వేమన శతకం (Vemana Shatakam) - 75
అన్ని జాడలుడిగి ఆనందకాముడై
నిన్ను నమ్మజాలు నిష్టతోడ
నిన్ను నమ్మ ముక్తి నిక్కంబు నీయాన!
విశ్వదాభిరామ వినురవేమ
తాత్పర్యం:-
అన్ని మార్గాలనూ నశింపజేసుకొని కేవలం ఆనందాన్ని మాత్రమే కాంక్షిస్తాడు. అప్పుడే ధర్మాచరణంలో నీ మీద భారం వేసే స్థితికి చేరుకుంటాడు. నిజంగా చెప్తున్నాను నిన్ను పూర్తిగా విశ్వసించినప్పుడే ముక్తి నిశ్చయంగా లభిస్తుంది అని ప్రబోధిస్తున్నాడు వేమన.
అన్ని జాడలు అంటే మార్గాలు, అంటే అనేక సంప్రదాయాలు, షణ్మతాలు కావొచ్చు. ఇంకా చిన్నాచితకా పలు పంథాలు కావొచ్చు. వీటన్నింటితో తల బద్దలు కొట్టుకోకుండా ఆనంద మార్గంలో వెళ్లమంటున్నాడు వేమన. ఇంతకూ ఆనందమంటే ఏమిటి? అతిశయ సుఖ స్వరూపమైన ప్రేమకు నెలవైంది ఆనందం అని పెద్దలు చెప్తున్నారు. ఇంగ్లిషులో దీనిని bliss అంటారు.
బ్లిస్ అంటే పరమ సుఖం, బ్రహ్మానందమని అర్థాలు. ఆనందానికి అనేక సూక్ష్మ భేదాలున్నాయి. వాటిలో బ్రహ్మానందం, విషయానందాలు ప్రస్తుతానికి తెలుసుకోదగ్గవి. బ్రహ్మానందమంటే సుషుప్తియందు అనుభవించబడే ఆనందం. దీనికి స్వయం ప్రకాశం ఉంటుంది. విషయానందాలు అంటే ఇవి అంతఃకరణ వృత్తి విశేషాలు. అంటే ఇష్ట ప్రాప్తి వల్ల అంతర్ముఖమైన మనస్సులో ప్రతిఫలించేవి విషయానందాలు.
ఆనందకాముడు అంటే ఆనందాన్ని కోరుకునేవాడు. ఇక్కడ ఆనందమంటే పరబ్రహ్మమే.
నిష్ఠ అంటే నియమ పాలన. బ్రహ్మమును తప్ప ఇతరాలను ఉపాసించరాదనే నియమం. జాడ అంటే దారి, రీతి, విధం, వైపు, గతి, వృత్తాంతం అని అర్థాలు. ఇక్కడ మార్గం. నిక్కం అంటే నిజం, నిశ్చయం, వాస్తవం, శాశ్వతత్వం అని అర్థాలు.
ఆన అంటే ఒట్టు, తోడు, ఆజ్ఞ, ప్రమాణం అని అర్థాలు. ‘నీ యాన’ అనేది చక్కని తెలుగు నుడికారం. బహుశా ‘అనుట’ నుంచి వచ్చి ఉంటుంది. నిక్కచ్చితనానికి వాడుతారు. ‘నీయాన’ అంటే నీ మీద ఒట్టు అని. ‘నా యాన’ అంటే నాపై ఒట్టు అని. ఇంగ్లిషులో ’upon my word upon my honor' అంటారు. తెలుగులో 'నా ధర్మంగా' అనేది ఇట్లాంటిదే.
అన్ని ధర్మాలను వదిలేసి నన్ను శరణుజొచ్చాలనే గీతావాక్యం ఇట్లాంటిదే. ఉడుగు అంటే నశించు అని. ‘రోగాపమృత్యు వార్తాగంధ మెడలెను జారచోరాదుల పేరు నుడిగె’ అని ప్రయోగం.

No comments:
Post a Comment