Showing posts with label VemanaShatakam5. Show all posts
Showing posts with label VemanaShatakam5. Show all posts

Monday, November 18, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 755

వేమన శతకం (Vemana Shatakam) - 755

నీళ్లలోన మొసలి నిగిడి యేనుగు దీయు
బయట కుక్కచేత భంగపడును
స్థానబలిమిగాని తన బలిమి కాదయా
విశ్వదాభిరామ వినురవేమ!


తాత్పర్యం:
నీళ్లలో ఉన్నంత సేపే మొసలి శక్తి పనిచేస్తుంది. ఏనుగును సైతం నీళ్లలో ఉండి పట్టిందంటే ఎట్టి పరిస్థితుల్లో అది విడువదు. అదే నేలపైకి వచ్చిందా అంతటి మొసలికి కూడా శక్తి క్షీణించినట్లే. ఆఖరకు కుక్కతోకూడా దానికి భంగపాటు తప్పదు. ఎందుకంటే, ఎవరి బలానికైనా అసలు మూలం స్థానవిలువనుబట్టే అని తెలుసుకోవాలి.

Thursday, November 14, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 754

వేమన శతకం (Vemana Shatakam) - 754

హీనగుణము వాని నిలుజేర నిచ్చిన
నెంతవానికైన నిడుము గలుగు
ఈగ కడుపు జొచ్చి యిట్టట్టు సేయదా
విశ్వదాభిరామ వినురవేమ!


తాత్పర్యం:
దుర్గుణాలు కలిగిన వారిని ఎంత మాత్రం దరి చేరనీయరాదు. వీలైనంత వరకు వారిని దూరంగా ఉంచడమే మేలు. పొరపాటున అలాంటి వారిని ఇంట్లో వుంచుకొంటే, ఎంతటి వారికైనా సరే కష్టాలు తప్పవు. కర్మ కాలి ఈగ ఒకవేళ మన కడుపులోకి చేరితే.. ఇంకేమైనా ఉందా? లోన అది చేసే హాని ఇంతా అంతా కాదు కదా.

Monday, November 11, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 753

వేమన శతకం (Vemana Shatakam) - 753

ఎద్దుకైనగాని యేడాది తెల్పిన
మాట దెలసి నడచు మర్మమెఱిగి
మొప్పె తెలియలేడు ముప్పదేండ్లకునైన
విశ్వదాభిరామ వినురవేమ!


తాత్పర్యం:
మూర్ఖుని మనసు ఎప్పటికీ మారేది కాదు. దానిని మార్చడం ఎవరి తరమూ కాదు కూడా. అందుకే, అలాంటి వారినే మూర్ఖుడు అన్నారు. ఆఖరకు మనిషి వలె ఆలోచించలేని ఎద్దుకైనా ఒక ఏడాదిపాటు ఒక పద్ధతిని అలవాటు చేస్తే అది మన మర్మాన్ని ఎరిగి నడచుకొంటుంది. కానీ, ముప్పయేండ్లపాటు ఎన్ని బోధించినా మూర్ఖునికి బోధపడదు.

Friday, November 8, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 752

వేమన శతకం (Vemana Shatakam) - 752

చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు
కొంచెమైన నదియు గొదవు గాదు
విత్తనంబు మఱ్ఱివృక్షంబునకు నెంత
విశ్వదాభిరామ వినురవేమ!


తాత్పర్యం:
పుణ్యం కొంచెమైనా సరే, దానిని చిత్తశుద్ధితో చేయాలి. అప్పుడు దానికి తప్పక తగిన ప్రతిఫలం లభిస్తుంది. మర్రివిత్తనం చిన్నదైనంత మాత్రాన అది పెద్ద వృక్షంగా ఎదగకుండా ఉంటుందా! అందుకే, మంచిపని మంచివిత్తనంతో సమానమని పెద్దలు అన్నారు. సద్బుద్ధితో ఏది చేసినా, ఎంత చేసినా విజయం సిద్ధిస్తుందని అందరూ తెలుసుకోవాలి!

వేమన శతకం (Vemana Shatakam) - 751

వేమన శతకం (Vemana Shatakam) - 751

జాతి, కులములంచు జనులెల్ల బద్దులై,
భావ పరమునందు బ్రాలుమాలి,
చచ్చి పుట్టు చుంద్రు జడమతులై భువి
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
జాతులు, కులాలు, మతాలు అంటూ వాటికి బానిసలై, వివేచనా ఙానము నశించి, చచ్చి పుడుతుంటారు మూర్ఖులు. వీరు ఎన్ని జన్మలెత్తినా మనుషులందరూ సమానమే అని తెలుసుకోలేరు. మనమందరూ సోదరభావముతో కులభేదాలు విడిచి జీవించినప్పుడే ఈ భూదేవికి అసలైన శాంతి.