Sunday, August 11, 2019

భాస్కర శతకం (Bhaskara Shatakam) - 11

భాస్కర శతకం (Bhaskara Shatakam) - 11

కట్టడ దప్పి తాము చెడు కార్యము చేయుచునుండిరేని దో
బుట్టిన వారినైన విడిపోవుట కార్యము; దౌర్మదాంధ్యమున్
దొట్టిన రావణాసురునితో నెడబాసి విభీషణాఖ్యుడా
పట్టున రాము జేరి చిరపట్టము గట్టుకొనండె భాస్కరా!

భావం:-
చెడుపనులు, చేయకూడని పనులు చేసేవాడు స్వయంగా సోదరుడే అయినప్పటికీ... వానిని విడిచిపెట్టటం మంచిది. అలా చేయటం వలన తనకు మంచి జరుగుతుంది. ఈ పద్ధతిని అనుసరించే రావణుని సోదరుడయిన విభీషణుడు తన అన్నను విడిచి శ్రీరాముని చేరి, శాశ్వతమైన లంకానగర ఆధిపత్యాన్ని పొందాడు.


కట్టడదప్పి అంటే దారి తప్పి లేదా అదుపు తప్పి; తాము అంటే ఎవరికి వారు; చెడుకార్యమున్ అంటే తప్పుడు పనులను; చేయుచున్ + ఉండిరి + ఏని అంటే చేస్తున్నట్లయితే; తోబుట్టిన వారినైన అంటే ఒక తల్లికి పుట్టినవారైనప్పటికీ; విడిచిపోవుట అంటే వదిలి వెళ్లిపోవటం; కార్యము అంటే మంచిది; దౌర్మద + అంధ్యమున్ అంటే చెడుపనులతో మదము; దొట్టిన అంటే కలిగిన; రావణాసురునితో అంటు రాక్షసరాజయిన రావణునితో; ఎడబాసి అంటే విభేదించి; విభీషణ + ఆఖ్యుడు అంటే విభీషణుడు అనే పేరు కలిగిన రావణుని సోదరుడైన విభీషణుడు, ఆ పట్టునన్ అంటే ఆ సమయంలో; రాముని చేరి అంటే శ్రీరామచంద్రునితో స్నేహం చేసి; చిరపట్టము అంటే శాశ్వతమైన లంకాధిపత్యాన్ని; కట్టుకొనడె అంటే పొందలేదా!
అరచేతిలోని ఐదు వేళ్లలో ఒక వేలు పాడైతే ఆ వేలిని తొలగించేయాలి. లేకపోతే చెయ్యి తీసేయవలసి వస్తుంది. అలాగే ఒక వంశ ంలో ఒకరు దుర్మార్గుడైతే వారిని త్యజించాలని శాస్త్రం చెబుతోంది. అలా చేయకపోతే ఆ వంశానికే కళంకం ఏర్పడుతుంది. అందుకే చెడుని విడిచిపెట్టకపోవటం వల్ల కష్టాలు కలుగుతాయే కాని, ఏ మాత్రం మేలు జరగదని కవి ఈ పద్యంలో వివరించాడు.

No comments:

Post a Comment