవ్వరితోడ
జేరరాడు తాను చేటుదేడు
ఙానియగుచు బుధుడు ఘనతబొందగజూచు
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
నిజమైన ఙానము కలవాడు ఎవ్వరితోను వాదులాడక, ఎవ్వరి పంచకు చేరక, ఎవరికీ కీడు చేయక, అందరివద్ద మంచిగా ఉంటూ గౌరవము పొందుతాడు.

వేమన శతకం (Vemana Shatakam) - 678

వేమన శతకం (Vemana Shatakam) - 678

మున్ను నిన్ను గన్న ముఖ్యులెవ్వరొ, వారి
సన్నుతించి పిదప సంతతమును
ఙాన దాత గొల్వ ఘనతచే విబుధిని
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
ఉదయాన్నే జన్మనిచ్చిన తల్లి తండ్రులను పూజించి, ఆ తరువాత ఙానముని అందించిన గురువుని పూజించి కార్యాలు మొదలు పెట్టాలి.

వేమన శతకం (Vemana Shatakam) - 677

వేమన శతకం (Vemana Shatakam) - 677

మాటలాడవచ్చు మనసు దెల్పలేడు
తెలుప వచ్చు దన్ను తెలియలేడు
సురియ బట్టవచ్చు శూరుడు కాలేడు
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
ఇతరులతో మట్లాడటం సులభమే కాని వారి మనసు తెల్సుకోవడం కష్టం. కత్తి పట్టడం సులభమే కాని వీరుడవడం కష్టం. విద్వాంసునివలే నటించవచ్చు కాని ఙాని అవడం కష్టం. ఇష్టం వచ్చినట్టు చెప్పవచ్చు కాని చెప్పినవి పాటించడం కష్టం. కాబట్టి జీవితంలో అనుకున్నది సాధించాలంటే కష్టపడటం ముఖ్యం.

వేమన శతకం (Vemana Shatakam) - 676

వేమన శతకం (Vemana Shatakam) - 676

చెఱకు తోటలోన జెత్త కుప్పుండిన
కొచెమైన దాని గుణము చెడదు
ఎఱుక గలుగు చోట నెడ్డె వాడున్నట్లు
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
చెరకుతోటలో పిచ్చి పిచ్చి మొక్కలుండిన చెరకుకు వచ్చె నష్టమేమి లేదు. తను ఎల్లపుడూ తన తీపి తనము కోల్పోదు.అలానే ఙానుల గుంపులో మూర్ఖుడున్న వారి ఙానమునకు వచ్చిన నష్టమేమిలేదు.

వేమన శతకం (Vemana Shatakam) - 675

వేమన శతకం (Vemana Shatakam) - 675

కలుష మానసులకు గాన్పింపగారాదు
అడుసు లోన భాను డడగినట్లు
తేట నీరు పుణ్య దేహ మట్లుండురా
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
బురదలో ఏవిధంగా అయితే సూర్యుని యొక్క ప్రతిబింబబు కనిపించదో, అదే విధంగా పాపులకూ మూర్ఖులకూ ఙానము కానరాదు. తేటగా ఉన్న నీటిలో ప్రతిబింబము యెలా అయితే కనపడుతుందో మంచివారికి అలా గోచరిస్తుంది.కాబట్టి ఙానము పొందె ముందు మంచితనము అలవాటు చేసుకోవాలి.

వేమన శతకం (Vemana Shatakam) - 674

వేమన శతకం (Vemana Shatakam) - 674

వేనవేలు చేరి వెఱ్ఱికుక్కలవలె
అర్ధహీన వేద మఱచుచుంద్రు
కంఠశొషకంటె కలిగెడి ఫలమేమి?
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
పిచ్చి పట్టిన కుక్కలలాగ గుంపులు గుంపులుగా అరుస్తూ పనికిమాలిన వేదాలు మంత్రాలు చదువుతూ ఉంటారు.ఇలా అరవడం మూలంగా గొంతు నొప్పి రావడమే కాని ఎటువంటి ఉపయోగం ఉండదు.

వేమన శతకం (Vemana Shatakam) - 673

వేమన శతకం (Vemana Shatakam) - 673

శుద్దిదృష్టిలేక శుక్రునంతటివాడు
పట్టలేక మనసు పారవిడిచి
కన్నుపోవ బిదప గాకి చందంబున
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
మనకి దానగుణముండాలి. పైగ ఎవరైనా దానము చేస్తుంటే వారిని అభినందించాలి కాని అడ్డుపడకూడదు. బలి చక్రవర్తి దానము చేస్తుంటే అడ్డుపడిన శుక్రాచార్యునికి ఒక కన్ను పొయినట్టె ఎవరైనా దానము చేస్తుంటే అడ్డుపడిన వారికి ఎదో ఒక నష్టం కలుగక తప్పదు.

వేమన శతకం (Vemana Shatakam) - 672

వేమన శతకం (Vemana Shatakam) - 672

ఎంత కడుగ నోటి యెంగిలి పోవునె?
ఎల్లకాలమందు నెంగిలి తగు
ననుదినంబు చూడ ననృతమాడెడు నోరు
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
ఎంత కడిగినా నోటిలో ఎంగిలి పోతుందా ఎమిటి. అలానే ప్రతిదినము అసత్యాలాడుతూ అందరిని భాద పెట్టే నోరు ఉన్నంత కాలం దాని చెడ్డ గుణము పోదు.

వేమన శతకం (Vemana Shatakam) - 671

వేమన శతకం (Vemana Shatakam) - 671

చపలచిత్తవృత్తి జయమొంద గమకించి
నిపుణుడయ్యు యోగనియతి మీఱి
తపము చేయువాడు తత్వాధికుండురా
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
మనస్సులో వచ్చె పిచ్చి పిచ్చి ఆలొచనలను కట్టిపెట్టి, యోగ నియమాలు పాటించి తపస్సుచేయువాడే గొప్ప వేదాంతి అవుతాడు.

వేమన శతకం (Vemana Shatakam) - 670

వేమన శతకం (Vemana Shatakam) - 670

పతిని విడువరాదు పదివేలకైనను
బెట్టి చెప్పరాదు పెద్దకైన
పతిని తిట్టరాదు సతి రూపవతియైన
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
పదివేలు ఇస్తానన్నా భర్తను విడువరాదు.అంతేకాదు, భర్తపై చాడిలు చెప్పరాదు, భర్తను నిందించరాదు. ఎంత అందగత్తె అయిన భార్య ఐనా ఇవన్ని చేయడం తగదు.

వేమన శతకం (Vemana Shatakam) - 669

వేమన శతకం (Vemana Shatakam) - 669

పుడమిలోన నరులు పుత్రుల గనగోరి
యడలుచుందు రనుపమాశచేత
కొడుకు గలిగినంత కులముద్ధరించునా?
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
లోకంలో జనులు కొడుకుని కనాలని విపరీతమైన ఆశతో తహతహలాడుతుంటారు. కాని కొడుకు పుట్టినంత మాత్రాన కులాన్ని ఉద్దరిస్తాడా ఎంటి?. అదంతా మూర్ఖత్వం.

వేమన శతకం (Vemana Shatakam) - 668

వేమన శతకం (Vemana Shatakam) - 668

కనులు చూడ్కిని చెదరక నొక్కి
తనువుపై నాశ విదిచిన తావు బట్టి
యున్న మనుజుడె శివుండయా యుర్విలోన
నతని కేటికి సుఖ దుఃఖ వితతి వేమ.


భావం:-
దృష్టిని స్థిరంగా ఉంచి, శరీరముపై మొహము వదిలి పెట్టి, పరమాత్మునిపై మనసు నిలిపిన వాడె ఈలోకాన శివుడౌతాడు. అతడికి సుఖ దుఃఖాలుండవు.

Friday, October 25, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 667

వేమన శతకం (Vemana Shatakam) - 667

గుణికి ఙానమహిమ గోరంత చెప్పిన
గొండయగును వాని గుణముచేత
గుణ విహీనుకెట్లు కుదురు నా రీతిగ
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
మంచి గుణము కలవానికి ఙానము సంపాదించుకోవడంలో గల గొప్పతము గురించి కొంచెము చెప్పినను అది కొండంత అవుతుంది.అదే గుణహీనునికి ఎంత చెప్పినా ప్రయోజనం ఉండదు. కాబట్టి మంచి గుణములేని వానికి మంచి మాటలు చెప్పడం వృదా.

వేమన శతకం (Vemana Shatakam) - 666

వేమన శతకం (Vemana Shatakam) - 666

బుద్దియతునికేల పొసగని సఖ్యము
కార్యవాదికేల కడు చలంబు
కుత్సితునకు నేల గురుదేవభక్తి?
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
బుద్దిమంతునికి పనికి మాలిన స్నేహము, కార్యసాధకునికి చంచలత్వము, కుత్సితుడికి గురుభక్తి కుదరవు. ఇవన్ని ఒకదానికోకటి వ్యతిరేకమైనవి.

వేమన శతకం (Vemana Shatakam) - 665

వేమన శతకం (Vemana Shatakam) - 665

బూటకంబు చేత బుడమిలో నొకకొన్ని
నాటకంబు లాడి నయముచూపి
దీటులేక తాము తిరుగుచునుందురు
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
బూటకపు మాటలు చెపుతూ, నాటకాలాడి, దొంగ వినయము చూపి, వంచన చేస్తూ తమకెదురు లేదనే గర్వంతో తిరుగుచుంటారు కొందరు.

వేమన శతకం (Vemana Shatakam) - 664

వేమన శతకం (Vemana Shatakam) - 664

విద్యలేనివాడు విద్వాంసు చేరువ
నుండగానె పండితుండు కాడు
కొలని హంసల కడ గొక్కెరులున్నట్లు
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
విద్యాహీనుడు పండితుని వద్ద ఎంత సమయము గడిపినా ఙాని కాలేడు. కొలనులో హంసలతో పాటు కొంగలున్నా అవి హంసలు కాలేవు కదా!

వేమన శతకం (Vemana Shatakam) - 663

వేమన శతకం (Vemana Shatakam) - 663

ఎద్దుకన్న దున్న యేలాగు తక్కువ?
వివరమెఱిగి చూడు వృత్తియందు
నేర్పులేనివాని నెఱయొధుడందురా?
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
చూడటానికి ఎద్దు, దున్న ఒకెలా పని చేస్తున్నా, తరచి చూస్తే ఆ పనిలో మనకు తేడ కనిపిస్తుంది. అలానే చేసే పనిలో నేర్పులేవాడు ఎంత కష్టపడి చేసినా గొప్ప యోధుడనిపించుకోలేడు.

వేమన శతకం (Vemana Shatakam) - 662

వేమన శతకం (Vemana Shatakam) - 662

కుక్క గోవుగాదు కుందేలు పులిగాదు
దొమ గజముగాదు దొడ్డదైన
లొభిదాతగాడు లోకంబు లోపల
విశ్వదాభిరామ వినురవేమ


భావం:-
ఎంత భారి శరీరం ఉన్న దోమ ఏనుగు కాలేదు, సౌమ్యంగా ఉన్నా మొరిగే కుక్కెప్పుడు పాలిచ్చే ఆవు కాలేదు, గంభీరంగా ఉన్నా కుందేలు పులి కాలేదు. అలాగే లోభి ఎప్పుడూ దాత కాలేడు.

వేమన శతకం (Vemana Shatakam) - 661

వేమన శతకం (Vemana Shatakam) - 661

వ్యాధి పీడితంబు వ్యసన సంతాపంబు
దుఃఖసంభవమున దొడరు భయము
లేనివారలుండ రేనాటికైనను
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
రోగం రాని వారు, వ్యసనము లేని వారు, భయము లేని వారు ఈ లోకములో ఎవ్వరూ ఏనాడు లేరు. ఎవరైనా వీటిలో ఒకటైనా తమకు లేదని చెబుతున్నారంటే అది అబద్దమే.

వేమన శతకం (Vemana Shatakam) - 660

వేమన శతకం (Vemana Shatakam) - 660

పరుల దిట్టినంత బాపకర్మంబబ్బ
విడువదెన్నటికిని విశ్వమందు
పరుడు పరుడుగాడు పరమాత్మయౌనయా!
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
ఇతరులను తిట్టరాదు. అలా తిడితే ఆ పాపమెన్నటికీ పోదు. వారిలోనూ ఉండేది పరమాత్మే. కాబట్టి ఇతరులను కించపరచకుండా గౌరవించడం నేర్చుకోవాలి.

వేమన శతకం (Vemana Shatakam) - 659

వేమన శతకం (Vemana Shatakam) - 659

మాటలాడు టొకటి మనసులో నొక్కటి
ఒడలిగుణ మదొకటి నడత యొకటి
ఎట్లుకలుగు ముక్తి యిట్టులుండగ తాను?
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
చెడ్డవారు ఒకటి చెప్పి మరొకటి చేస్తుంటారు. మనస్సులో ఒకటి పెట్టుకుని నడతలో మరొకటి పాటిస్తారు.ఇట్లాంటి నీచులకు ముక్తి ఎలా లభిస్తుంది. మనం నమ్మిన దాన్ని మనసా వాచ పాటించడమే ముక్తికి నిజమైన మార్గం.

వేమన శతకం (Vemana Shatakam) - 658

వేమన శతకం (Vemana Shatakam) - 658

అంతరంగ మెఱుగ హరుడౌను గురుడౌను
అంతరంగ మెఱుగ నార్యుడగును
అంతరంగ మెఱిగి నతడెపో శివయోగి
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
ఇతరుల మనస్సులో ఏముందో పసిగట్టడం చాల కష్టం. దాన్ని పసిగట్టినవాడె గొప్పవాడు, గురువుకి కావలిసిన అర్హతలు కలవాడు.అంతెందుకు అతడు సరాసరి శివుడితో సమానం.

వేమన శతకం (Vemana Shatakam) - 657

వేమన శతకం (Vemana Shatakam) - 657

తనకుబోలె నవియు ధరబునట్టినవి కావొ
పరగదన్న బోలి బ్రతుకుగాదె
ఙానిప్రాణి జంప గారణమేమయా?
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
ఈ భూప్రపంచంలో అన్ని ప్రాణులు సమనామే. ఇతర ప్రాణులను కూడ తమతో సమనంగా చూడాలి.ఇది విస్మరించి దుర్జనులు జీవులను హింసిస్తుంటారు.నిజమైన ఙాని ఏనాడు ప్రాణిని చంపడు.

వేమన శతకం (Vemana Shatakam) - 656

వేమన శతకం (Vemana Shatakam) - 656

డాగుపడిన వెనుక దాగ నశక్యము
అరసి చేయుమయ్య యన్ని పనులు
తెలియకున్న నడుగు తెలిసినవారిని
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
చేసే పని ఏదైనా పూర్తిగా గ్రహించి అర్ధం చేసుకుని చేయాలి. ఒకవేళ దాని గురించి తెలియకపోతే తెలిసిన వారిని అడిగి తెలుసుకుని మొదలుపెట్టాలి. అంతే కాని పైపైన చూసి ఏదీ చేయరాదు. బయటకు బాగానే కనిపించే పాత్రలో లోపల కన్నం ఉండగా, ఏదైనా దాయడం కష్టమే కదా? పని కూడ అంతే.

వేమన శతకం (Vemana Shatakam) - 655

వేమన శతకం (Vemana Shatakam) - 655

కాంచనంబుమీది కాంక్షమోహమటండ్రు
విడువలేరు దాని విబుధులైన
కాంక్ష లేనివారు కానగరారయా!
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
ధనము మీద ఉన్న ఆశనే మోహము అంటారు. ఆ ధనం మీద ఆశను విద్వాంసులు కూడ విడువలేరు. అసలు ధనకాంక్ష లేని వారు లోకములో ఎక్కడా కానరారు. ఇది సత్యం.

వేమన శతకం (Vemana Shatakam) - 654

వేమన శతకం (Vemana Shatakam) - 654

అండ దప్పిన నరు డతిధార్మికుని యిల్లు
చేరవలయు బ్రతుకజేయు నతడు
ఆ విభీషణునకు నతిగౌరవంబీడె
భూతలమున రామమూర్తి వేమ!


భావం:-
వేరే యేవిధమైన సహయము లేనప్పుడు ధర్మాత్ముని యిల్లు చేరితే అతడే కాపాడుతాడు. రాక్షస రాజైన రావణుని సోదరుడు విభీషణుడిని శ్రీ రాముడు ఆదరించ లేదా?

వేమన శతకం (Vemana Shatakam) - 653

వేమన శతకం (Vemana Shatakam) - 653

హీననరుల తోడ నింతులతోడను
పడుచువాండ్రతోడ బ్రభువుతోడ
బ్రాజ్ఞజనులతోడ బలకంగరాదయా!
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
దుర్జనులతో, స్త్రీలతో, పడుచువాళ్ళతో, రాజులతో, పండితులతో మాట్లాడెటప్పుడు ఎప్పుడు, ఏమి, ఏ విధంగా మాట్లాడాలో తెలుసుకోని మాట్లాడాలి. లేనిచో వారు దేన్ని తప్పు పడతారో చెప్పలేము. కాబట్టి ఎవరితోనైనా మాట్లాడెటప్పుడు ముందు వెనుక ఆలొచించి జాగ్రత్తగా మాట్లాడటం మంచిది.

వేమన శతకం (Vemana Shatakam) - 652

వేమన శతకం (Vemana Shatakam) - 652

వాక్కు శుద్దిలేనివైనమౌ దండాలు
ప్రేమ కలిగినట్టు పెట్టనేల?
నోసట బత్తిజూపు నోరు తోడేలయా!
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
దుష్టుడైన వాడు వంకర టింకర మాటలతో ఎత్తి పొడుస్తూ వంకర దండాలు పెడుతూ ఉంటాడు కాని ప్రేమ అనేది ఉండదు. అలాగే కొంతమంది విభూది పెట్టి భక్తి నటిస్తారే కాని వారి నోరు తోడేలు వలె ఇతరులను మ్రింగడానికి చూస్తూ ఉంటుంది.

వేమన శతకం (Vemana Shatakam) - 651

వేమన శతకం (Vemana Shatakam) - 651

ముష్ఠి వేపచెట్టు మొదలుగా బ్రజలకు
పరగ మూలికలకు బనికివచ్చు
నిర్దయుండు ఖలుడు నీచుడెందులకగు?
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
ఏక్కడో చెత్త మరియు అపరిశుభ్రమైన స్థలంలో పెరిగే వేప చెట్టూకూడ మూలికావైద్యానికి పనికి వస్తుంది.కాని ఏ మాత్రం మనసు కరగని నిర్దయుడు, ఎవరి మాట వినని మూర్ఖుడు ఎందుకు ఉపయోగపడరు. కాబట్టి ఇటువంటి వారితో స్నేహాన్ని త్యజించడం మేలు. మనము ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునేది స్నేహితులే కదా!

వేమన శతకం (Vemana Shatakam) - 650

వేమన శతకం (Vemana Shatakam) - 650

జక్కి నెక్కి వీధిజక్కగా వెలువడు
గుక్క విన్నివెంట కూయదొడగు
ఘనున కోర్వలేని కాపురుషులు నిట్లె
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
గుర్రమెక్కి వీధుల వెంట పోయే వాని మీద కుక్కలు మోరిగినా ఏమి లాభము. దర్జాగా తనదారిన తను పోతుంటాడు. మూర్ఖులు మంచివారి మీద వేసే నిందలు అంతే, సజ్జనులు వాటికి చలింపక తమ మార్గములో సాగిపోతారు.

వేమన శతకం (Vemana Shatakam) - 649

వేమన శతకం (Vemana Shatakam) - 649

ఖలులు తిట్టిరంచు గలవరపడనేల?
వారు తిట్ల నేమి వాసి చెడును?
సజ్జనుండు తిట్ట శాపంబదౌనయా!
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
దుష్టులైనట్టి వారు తిట్టినా లెక్కచేయక్కరలేదు. దాని మూలంగా మనకు ఎటువంటి నష్టము ఉండదు.కాని మంచి వారు మనల్ని నిందించకుండా జాగ్రత్త పడాలి. సజ్జనుల తిట్టు శాపమువలె పనిచేస్తుంది.

వేమన శతకం (Vemana Shatakam) - 648

వేమన శతకం (Vemana Shatakam) - 648

తరచు కల్లలాడు ధరణీశులిండ్లలో
వేళవేళ లక్షి వెడలిపోవు
నోటికుండలోన నుండునా నీరంబు?
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
అసత్యమాడేవాడు రాజైనా సరె అతని సంపద నశించును. చిల్లి కుండలో ఏవిధంగానైతే నీరు ఉండదో, అదే విధంగా అబద్దాలాడే వాడు ఎంతటివాడైనా లక్షి అతని చెంట ఉండాలనుకోదు.కాబట్టి అసత్యాలని వదిలివేసి ఎల్ల వేళలా నిజం పలకాలి.

Thursday, October 24, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 647

వేమన శతకం (Vemana Shatakam) - 647

తల్లి బిడ్డలకును తగవు పుట్టించెడు
ధనము సుఖము గూర్పదని వచింత్రు
కాని, గడనలేక కడచుట యెట్లురా?
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
ధనము చెడ్డదని, ధనము మూలంగా తల్లికి బిడ్డలకు విరొధము కలుగుతుందని, ధనము ఉన్నందువలన సుఖము లేదని అంటుంటారు. కాని ధనము లేకపోతే దినము గడవజాలదు. కాబట్టి అత్యాశకి పోకుండా బ్రతకడానికి తగినంత ధనము సంపాదించి, అందరితో కలిసి మెలిసి ఉంటూ సుఖపడాలి.

వేమన శతకం (Vemana Shatakam) - 646

వేమన శతకం (Vemana Shatakam) - 646

ఈతరాని వాడి కెగరోజి దిగరోజి
యేరు దాటగలడె యీదబోయి?
పరుడు కానివాడు పరలోకమందునా?
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
ఈత రాని వాడు ఎన్ని సార్లు నీళ్ళలో దిగినా మునిగిపోతాడు కాని ఏరు దాటలేడు. అదే విధంగా ఙాని కాని వాడు ఎన్ని సార్లు ప్రయత్నించినా ముక్తిని పొందలేడు.

వేమన శతకం (Vemana Shatakam) - 645

వేమన శతకం (Vemana Shatakam) - 645

శాంతమె జనులను జయము నొందించును
శాంతముననె గురుని జాడ తెలియు
శాంత భావమహిమ జర్చింపలేమయా
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
శాంతముగా ఉండడం వలననే జనులకు విజయము లభిస్తుంది. శాంతముగా ఉండటం వలనే తగినె గురువు జాడ తెలుస్తుంది. శాంతము మూలంగానే సకల కార్యాలు నెరవేరుతాయి. అసలు శాంతము యొక్క మహిమ వర్ణింపలేనిది.

వేమన శతకం (Vemana Shatakam) - 644

వేమన శతకం (Vemana Shatakam) - 644

ధనము చాల గూర్చితను దాన ధర్మముల్
పొనరుపకయ యిచ్చు తనయులకును
తేనెకూర్చు నీగ తెరువరులకు నీదె
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
తేనెని సమకూర్చిన ఈగ దానిని పరులపాలు చేసినట్లుగా, నరుడు చాల కష్టపడి ధనము సంపాదించి, దానిని ధర్మము చేయక చివరకు ఇతరుల పాలు చేస్తాడు. కాబట్టి తనకు సరిపడిన ధనాన్ని ఉంచుకుని మిగిలిన దాన్ని పరులకివ్వడం పుణ్యుని లక్షణం.

వేమన శతకం (Vemana Shatakam) - 643

వేమన శతకం (Vemana Shatakam) - 643

వెన్న చేతబట్టి వివరంబు తెలియక
ఘృతము కోరునట్టి యతని భంగి
తాను దైవమయ్యు దైవంబు దలచును
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
వెన్న చేతిలో పెట్టుకుని నెయ్యి చేసే విధానము తెలియక నెయ్యిని అడుక్కున్నట్లు తనలోనే దైవము ఉన్నాడనే విషయము గ్రహింపక మూర్ఖ మానవులు దేవుని కోసం వెతుకుతూ ఉంటారు. కాబట్టి దైవుని గురించి బయట వెదకడం మాని తనలోనే పరమాత్మని సృష్టించుకోవాలి.

వేమన శతకం (Vemana Shatakam) - 642

వేమన శతకం (Vemana Shatakam) - 642

రాతి బసవని గని రంగుగా మ్రొక్కుచు
రూఢి బసవుగాల రుద్దుచుంద్రు
బసవ భక్తులెల్ల పాపులు తలపోయ
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
రాయి రూపంలో ఉన్న బసవన్నని నందిగా భావించి పూజిస్తూ ఉంటారు కాని జీవముతో ఉన్న అసలైన బసవన్నని అశ్రద్ద చేస్తూ పైగా హింసిస్తూ ఉంటారు. అటువంటి బసవన్న భక్తులు మహా పాపులు.

వేమన శతకం (Vemana Shatakam) - 641

వేమన శతకం (Vemana Shatakam) - 641

విత్త హీనమైన వేళలందును తల్లి
తనయు లాలు సుహృదు లనెడివార
లెల్ల శత్రులగుదు రెండైన నిజమిది
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
ధనములేని సమయములో తల్లి, భార్య, పిల్లలు, సన్నిహితులు వీరందరు శత్రువులు అవుతారనుట నిక్కమైన నిజము. కాబట్టి అతి ప్రేమకు పొయి ధనమును త్యజించుటకన్న, కావలిసినంత సంపాదించి అందరిని బ్రతికించగలగడం ముఖ్యం.

వేమన శతకం (Vemana Shatakam) - 640

వేమన శతకం (Vemana Shatakam) - 640

నరుడు జాగరమున నటియించు చుండును
నరునికిలను జాగ్ర తరుదు సుమ్ము
నరుడు జాగ్రతనుట ధరణిలో బరమాత్మ
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
మనిషి జాగ్రత్తగా ఉన్నట్లు నటిస్తుంటాడు లేదా తను జాగ్రత్త పడ్డానని ఊహించుకుంటూ ఉంటాడు కాని లోకములో మనిషికి జాగ్రత్త అరుదుగా ఉంటుంది. బయట జరిగే సంఘటనలు ఏవీ మనిషి ఆధీనంలో ఉండవు జాగ్రత్త పడటానికి, అసలు జాగ్రత్తగా ఉండగలిగే మనిషే పరమాత్మ. కాబట్టి అతి జాగ్రత్తకు పొయి జీవితాన్ని ఆస్వాదించడం మానుకోవద్దు.

వేమన శతకం (Vemana Shatakam) - 639

వేమన శతకం (Vemana Shatakam) - 639

ధనమెచ్చిన మదమెచ్చును
మదమొచ్చిన దుర్గుణంబు మానకహెచ్చున్
ధనముడిగిన మదముడుగును
మదముడిగిన దుర్గుణంబు మానును వేమా!


భావం:-
ధనము అధికమైతే గర్వం పెరుగుతుంది. గర్వం పెరిగిన వెంటనే చెడ్డగుణాలు అలవడతాయి. అదే విధంగా ధనం పొయిన వెంటనే గర్వం పోయి, చెడ్డగుణాలు తగ్గుతాయి. కాబట్టి ధనం రాగానే స్థిరమైన మనస్సుతో గర్వాన్ని తలకెక్కించుకోకూడదు.

వేమన శతకం (Vemana Shatakam) - 638

వేమన శతకం (Vemana Shatakam) - 638

ఉదకమందు మొసలి యుబ్బి యేనుగుబట్టు
మతకమేమొ బయల మసలబోదు
ఎఱుక మఱుగు దెలిసి యేకమై యట్లుండు
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
ముసలి నీటిలో ఉన్నప్పుడు ఏనుగునైన పట్టగలదు. అదే ముసలి ఒడ్డుమీద ఉన్నప్పుడు ఏనుగు చేతులో చస్తుంది. బలాబలాలు ఒకటే ఐనప్పటికీ, స్థాన బలాన్ని బట్టి మారుతుంటాయి.

Wednesday, October 23, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 637

వేమన శతకం (Vemana Shatakam) - 637

మఘవుడైననేమి? మర్యాదయెఱుగని
వారలేల తెలిసి గౌరవింత్రు
ఉరిమి మొఱుగుకుక్క యొగినేమెఱుగురా
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
మంచి మర్యాద తెలియని వాని ఇంటికి స్వయంగా దేవేంద్రుడు వెళ్ళినా అతనిని గౌరవించరు. అవమానించి పంపివేస్తారు. దారివేంట తిరిగే ఊర కుక్క మొఱుగుతూ యోగి వెంటపడుతుంది. అతని గొప్పతనం కుక్కకేమి తెలుస్తుంది.

వేమన శతకం (Vemana Shatakam) - 636

వేమన శతకం (Vemana Shatakam) - 636

చందమెఱిగి మాటజక్కగా జెప్పిన
నెవ్వడైన మాఱికేల పలుకు?
చందమెఱికియుండ సందర్భమెఱుగుము
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
మనుషులు నేర్పుగా, ఇంపుగా ఎవరిని నొప్పించకుండా మాట్లాడటం నేర్చుకోవాలి. అలా మాట్లాడగలిగిన వాడినే అందరు గౌరవిస్తారు. వాడు చెప్పినట్టు వింటారు. అలా కాకుండా నోటికొచ్చినట్టు మాట్లాడే మూర్ఖుని మాటలు ఎవరూ పట్టించుకోరు సరి కదా ఎదిరిస్తారు.

వేమన శతకం (Vemana Shatakam) - 635

వేమన శతకం (Vemana Shatakam) - 635

లెక్కలేనియాశ లీలమై యుండగా
తిక్కయెత్తి నరుడు తిరుగుగాక
కుక్కవంటి మనసు కూర్చుండనిచ్చునా?
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
ఒకవేళ కోరికలను అదుపులో పెట్టకపోతే అవి మనిషిని ఒకచోట స్తిరంగా ఉండనివ్వవు.ఆ కోరికల వానలో తడిసి ముద్దయి దిక్కు కానరాక పిచ్చి పట్టిన కుక్కలాగ అటు ఇటు తిరుగుతూ ఉంటారు. కాబట్టి కోరికలని అదుపులో పెట్టుకుని ప్రశాంతంగా జీవించడం నేర్చుకోవాలి.

వేమన శతకం (Vemana Shatakam) - 634

వేమన శతకం (Vemana Shatakam) - 634

మృగము మృగమనుచును మృగమును దూషింత్రు
మృగముకన్నజెడ్డ మూర్ఖుడగును
మృగముకన్న గుణము మూర్ఖునకేదయా?
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
నోరులేని మృగాలు అపాయం తలపెడతాయని వాటిని ద్వేషిస్తారు, వేటాడి చంపుతారు. కాని మూర్ఖులు మృగము కంటే అపాయం అని తెలుసుకోలేరు. మృగము తన ఆకలి కోసం వేటాడి అది తీరిన వెంటనే ఇంకెవరి జోలికి వెళ్ళదు. కాని మూర్ఖులు అలా కాదు తమ ద్వేషం చల్లారేదాకా హింసిస్తూనే ఉంటారు.

వేమన శతకం (Vemana Shatakam) - 633

వేమన శతకం (Vemana Shatakam) - 633

ముందరి పోటుల మాన్పను
మందెందైనను గలుగును మహిలోపల నీ
నిందల పోటుల మాన్పను
మందెచ్చటనైన గలదె మహిలో వేమా!


భావం:-
శరీరమునకు తగిలిన గాయలు తగ్గించడానికి, మాన్పడానికి ఈ లోకంలో మందులు దొరుకుతాయి కాని, మనసుకి తగిలిన గాయాలు మాన్పె మందులు ఎక్కడా దొరకవు. కాబట్టి ఎవరి మనస్సుని నొప్పించకుండా , సుటి పోటి మాటలతో భాద పెట్టకుండా ఉండటం మానవత్వం.

వేమన శతకం (Vemana Shatakam) - 632

వేమన శతకం (Vemana Shatakam) - 632

నీటిలోని వ్రాత నిలువకయున్నట్లు
పాటిజగతిలేదు పరములేదు
మాటిమాటికెల్ల మాఱును మూర్ఖుండు
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
మూర్ఖుని యొక్క మాటలు నీటిమూటలే అవుతాయి. ఎందుకంటే నీటిని ఒక మూటలో కడితే నిలుస్తుందా ఎమిటి? ఈ రకంగా మూర్ఖుడు ఒకసారి చెప్పిన మాటను మరొకసారి చెప్పక మారుస్తూ ఉంటాడు. ఒకసారి మంచి అన్న దానిని మరోకసారి చెడు అంటుంటాడు. కాబట్టి ఈ విధంగా మాటలు మార్చే మూర్ఖులను నమ్మరాదు.

వేమన శతకం (Vemana Shatakam) - 631

వేమన శతకం (Vemana Shatakam) - 631

ఔనటంచు నొక్కడాడిన మాటకు
కాదటంచు బలుక క్షణము పట్టు
దాని నిలువదీయ దాతలు దిగివచ్చు
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
ఎవరన్నా ఒక మాట మాట్లడితే మరుక్షణమే దానిని ఇంకొకరు అంగీకరించకపోవచ్చు. పైగా ఒకరిద్దరు అంగీకరించిన దాని మిగిలిన వారు సమర్ధించుట కష్టము.

వేమన శతకం (Vemana Shatakam) - 630

వేమన శతకం (Vemana Shatakam) - 630

ఓగుబాగెఱుగక యుత్తమూఢజనంబు
నిల సుధీజనముల నెంచజూచు
కరినిగాంచి కుక్క మొఱిగిన సామ్యమౌ
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
గుణవంతుల విలువ తెలియక మూర్ఖులు వారిని లక్ష్యపెట్టరు. దాని మూలంగా మంచి వారికొచ్చె నష్టమేమి ఉండదు. ఏనుగు వెనుక కుక్కలు పడితే ఏనుగుకు ఏమౌతుంది.

వేమన శతకం (Vemana Shatakam) - 629

వేమన శతకం (Vemana Shatakam) - 629

ఎంత చదువు చదివి యెన్నిటి విన్నను
హీనుడవగుణంబు మానలేడు
బొగ్గు పాలగడుగబోవునా నైల్యంబు
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
ఎంత గొప్ప చదువులు చదివి ఎన్ని వాదోపవాదాలు విన్నాగాని, మూర్ఖుడు అవలక్షణాలను మానలేడు. నల్లని బొగ్గుని ఎన్నిసార్లు పాలతో కడిగినా తెల్లగా అవుతుందా? ఇది అంతే!

వేమన శతకం (Vemana Shatakam) - 628

వేమన శతకం (Vemana Shatakam) - 628

అభిజాత్యముననె యాయువున్నంతకు
దిరుగుచుండ్రు భ్రమల దెలియలేక
మురికి భాండమునను ముసరునీగలరీతి
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
తమని తాము తెలుసుకోలేక మూర్ఖులు గొప్ప కులంలో పుట్టాము ఎంతో గొప్ప వారమని భ్రమపడుతుంటారు. కాని వారికి తాము భ్రాంతిలో ఉన్నట్లు తెలియదు. మనం చేసె పనుల బట్టి గొప్పవారమవుతాము కాని జన్మించిన కులము బట్టి కాదు. ఇలాంటివారందరు మురికి కుండలమీద వాలే ఈగల లాంటివారు.

వేమన శతకం (Vemana Shatakam) - 627

వేమన శతకం (Vemana Shatakam) - 627

అలయజేసి మలచి యడిగండ్లు మలిగండ్లు
తిరిపెమిడెడు కటికదేబెలెల్ల
నెలమి మన్నుదినెడి యెఱ్ఱ్లౌదురు సుమీ
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
ఇంటికొచ్చిన అతిధిని నానా భాదలకు గురిచేసి, మాటలతో సాధించి అన్నము పెట్టె మూర్ఖులు మరు జన్మలో పెండకుప్పల మీద జీవిస్తూ మట్టిదినే వాన పాములై పుడతారు.

వేమన శతకం (Vemana Shatakam) - 626

వేమన శతకం (Vemana Shatakam) - 626

ఈత వచ్చినపుడు లోతని పించునా?
ప్రాత దోసి కెపుడు భయములేదు
క్రొతి కొమ్మ కెక్కి కుప్పుంచి దూకదా?
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
ఈత వచ్చినవానికి లోతనిపించదు. పాత నేరస్థునికెప్పుడూ భయము లేదు. ఇదంతా వారికి ఎంత సులభం అంటే కోతి ఒక కొమ్మ మీదనుంచి మరోక కొమ్మ మీదకి దూకినంత.

వేమన శతకం (Vemana Shatakam) - 625

వేమన శతకం (Vemana Shatakam) - 625

బఱ్ఱెలట్టు లఱవ ఫలమేమి కలదురా?
అందు సార్ధకంబు చెందకున్న
విన్నవారు వారి వెఱ్ఱులుగా నెంత్రు
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
గెదెలు అరిచినట్లు వేదాలు వల్లిస్తే ఫలితమేమి ఉండదు. దానిలో ఉన్న భావార్ధకములు గ్రహించి సార్ధకులు కావాలి. అలా కానట్లైతే వినెవారు వెఱ్ఱివారుగా నెంచుతారు.

వేమన శతకం (Vemana Shatakam) - 624

వేమన శతకం (Vemana Shatakam) - 624

ఫణితి తెలిసి మాఱు పల్కుటే యుక్తము
గణనకెక్కునట్టి ఘనుడె యెపుడు
గుణములేక యున్న గుదురునే యూహలు
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
ఏదైనా సమస్య వచ్చినపుడు న్యాయం తెలుసుకుని జవాబివ్వడం ఉత్తమం. అలా సమాధానం ఇచ్చినవాడే ఉత్తముడై గౌరవించబడతాడు. అలాంటి న్యాయ గుణము లేకపొయినా, కావాలని అన్యాయాన్ని ప్రోత్సహించినా గౌరవం పొందలేరు.

వేమన శతకం (Vemana Shatakam) - 623

వేమన శతకం (Vemana Shatakam) - 623

పిసిని వానియింట బీనుగు వెడలిన
గట్టె కోలలకును గాసు లిచ్చి
వెచ్చమాయనంచు వెక్కివెక్కి మరేడ్చు
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
పిసినారివాడి ఇంట్లో మరణం సంభవిస్తే పాడె కట్టెలకు డబ్బులిచ్చి, అవి ఖర్చై పొయాయని వెక్కి వెక్కి మరీ ఏడుస్తాడు లోభి.

వేమన శతకం (Vemana Shatakam) - 622

వేమన శతకం (Vemana Shatakam) - 622

పనితొడవులు వేఱు బంగారు మొక్కటి
పలు ఘటములు వేఱు ప్రాణమొకటి
అరయదిండ్లు వేఱుటాకలి యొక్కటి
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
పనితనము మూలంగా నగలు వేరుగా కనపడతాయి కాని వాటిలో ఉన్న బంగారమొకటే. ఆహారాలలో అనేక రకాలున్నాగాని ఆకలి ఒక్కటే. అలాగే దేహాలు వేరు కాని ప్రాణమొక్కటే? కాబట్టి అన్ని ప్రాణులను సమానంగా ఆదరించాలి.

వేమన శతకం (Vemana Shatakam) - 621

వేమన శతకం (Vemana Shatakam) - 621

తిట్టికొట్టిరేని తిరిగి మాటాడక
యురకున్న జూడ నుర్విమీద
వాడగు పరమాత్మ వర్ణింప శక్యమా?
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
తిట్టినా కొట్టినా ఏమి చలింపక మౌనంగా ఎవరు ఉండగలరో వారే ఈ భూమి మీద నిజమైన దేవుడు. మోహావేషాలకి మాములు మనిషి లోనవుతాడు కాని ఙాని దేన్నైనా ఒకే విధంగా గ్రహిస్తాడు. కాబట్టి ఙానం పెంచుకుని మనస్సులోని భావాలను ఆధీనంలో ఉంచుకోవాలి.

వేమన శతకం (Vemana Shatakam) - 620

వేమన శతకం (Vemana Shatakam) - 620

తన్నుదా దెలిసిన దానె పోబ్రహ్మంబు
తనువులోన ముక్తి దగిలియుండు
తన్నెఱుంగని వాడు తానెట్టి బ్రహ్మంబు?
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
తనను తాను తెలుసుకున్న వాడె నిజమైన బ్రహ్మ. ముక్తి అనేది ఎక్కడో లేదని తన దేహంలోనె ఇమిడి ఉందని తెలుసుకోవాలి. తనను తానే తెలుసుకోలేనివాడు దేన్ని తెలుసుకోలేడు.

వేమన శతకం (Vemana Shatakam) - 619

వేమన శతకం (Vemana Shatakam) - 619

జయము భయము దాటి చలపట్టి యుండును
దయకు బాత్రుడగును ధర్మపరుడు
నయముగాను గురుని నమ్మి నెమ్మది వేడు
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
జయాపజాయలనేవి పట్టించుకోకూడదు. అటువంటివి అన్ని వదిలిపెట్టి మంచి గురువుని ఎన్నుకుని పట్టుదలతో, అతని సహాయంతో మనం అనుకున్నది సాధించి లక్ష్యాన్ని చేరుకోవాలి.

వేమన శతకం (Vemana Shatakam) - 618

వేమన శతకం (Vemana Shatakam) - 618

పడి పడి మ్రొక్కగ నేటికి
గుడిలో గల కఠిన శిలల గుణములు చెడునా
గుడి దేహ మాత్మ దేవుడు
చెడుఱాళ్ళకు వట్టిపూజ చేయకు వేమా!


భావం:-
పదే పదే మ్రొక్కినంత మాత్రాన గుడిలో ఉన్న కఠిన శిలల గుణాలు మారతాయా ఏమిటి? దేహమే దేవాలయము, ఆత్మయే దేవుడు అనే నిజము గ్రహించక రాతి విగ్రహాలకు పనికి మాలిన పూజలు చేయడము నిరర్దకము.

Tuesday, October 22, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 617

వేమన శతకం (Vemana Shatakam) - 617

కోపమునను నరక కూపము జెందును
కోపమునను గుణము కొఱతవడును
కోపమునను బ్రతుకు కొంచమై పోవును
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
కోపము వలన మానసిక ప్రశాంతత పోయి జీవితం నరకమవుతుంది. కోపము వలన మనకున్న మంచి గుణము నశించిపోతుంది. అంతెందుకు కోపము వలన ఆయుష్షే తగ్గిపోతుంది. కాబట్టి కోపాన్ని వదిలించుకుని స్థిరమైన మనస్సుతో ఎల్లవేళలా ప్రశాంతంగా ఉండాలి.

వేమన శతకం (Vemana Shatakam) - 616

వేమన శతకం (Vemana Shatakam) - 616

ఎఱుకయుండువాని కెఱుకయేయుండును
ఎఱుకలేనివాని కెఱుకలేదు
ఎఱుకలేని యెఱుక నెఱుగుట తత్వము
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
తెలిసిన వానికి అన్ని తెలిసే ఉంటాయి. తెలియని వానికి ఏమీ తెలియదు. తెలియని దానిని తెలుసుకొనడమే ఙానము. కాబట్టి బద్దకము వదిలించుకుని తెలియని దాని గూర్చి పరిశోదిస్తూ తెలుసుకొనిన వాడే గొప్ప ఙాని.

వేమన శతకం (Vemana Shatakam) - 615

వేమన శతకం (Vemana Shatakam) - 615

అన్నదానమునకు నధిక సంపదగల్గి
యమరలోక పూజ్యుడగును మీఱు
అన్నమగును బ్రహ్మమది కనలేరయా!
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
అన్న దానం చేయడం చేత అధిక పుణ్యం కలిగి దేవలోకంలో కూడ పుజ్యుడవుతారు మీరు. అన్నమే పర బ్రహ్మస్వరూపం. దానికి మించిన దానం ఈ లోకంలో లేదు. కాబట్టి అడిగిన వారికి కాదనకుండా అన్నదానం చేయండి.

వేమన శతకం (Vemana Shatakam) - 614

వేమన శతకం (Vemana Shatakam) - 614

బ్రహమ్మేడ ననుచు బలుమాఱు నాడేరు
వెఱ్ఱిమూర్ఖ జనులు విధముచూడ
బ్రహ్మ మన్నిట దగు పరిపూర్ణమై యుండ
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
దైవం ఎక్కడ, బ్రహ్మం ఎక్కడ అని పదే పదే అడుగుతూ ఉంటారు మూర్ఖజనులు, సమస్తమంతా బ్రహ్మతో నిండియుండగా అనుమానం ఎందుకో?

వేమన శతకం (Vemana Shatakam) - 613

వేమన శతకం (Vemana Shatakam) - 613

పెట్టినంత ఫలము పెక్కుండ్ర కుపహతి
జేయకున్న దాను చెఱపకున్న
పెండ్లి చేయునట్టి పెద్ద ఫలమురా!
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
ఎవరన్నా ఇతరులకు సహాయము చెద్దామని వస్తే, తను పెట్టకపొయినా ఫర్వాలేదుకాని చెడగొట్టకుండా ఉంటే చాలు. అలా చేసినట్లైతే తనే పెట్టినంత ఫలమే కాకుండా ఒక పెల్లి చేసినంత పుణ్యము వస్తుంది. కాబట్టి ఎవరన్నా ఇతరులకు సహాయము చేయడానికి సిద్దపడితే తనలోని ద్వేషభావాలను వదిలివేసి వారిని ప్రోత్సహించడం మంచిది.

వేమన శతకం (Vemana Shatakam) - 612

వేమన శతకం (Vemana Shatakam) - 612

బ్రతుకు నిత్యమనుచు బదరుచు వగమీఱ
విఱ్ఱవీగువాడు వెఱ్ఱివాడు
ప్రాణులెల్ల యముని బారికి గొఱ్ఱెలు
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
బ్రతుకు శాశ్వతమని భావించి విర్రవీగుచూ తిరిగేవాడు వెఱ్ఱివాడు.భూమిమీద ఉన్న ప్రాణులందరు యముని కత్తిముందు గొఱ్ఱెలే.

వేమన శతకం (Vemana Shatakam) - 611

వేమన శతకం (Vemana Shatakam) - 611

నాసికాగ్రమందు నయముగా గుఱినిల్పి
వాసిగాను జూడ వశ్యమగును
గాశికంచుల గన గడగండ్ల పడనేల?
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
నాసిక చివర దృష్టి నిలిపి, ఆలొచనలన్ని త్యగించి, నిశ్చలంగా మనసును అదుపులో ఉంచుకొనిన సమస్త ప్రపంచము అర్దమవుతుంది. ఈ యోగము సాధ్యమయితే కాశికి కంచికి వెళ్ళవలసిన పని లేదు.

వేమన శతకం (Vemana Shatakam) - 610

వేమన శతకం (Vemana Shatakam) - 610

ద్వారబంధమునకు దలుపులు గడియలు
వలెనె నోటికొప్పుగల నియతులు
ధర్మమెఱిగి పలుక ధన్యుండౌ భువిలోన
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
గుమ్మానికి తలుపులు, గడియలు ఉన్నట్లే, మాటకు నియమాలు రక్షణగా పనిచేస్తాయి.ధర్మం గ్రహించి జాగ్రత్తగా మాట్లాడి మెప్పు పొందాలి గాని, విచ్చలవిడిగా మాట్లాడి చెడ్డ పేరు తెచ్చుకోకూడదు.

వేమన శతకం (Vemana Shatakam) - 609

వేమన శతకం (Vemana Shatakam) - 609

దొడ్డివాడు పెద్ద తోడేలునైనను
మట్టుచూచి దాని మర్మమెఱిగి
గొడ్డుగొఱ్ఱెనైన గొని చననీయడు
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
మాములు మనిషైన గొఱ్ఱెల కాపరి కూడ తోడేలు తన మందమీద పడితే దానిని చంపో బెదరగొట్టో పశువులను కాపాడుకుంటాడు. అలానే మనం కష్టాలలో ఉన్నప్పుడు ధైర్యంగా ఎదుర్కోవడమే అసలైన తత్వం.

వేమన శతకం (Vemana Shatakam) - 608

వేమన శతకం (Vemana Shatakam) - 608

దేవభూములందు దేవాలయములందు
దేవుడనుచు మ్రొక్కి సేవచేసి
తెలియ విశ్వకర్మ దేవాదిదేవుడౌ
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
దేవాలయములోని విగ్రహాలను దేవుళ్ళుగా భావించి జనులు మొక్కుతుంటారు. ఆ విగ్రహమే దేవుడైతే దానిని చెక్కిన శిల్పి అంతకంటే గొప్ప అయిన దేవాది దేవుడు అవుతాడు కదా?

వేమన శతకం (Vemana Shatakam) - 607

వేమన శతకం (Vemana Shatakam) - 607

దాతయైనవాడు తానె మున్నిచ్చెడు
గాని వాడొసగునె కానియైన
జలము దప్పిదీర్చు మలమెట్లు తీర్చును?
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
దాత ఇతరులతో పోటీ పడకుండా తనకు తోచిన సహయమేదో ముందుగానే ఇస్తాడు. అది ఎంతైనా కావొచ్చు. కాని లోభి ఎంత వేడుకొన్న కొంచమైనా సహయం చేయడు. నీరు మన దాహం తీరుస్తుంది కాని, మలము తీర్చదు కదా?

వేమన శతకం (Vemana Shatakam) - 606

వేమన శతకం (Vemana Shatakam) - 606

తల్లి కన్న తల్లి తన తల్లి పినతల్లి
తండ్రిగన్న తల్లి, తాత తల్లి
ఎల్లశూద్రులైరి యేటి బ్రాహ్మణుడిక?
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
తల్లిని కన్న తల్లి, తల్లి పిన తల్లి, తండ్రి తల్లి, తాత తల్లి ఇలా అందరూ బ్రహ్మనుంచి వచ్చిన శూద్రులే. వీరిలో కొంత మంది బ్రహ్మణులమని చెప్పుకుంటారు. అందరూ ఒకరే అని తెలియని ఇలాంటి మూర్ఖుల గొప్పతనమేమిటి?

వేమన శతకం (Vemana Shatakam) - 605

వేమన శతకం (Vemana Shatakam) - 605

జావి జంపుటెల్ల శివభక్తి తప్పుటే
జీవి నరసి కనుడు శివుడె యగును
జీవుడు శివుడనుట సిద్దంబు తెలియురా!
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
జీవుని చంపడమంటే శివుని తిరస్కరించినట్లే. భూమి మీద కల ప్రతి జీవిలోను శివుడున్నాడు. జీవుడు శివుడు ఒక్కరే అని తెలుసుకోవడమే ఙానం.

వేమన శతకం (Vemana Shatakam) - 604

వేమన శతకం (Vemana Shatakam) - 604

ఎంత భాగ్యమున్న నంతకష్టపు జింత
చింతచేత మనసు చివుకుమనును
చింతలేకయుంట చెడిపోని సంపద
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
ధనం ఎక్కువ అయిన కొద్ది విచారము పెరుగుతూ ఉంటుంది. ఆటువంటి విచారము చేత మనస్సులో చింత పెరుగుతుందే కాని తరగదు. మనకేమి చింతంటూ లేకుండా ఉండటమే అసలైన సంపద.

వేమన శతకం (Vemana Shatakam) - 603

వేమన శతకం (Vemana Shatakam) - 603

గుణవిహీన జనుని గుణ మెంచగానేల?
బుద్దిలేని వాని పూజయెల?
మనసులేనివాని మంత్రంబు లేలయా?
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
గుణమంటూ లేనివాని గుణగణాలను గురించి తలచరాదు.బుద్దిలేని వాడిని పూజించరాదు. అలానే మనశ్శుద్ది లేనివాని మంత్రాలను నమ్మరాదు.

వేమన శతకం (Vemana Shatakam) - 602

వేమన శతకం (Vemana Shatakam) - 602

ఎన్ని ఎన్ని పూజ లెచట జేసిననేమి?
భక్తిలేనిపూజ ఫలములేదు
భక్తిగల్గుపూజ బహుళ కారణమగు
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
మనస్సులో భక్తి లేకుండా ఎన్ని పూజలు చేసినా ఎటువంటి ఉపయోగం ఉండదు. భక్తి చేసే పూజ అన్ని విధాల సత్ఫలితాలను ఇస్తుంది.

వేమన శతకం (Vemana Shatakam) - 601

వేమన శతకం (Vemana Shatakam) - 601

ఈతెఱిగినవారైనను
లోతైనటువంటి నూత బడిపోరా?
ఈతలు నేర్చిన యోగము
చేతిరుగకయున్న నేమిచేయుదు వేమా?


భావం:- ఎంత ఈత వచ్చిన వారైనా కాని లోతైనటువంటి బావిలో పడితో చావు తప్పదు. అలాగే ఎంత యోగము తెలిసినా మనస్సులో ఏకాగ్రత లేకపోతే వ్యర్దము.

వేమన శతకం (Vemana Shatakam) - 600

వేమన శతకం (Vemana Shatakam) - 600

ఈ దేహ మెన్నిభంగుల
బ్రోది యొనర్చినను నేలబోవును గాదే
మీదెఱిగి మురికి గడుగుచు
భేదంబులు మాని ముక్తి బెరయును వేమా!


భావం:- ఈ దేహాన్ని ఎంత పోషించినా చివరకు మట్టిపాలు కాక తప్పదు. అంతిమ సత్యమైన ఈ నిజాన్ని గమనించి తన పర అనే భేదభావం వదిలి అందరిని సమాన దృష్టితో చూడాలి.

వేమన శతకం (Vemana Shatakam) - 599

వేమన శతకం (Vemana Shatakam) - 599

ఐకమత్య మొక్క టావశ్యకం బెప్డు
దాని బలిమి నెంతయైన గూడు
గడ్డీ వెంటబెట్టి కట్టరా యేనుంగు
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
ఐకమత్యం మొక్కటే మనకెప్పుడూ అవసరం. దానికి ఉన్న బలం దేనికి సాటి రాదు. దాని వలన ఎంత ప్రయొజనం ఐనా చెకూరుతుంది. గడ్డి పరకలన్నింటిని చేర్చి ఎనుగును కట్టలేమా?

వేమన శతకం (Vemana Shatakam) - 598

వేమన శతకం (Vemana Shatakam) - 598

వాక్కువలన గలుగు పరమగు మోక్షంబు
వాక్కువలన గలుగు వరలు ఘనత
వాక్కువలన గలుగు నెక్కుడైశ్వర్యంబు
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
మాట తీరుని బట్టి గౌరవం కలుగుతుంది, ఐశ్వర్యం దక్కుతుంది, అందరి వద్ద మన్ననలు పొందుతాము చివరకి మోక్షం కూడ లబిస్తుంది. కాబట్టి మాట్లాడే విధానం తెలుసుకోవడం ఎంతో ముఖ్యం.

వేమన శతకం (Vemana Shatakam) - 597

వేమన శతకం (Vemana Shatakam) - 597

వక్షమందు గురుని వర్ణించి చూడరా
రక్షకత్వమునకు రాచబాట
అక్షమాల జపమె యవని దొంగలరీతి
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
ఒంటి మీద రుద్రాక్షల మాల వేసుకుని, ఒళ్ళంతా బూడిద పూసుకుని దొంగ జపము చేస్తే ప్రొయొజనము లేదు. మనసులో గురువుని పెట్టుకుని గమనించడమే అసలైన ధ్యానం.

వేమన శతకం (Vemana Shatakam) - 596

వేమన శతకం (Vemana Shatakam) - 596

మదమువలన గలుగు మాటలు మఱి పల్కి
మ్రుచ్చు సుద్దలు నొగి మోసపుచ్చి
కాసురాబెనగెడు కష్టుండు గురుడౌనె?
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
ఒళ్ళంతా మదమెక్కి ప్రగల్భాలు పలుకుతూ, మాయ మాటలతో పరులను మోసగించి వారి ధనాన్ని ఆర్జించే వాడు ఎక్క్డైనా గురువు అవుతాడా? కీనె కాడు. అలాంటి వాణ్ణి గురువుగా స్వీకరించడం మూర్ఖత్వం.

వేమన శతకం (Vemana Shatakam) - 595

వేమన శతకం (Vemana Shatakam) - 595

మంత్ర మొకటి చెప్పి మఱి దేవతార్చన
చేసి తమకు గరుణ చెందినదని
వేదపఠన చేసి వెఱ్ఱులైపోదురు
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
నోటికొచ్చిన కొన్ని మంత్రాలు జపించి, కాసేపు దేవతారాధన చేసి, తామింకా గొప్పవాళ్ళమైపొయామని తలచి వేద పఠనము మొదలు పెడతారు. ఇదంతా వెఱ్ఱితనము. మంత్ర తంత్రాల వలన కరుణ జనించదు.

వేమన శతకం (Vemana Shatakam) - 594

వేమన శతకం (Vemana Shatakam) - 594

మంటిలోన బుట్టి మంటిలోన బెరిగి
మంటిలోనె దిరిగి మనుజుడాయె
మన్నుమంటి గలువ మనుజుడే తత్వము
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
మనిషి మట్టిలో పుట్టి, మట్టిలో పెరిగి, మట్టిలో తిరిగి, చివరికి మట్టిలోనే కలిసిపోతున్నాడు. మనిషి అనేవాడు మట్టిలో కలవడమే తత్వము. ఇది తప్పుబట్టరాని నిజం.

వేమన శతకం (Vemana Shatakam) - 593

వేమన శతకం (Vemana Shatakam) - 593

భక్తి ముక్తి కలుగు భాగ్యంబు కలుగును
చిత్తమెఱుగు పడతి చెంత బతికి
చిత్తమెఱుగని సతి జేరంగరాదురా
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
అనుకూలవతి అయిన భార్య దోరికిందా అతడు అదృష్టవంతుడే. అటువంటి భార్య మూలంగా భక్తి, ముక్తి, భాగ్యము మూడు కలుగుతాయి. కాని భర్త మనస్సు గ్రహించలేని భార్యతో సంసారం వ్యర్ధము.

వేమన శతకం (Vemana Shatakam) - 592

వేమన శతకం (Vemana Shatakam) - 592

ఫణికి గోరలుండు భయమొందునట్టులే
వెఱుతురయ్య దుష్టువిభవమునకు
కోఱలూడ ద్రాచు మీఱునా దుష్టత
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
మూర్ఖుని దగ్గర కాని ధనం చేరిందా, తమకేమన్న హాని చేస్తాడెమో అని కోరలున్న పాముని చూసి భయపడినట్లు భయపడుతారు. కాని ధనం పొయిందా, అతన్నెవరూ పట్టించుకోరు, చేరదీయరు. కోరలు పొయిన పాముని ఎవరూ పట్టించుకోరు కదా ఇదీ అలానే.

వేమన శతకం (Vemana Shatakam) - 591

వేమన శతకం (Vemana Shatakam) - 591

ప్రభువు క్రోతియైన ప్రగ్గడ పందియౌ
సైనికుండు పక్కి సేన పనులు
ఏన్గులశ్వములను నెలుకలు పిల్లులు
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
రాజు కాని కోతిలాగ చపలచిత్తుడైతే గనుక మంత్రి అశుద్దాన్ని తినే పందిలా మారతాడు. సైనికులు పశువుల్లా మారిపోతారు. ఇక గుర్రాలు ఏనుగులు, ఎలుకలు పిల్లుల్లా అవుతాయి. కాబట్టి ఎంత బలగం ఉన్నా రాజ్యన్ని పరిపాలించే ప్రభువు సమర్దుడు కావాలి.

వేమన శతకం (Vemana Shatakam) - 590

వేమన శతకం (Vemana Shatakam) - 590

పూసపోగు పసిడి పుష్పంబు మొదలగు
సంపదగలవాడు జగతియందు
హీనకులజుడైన హెచ్చని యందురు
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
అభరణాలు బంగారు పుష్పాలు వంటివి గల సంపన్నుడు భూమి మీద తక్కువ కులస్తుడైనా గౌరవం పొందుతాడు. కులం అనేది పేరుకే గాని, మనుషులందరికి డబ్బంటే ఆశ, డబ్బు ఉన్నవాడంటే గౌరవం.

వేమన శతకం (Vemana Shatakam) - 589

వేమన శతకం (Vemana Shatakam) - 589

నిజములాడునతడు నిర్మలుడైయుండు
నిజమునాడు నతడు నీతిపరుడు
నిజముపల్కకున్న నీచచండాలుడు
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
నిజము చెప్పెవాడెప్పుడు మంచి మనస్సు కలవాడై ఉంటాడు. పైగా నీతిపరుడు కూడ. కాబట్టి నిజము మాట్లాడేవారిని ఎల్ల వేళలా గౌరవించాలి. అబద్దం మాట్లాడెవాడు మాత్రం పరమ చండాలుడు.

వేమన శతకం (Vemana Shatakam) - 588

వేమన శతకం (Vemana Shatakam) - 588

కల్లలాడుకంటే కష్టంబు మఱిలేదు
కష్టమెపుడొ కీడుకలుగజేయు
ద్విజుడననుట చొద త్రిమ్మరి తనమురా
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
అబద్దాలడటం కంటే చెడ్డపని ఇంకొకటి లేదు. దాని వలన ఎప్పుడోకప్పుడు కీడు తప్పదు. కాబట్టి ఎల్లప్పుడూ నిజములు పలుకడం ఉత్తమం. పైగా అబద్దాలాడుతూ తమకు అంతా తెలుసునని చెప్పుకునే వాడు ధూర్తుడు..

Monday, October 21, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 587

వేమన శతకం (Vemana Shatakam) - 587

పాలరాళ్ళదెచ్చి పరగంగ గుడికట్టి
చెలగి శిలలు పూజ చేయుచుంద్రు
శిలల బూజచేయ చిక్కునదేమిటి?
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
పాలరాళ్ళను తెచ్చి అత్యద్బుతంగా ఆలయం నిర్మించి, దానిలో శిలా విగ్రహాలు ప్రతిష్ఠించి పూజలు చేస్తూ ఉంటారు. మనసులో భక్తేమి లేకుండా శిలలను పూజించడం మూలంగా ఏమి లాభం.

వేమన శతకం (Vemana Shatakam) - 586

వేమన శతకం (Vemana Shatakam) - 586

లోనుజూచినతడు లోకంబు లెఱుగును
బయలజూచినతడు పరమయోగి
తన్ను జూచినతడు తానౌను సర్వము
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
ఆత్మను చూచిన వాడు లోకంలో దెన్నైనా చూడగలడు. అలా బయట లోకం కూడ చూసిన వాడె పరమయోగి కూడ అవుతాడు. కాని తనను తాను తెలుసుకున్నవాడు, సర్వమూ తెలుసుకున్నట్లు.

వేమన శతకం (Vemana Shatakam) - 585

వేమన శతకం (Vemana Shatakam) - 585

త్రాడు మెడకు వేసి తనకు శూద్రత్వము
పోయె ననెడి దెల్ల బుద్ది లేమి
మది నిలుపక త్రాడు మఱి వన్నె దెచ్చునా?
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
జంధ్యం మెల్లో వేసుకుని తనకి శూద్రత్వం పొయి బ్రహ్మణత్వం వచ్చిందనుకోవడం బుద్దిహీనత. మనస్సుని స్థిరంగా ఉంచుతూ ఙానం సంపాదించకపోతే ఎన్ని జంద్యాలు వేసుకున్నా ఏమి లాభం.

వేమన శతకం (Vemana Shatakam) - 584

వేమన శతకం (Vemana Shatakam) - 584

మాదిగయనగనె మఱి తక్కువందురు
మాదికయిలసురుల మామ గాదె
మాదిగకును బిడ్డ మన యరుంధతి గదా
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
మాదిగలనగానే ఎంతో చులకనగా చూస్తారు మూర్ఖులు. పురాణాలను చూస్తే మాదిగ దేవతలకు మామ కదా! అంతెందుకు మాదిగలలో పుట్టిన బిడ్డే మన అరుంధతి కదా! ప్రతి నవదంపతులకె చూపె దేవత తనే. కాబట్టి మనుషులందరు సమానమనే సత్యం తెలుసుకోవడం ముఖ్యం.

వేమన శతకం (Vemana Shatakam) - 583

వేమన శతకం (Vemana Shatakam) - 583

పాలగతియు నీరు పాలెయై రాజిల్లు
గురునివలన నట్లు కోవిదుడగు
సాధుసజ్జనముల సంగతులిట్లరా
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
పాలల్లో కలిసిన నీళ్ళు పాల లాగ మారిపోతాయి. అలాగే గురువు మూలంగా శిష్యుడుకూడ విద్వాంసుడవుతాడు.కాబట్టి సాధు సజ్జనులలో చేరితే సద్గుణాలే వస్తాయి.

వేమన శతకం (Vemana Shatakam) - 582

వేమన శతకం (Vemana Shatakam) - 582

పక్షిజాతి బట్టి పరగ హింసలు పెట్టి
గుళ్ళుగట్టి యందుగదురబెట్టి
యుంచు వారి కట్టి వంచనరాదొకో
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
అపకారులుకాని అమయకులైన పక్షులను పట్టుకుని పంజారాలలో పెట్టి హింసించే వారికి కూడ అలాంటి దుర్గతియే పడుతుంది.

వేమన శతకం (Vemana Shatakam) - 581

వేమన శతకం (Vemana Shatakam) - 581

పరులవిత్తమందు భ్రాంతి వాసిన యట్టి
పురుషుడవనిలోన పుణ్యపూర్తి
పరులవిత్తమరయ పాపసంచితమగు
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
ఇతరుల ధనం మీద ఆశకలుగని మానవుడే ఈ లోకంలో పుణ్యమూర్తి అవుతాడు. పరుల ధనమును పొందినచో అది పాపం చేత సంపాదించినదే అవుతుంది.