Tuesday, August 27, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 81

వేమన శతకం (Vemana Shatakam) - 81

కూళ కూళ మెచ్చు గుణవంతు విడనాడి
ఎట్టివారు మెత్తు రట్టివాని
మ్రాను దూలములకు జ్ఞానంబు తెలుపునా
విశ్వదాభిరామ వినురవేమ


తాత్పర్యము :-
ఒక చెడ్డవాడూ మంచివాడూ ఉన్నారనుకోండి. వారిద్దరిలో ఒకరిని ఎంచుకొమ్మంటే, చెడ్డవాడు చెడ్డవాణ్నే ఎంచుకుంటాడు. మంచివాణ్ని వదిలేస్తాడు. అంటే ఎటువంటి వారైనా తమలాంటి వారినే ఇష్టపడతారు. పైగా మెచ్చుకుంటారు. ఇదెట్లా ఉంటుందంటే చెట్టు తనలోని భాగమైన దూలానికి తన గుణాన్నే ఇస్తుంది గాని, అదనంగా జ్ఞానాన్ని ప్రసాదించలేదు కదా! అంటున్నాడు వేమన.

‘స్వభావో దురతిక్రమః’ అంటారు. అంటే ఎవరూ తమ సహజ గుణానికి విరుద్ధంగా ప్రవర్తించరు అని. కూళ అంటే నీచుడు, మూఢుడు, అవివేకి, దుర్జనుడు అని అర్థాలు. ఇది దేశీయ పదం. కన్నడంలో కూడ కూళ, తమిళంలో కూళై. వేమన్నే మరోచోట..
.
తలకు నెరలు వచ్చి తనువెంత వడలిన
కూళ విటుడు యువతి కూడుటెల్ల
పండ్లు వడ్డ కుక్క పసరము చీకదా! అన్నాడు.

దూలం అంటే ఇల్లు కట్టేటప్పుడు ఇంటి గోడలపై అడ్డంగా వేసే కట్టె. లేదా ఇంటికి కప్పు వేసేటప్పుడు వాసాలకు ఆధారంగా వేసే దొడ్డుకట్టెను దూలమంటారు. చెట్టుకు గానీ, దూలానికి గానీ కట్టెతనం సమానం. అంతవరకే పోలికను తీసుకుంటే ఈ దృష్టాంతం కుదురుతుంది.
నువ్వు సజ్జనుడివై ఎదుటి సజ్జనుణ్ని ఆదరించటం మంచిది అని వేమన్న సారాంశం.
‘పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చునా అనేది పాఠాంతరం.

No comments:

Post a Comment