Friday, August 2, 2019

భాస్కర శతకం (Bhaskara Shatakam) - 8

భాస్కర శతకం (Bhaskara Shatakam) - 8

తెలియని కార్యమెల్ల గడతేర్చుటకొక్క వివేకి జేకొనన్
వలయునట్లైన దిద్దుకొనవచ్చు బ్రయోజన మాంద్యమేమియుం
గలుగదు ఫాలమందు దిలకంబిడునప్పుడు చేతనద్దమున్
గలిగిన జక్క జేసికొను గాదె నరుండది చూచి భాస్కరా!


ప్రతిపదార్థం:-
తెలియని అంటే తనకు తెలియనటువంటి; కార్యము + ఎల్లన్ అంటే ఏ పనినయినా; కడతేర్చుటకు అంటే చేయటానికి; ఒక్క వివేకిన్ అంటే ఒక జ్ఞానసంపన్నుడి; చేకొనన్ వలయున్ అంటే సలహా తీసుకోవాలి; అట్లు + ఐనన్ అంటే అలా చేయటం వలన; దిద్దుకొనవచ్చున్ అంటే తప్పులను సరిదిద్దుకోవచ్చును; ప్రయోజన మాంద్యము అంటే పని చేయటంలో ఆలస్యం; ఏమియున్ అంటే ఏమాత్రం; కలుగదు అంటే ఉండదు; ఎట్లనన్ అంటే ఎలాగంటే; నరుండు అంటే మనిషి; ఫాలమందును అంటే నుదుటియందు; తిలకంబు అంటే బొట్టును; ఇడునప్పుడు అంటే పెట్టుకొనేటప్పుడు, చేతను అంటే చేతిలో; అద్దమును అంటే అద్దాన్ని; కలిగినన్ అంటే కలిగి ఉన్నట్లయితే; అది చూచి అంటే ఆ అద్దంలో చూసుకొని, చక్క చేసుకొనును కాదె అంటే చక్కగా పెట్టుకుంటాడు కదా!

భావం:-
మనుష్యులు నుదుటి మీద తిలకం పెట్టుకునేటప్పుడు చేతిలో అద్దం ఉంటే అందులో చూసుకుంటూ చక్కగా, పద్ధతిగా పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఏదైనా తనకు తెలియని పనిని చేయవలసివచ్చినప్పుడు... ఆ పనిలో నేర్పరితనం ఉన్నవారి సహాయం తీసుకుంటే... ఆ పనిని తప్పులు లేకుండా ఆలస్యం కాకుండా పూర్తిచేసుకోవచ్చును.

ఏదైనా విషయం తెలియకపోవటంలో దోషం లేదు. కాని తెలియకపోయిన దానిని గురించి ఇతరులను అడిగి తెలుసుకోకపోవటమే తప్పు. చేతిలో అద్దం ఉంటే తిలకం దిద్దుకోవటం ఎంత సులభమో, అదే విధంగా తెలియని విషయాలను అడిగి తెలుసుకోవాలని కవి ఈ పద్యంలో వివరించాడు.

No comments:

Post a Comment