Showing posts with label VemanaShatakam4. Show all posts
Showing posts with label VemanaShatakam4. Show all posts

Friday, November 8, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 750

వేమన శతకం (Vemana Shatakam) - 750

కలిమిజూచియీయ గాయమిచ్చినయట్లు
సమున కీయ నదియు సరసతనము
పేదకిచ్చు మనువు పెనవేసినట్లుండు
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
తనకంటే ధనికునికి పిల్లనిచ్చినచో, శరీరముకోసి ఇచ్చినంత భాద పెట్టగలరు. మనము చేసిన శ్రమ మాత్రమే మిగులుతుంది. సమానునికి ఇస్తే కొంత నయము. మనకంటే పేద వానికిస్తే ఆ పొత్తు పది కాలాలు ఉంటుంది. కాబట్టి పొత్తులోనైనా పంతములోనైనా సమఉజ్జి అవసరము.

వేమన శతకం (Vemana Shatakam) - 749

వేమన శతకం (Vemana Shatakam) - 749

యాత్రపోయినాత డెన్నాళ్ళు తిరిగిన
బాదమైన ముక్తి పదవి గనడు
మనసు నిల్పునతడు మహనీయ మూర్తిరా!
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
మనసులో మలినము పెట్టుకుని ఎన్ని యాత్రలు చేసినా ముక్తి రాదు. నిశ్చలమైన మనసు కలవాడే ఉత్తమోత్తముడు. కాబట్టి మనలోని చెడుని తొలగించి మంచిని పెంచుకోవడానికి ప్రయత్నించాలి.

వేమన శతకం (Vemana Shatakam) - 748

వేమన శతకం (Vemana Shatakam) - 748

జాతి వేఱులేక జన్మక్రమంబున
నెమ్మదిన నభవుని నిలిపెనేని
అఖిల జనులలోన నతడు ఘనుడండయా!
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
పుట్టిన నాటినుంచే జాతి భేదముమరచి సర్వేశరుడను మనసులో నిల్పినవాడే ఉత్తముడు. అతడే ముక్తిని పొందగలడు. కాబట్టి అందరూ కుల మత బేధాలు వదిలి శాంతిగా ఉండి సజ్జనులు కావాలి.

Wednesday, November 6, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 747

వేమన శతకం (Vemana Shatakam) - 747

మునిగి మునిగి మునిగి ముద్దయై ముద్దయై
వనరి వనరి వనరి పక్కి పక్కి
తిరిగి తిరిగి తిరిగి దిమ్మరైపోదురు
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
తత్వము తెలియని మూర్ఖులు పుణ్యతీర్ధాలలో మునిగినా, కాకులవలే దేవాలయాలన్ని తిరిగినా, కడుపు కాల్చుకుని ఉపవాసాలు చేసినా ముక్తి లభించదు.

వేమన శతకం (Vemana Shatakam) - 746

వేమన శతకం (Vemana Shatakam) - 746

బల్లిపలుకులు విని ప్రజలెల్ల తమ పనుల్
సఫలములగు ననుచు సంతసించి,
కానిపనులకు దమ కర్మ మటందురు
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
మూర్ఖులు ప్రయత్నమేమి లేకుండా బల్లి పలుకులు వినగానే తమ కార్యము సఫలమవుతుందని సంతోషిస్తారు. ఒకవేళ అవకపోతే తమ కర్మమని వాపోతారు. పనులు ప్రయత్నముతో అవుతాయని ఈ మూర్ఖులకి ఎంత చెప్పినా అర్దం కాదు. శకునాలు విడిచి కష్టపడుట మేలు.

వేమన శతకం (Vemana Shatakam) - 745

వేమన శతకం (Vemana Shatakam) - 745

వేలకొలది భువిని వేషముల్ దాల్తురు
ప్రాలుమాలి బువ్వఫలముకొఱకు
మేలుకాదు; మదిని మిన్నందియుండుము
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
ఈ లోకములో కూటి కొరకు, కోటి వేషాలు వేస్తారు జనులు.ఇటువంటివన్ని తృప్తిలేని జీవితాలు. ఎన్ని పనులుచేసినా వీరికి తృప్తి ఉండదు. అది మన మనసులో ఉంటుందని తేలుసుకోలేరు, మూర్ఖులు.

వేమన శతకం (Vemana Shatakam) - 744

వేమన శతకం (Vemana Shatakam) - 744

ధైర్యయుతున కితర ధనమైన నరు
దాన మిచ్చినపుడె తనకు దక్కె
ఎలమి మించుపనికి నెవరేమి సేతురు?
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
ధైర్యవంతుడు ఎటువంటి కార్యముచేసినా సఫలమవుతుంది. దాని ఫలములు ఖచ్చితంగా దక్కుతాయి. పైగా అది తన వద్ద ఉంచుకోక ఇతరులకు దానిమిస్తాడు. ఇటువంటి వాడు ఉత్తములలోకెల్ల ఉత్తముడు. ఈ లోకములో దెన్నైనా ధైర్యముతో సాధించవచ్చు, కాబట్టి పిరికితనము కట్టిపెట్టి ధైర్యముతో పని మొదలుపెట్టాలి.

వేమన శతకం (Vemana Shatakam) - 743

వేమన శతకం (Vemana Shatakam) - 743

దేవుడనగ వేఱుదేశమందున్నాడే?
దేవుడనగ దనదు దేహముపయి
వాహనంబునెక్కి వడిగదులును చూడు
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
దేవుడనేవాడు ఇంకో దేశంలోనో ఇంకో లోకంలోనో ఉన్నాడా ఏమిటి. దైవము మన శరీరంలోని అణువణులో ఇమిడి ఉన్నాడు. ఈ సత్యాన్ని తెలుసుకోలేక మూర్ఖులు వాహనమెక్కి దేవాలయాల్లో దైవ వేటకు బయలుదేరుతారు.

వేమన శతకం (Vemana Shatakam) - 742

వేమన శతకం (Vemana Shatakam) - 742

ప్రజలెఱుంగ బ్రతుకు బట్టభద్రుడు కాడు
పై గిరీటముండు బ్రభుడుకాడు
ఓగు దెలిసి పలుకు యోగీశ్వరుడుకాడు
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
ధైర్యవంతుడు పట్టభద్రుడుకాకున్నను ప్రజలు గుర్తిస్తారు, రాజు కాకున్నను గౌరవిస్తారు అలాగే యోగి కాకున్నను మంచి చెడ్డలు ఎరిగి జాగ్రత్తగా మాట్లడుతారు. కాబట్టి సమాజంలో మన్నన పొందడానికి ధైర్యం కలిగి ఉండాలి. చెడ్డని ఎదిరించగలగాలి.

వేమన శతకం (Vemana Shatakam) - 741

వేమన శతకం (Vemana Shatakam) - 741

రక్తిలేని పనులు రమ్యమై యుండునా?
రక్తికలిగెనేని రాజు మెచ్చు
రాజు మెచ్చు రక్తి రమణులు మెత్తురు
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
మనకు ఇష్టము లేని పనులు చేస్తే మన దగ్గరి వారి మెప్పు కూడ పొందలేము. అదే ఏ పనైనా మనసుపెట్టి ఇష్టముతో చేస్తే రాజు కూడ మెచ్చుకుంటాడు. రాజేంటి, అందమైన యువతుల మెప్పుకూడ అవలీలగా పొందవచ్చు. కాబట్టి చేసే ప్రతి పని ఇష్టపడి శ్రద్దగా చేయాలి.

వేమన శతకం (Vemana Shatakam) - 740

వేమన శతకం (Vemana Shatakam) - 740

సకల విద్యలందు సంపన్నులైయున్న
నట్టివారు పరిచయమున జౌక
పెరటిచెట్టు మందు పరికింప మెచ్చరు
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
పెరటిలో ఉన్న చెట్టు ఎలగైతే మందుగా పనికిరాదో, అలాగే బాగా పాండిత్యమున్న వారు మనకు దగ్గరివారైతే, వారి యందు వారి పాండిత్యమందు మనకు చులకన భావము కలుగుతుంది.

వేమన శతకం (Vemana Shatakam) - 739

వేమన శతకం (Vemana Shatakam) - 739

చిలుకనోరుగట్టి చిత్తజుమెడగటి
కచ్చడంబు బిగియగట్టికొన్న
మనసు వశముగాదె? మహినేమి పాపమో?
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
తీయగా పలికే నోటిని నొక్కి, మన్మథుని నిగ్రహించడానికి గోచి బిగించి కట్టినా మనసు మన మాట వినదు. ఇదెక్కడి కర్మరా నాయనా?

వేమన శతకం (Vemana Shatakam) - 738

వేమన శతకం (Vemana Shatakam) - 738

ఘటము నింద్రియముల గట్టివేయగలేక
చావు వచ్చునపుడు సన్న్యసించు
నాత్మశుద్దిలేక యందునా మోక్షంబు?
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
వయస్సులో ఉన్నప్పుడు ఇంద్రియ నిగ్రహములేక, ముక్తి కొరకు మరణకాలమాసన్నమవగానే సన్న్యాసము తీసుకొందురు. అంత మాత్రముచేత ముక్తి కలుగదు. అత్మశుద్ది ఇంద్రియ నిగ్రహము ఉన్నప్పుడే ముక్తి కలుగుతుంది.

Tuesday, November 5, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 737

వేమన శతకం (Vemana Shatakam) - 737

దగ్గఱకుము పాపదాంభికులము నీవు
మోసపుత్తురయ్య దోసమనక
క్రూరమృగములట్టివారురా నమ్మకు
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
తీయని మాటలు చెప్పే దాంభికులు మహ మోసగాళ్ళు. వారి దగ్గరకు పొరపాటున కూడ చేరకూడదు. క్రూర జంతువులులాంటి వారు, ఇతరులను మోసపుచ్చడం పాపమని అనుకోక తెలికగా మోసపుచ్చుతారు.

వేమన శతకం (Vemana Shatakam) - 736

వేమన శతకం (Vemana Shatakam) - 736

చదువు చదవనేల? సన్యాసి కానేల?
షణ్మతముల జిక్కి చావనేల?
అతని భజనచేసి యాత్మలో దెలియుండీ
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
సన్యాసి అయ్యి వేదాంతాలన్ని చదివి ఆరు మతాలలో చిక్కి చావడం కన్నా, అత్మతత్వాన్ని తెలుసుకోని నిర్గుణస్వరూపుడైన భగవంతుని సేవించడం ఉత్తమం.

వేమన శతకం (Vemana Shatakam) - 735

వేమన శతకం (Vemana Shatakam) - 735

కొండ రాళ్ళు తెచ్చి కోరిక గట్టిన
గుళ్ళలోన త్రిగి కుల్లనేల
పాయరాని శివుడు ప్రాణియై యుండంగ
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
కొండలు పగులగొట్టి తెచ్చిన రాళ్ళతో గుళ్ళు కట్టి ఆ గుళ్ళకు యాత్రలుగా పోయి ఆ రాళ్ళ మద్యనే శివుడున్నాడనుకోవడం అఙానం. ప్రాణంతో ఉన్న మనుష్యుల్లో ఉన్న దేవునికోసం ప్రాణంలేని రాళ్ళలో వెతకడం శుద్ద దండగ. మానవుడే దేవుడు.

వేమన శతకం (Vemana Shatakam) - 734

వేమన శతకం (Vemana Shatakam) - 734

రాతి బసవని గని రంగుగా మొక్కుచూ
గనుక బసవనిగని గుద్దుచుండ్రు
బసవ భక్తులెల్ల పాపులూ తలపోయ
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:- జీవం లేని నందిని మొక్కి జీవమున్న ఎద్దును భాదలు పెడుతూ ఉంటారు మూర్ఖులు. ఇలాంటి మూర్ఖులను మించిన పాపులు ప్రపంచంలో ఉండరు.

వేమన శతకం (Vemana Shatakam) - 733

వేమన శతకం (Vemana Shatakam) - 733

టిప్పణములు చేసి చప్పని మాటలు
చెప్పుచుందురన్ని స్మృతులు శ్రుతులు
విప్పి చెప్పరేల వేదాంతసారంబు?
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
తమ పాండిత్యాన్ని తెలియచెప్పడానికి మూర్ఖులు వేదాలని, ధర్మ శాస్త్రాలని, వ్యాఖ్యలని వివరిస్తారు కాని వీటి యోక్క సారాంశాన్ని ఒక్క ముక్కలో మాత్రం చెప్పలేరు. వీరి గొప్పతనమంత పదాల గారడీ తప్ప పాండిత్యం శూన్యం.

వేమన శతకం (Vemana Shatakam) - 732

వేమన శతకం (Vemana Shatakam) - 732

తనువులస్థిరమని ధనము లస్థిరమని
తెలుపగలడు తాను తెలియలేడు
చెప్పవచ్చు బనులు చేయుట కష్టమౌ
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
శరీరము, ధనము అశాశ్వతాలని దాంభికుడు ఇతరులకు నీతులు చెపుతూ ఉంటాడు, కాని తాను మాత్రము ఆచరించడు. ఇటువంటి నీతులు చెప్పడం తెలికే గాని చేయడం మహా కష్టం.

వేమన శతకం (Vemana Shatakam) - 731

వేమన శతకం (Vemana Shatakam) - 731

పరమయోగులమని పరము చేరగలేని
మాయజనులకెట్లు మంచి కలుగు?
వేషములను విడిచి విహరిమప ముక్తియౌ
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
యోగిలాగ వేషలు కట్టి కొన్ని బోధనలు చేసినంత మాత్రాన దాంభికులు ముక్తి పొందలేరు. కాబట్టి ఇలాంటి వేషాలు విడిచి సక్రమంగా నడవాలి. మంచి నడవడికె ముక్తికి మూల మార్గం.