Monday, August 26, 2019

సుమతీ శతకం (Sumathi Shathakam) - 28

సుమతీ శతకం (Sumathi Shathakam) - 28

అక్కఱకు రాని చుట్టము
మ్రొక్కిన వరమీని వేల్పు మోహరమున దా
నెక్కిన బాఱని గుర్రము
గ్రక్కున విడువంగవలయు గదరా సుమతీ!


భావం:-
అందరికీ ఎప్పుడో ఒకప్పుడు ఏవో ఇబ్బందులు, కష్టాలు వస్తాయి. అటువంటి సమయంలో బంధువులు వారికి చేతనైన సహాయం చేయాలి. అలా చేయనివారు బంధువులు కారు. అటువంటివారిని దూరంగా ఉంచాలి... అని చెబుతూ ఎటువంటివాటిని దూరంగా ఉంచాలో మరికొన్ని ఉదాహరణలు ఈ పద్యంలో ఉన్నాయి.

 ఓబుద్ధిమంతుడా! కష్టాలలో ఉన్నప్పుడు సహాయపడని బంధువును తొందరగా దూరం చేసుకోవాలి. అలాగే ఆపదలు కలిగినప్పుడు, మొక్కుకున్నప్పటికీ దేవతలు కరుణించపోతే, ఆ దేవతను పూజించటం వెంటనే మానేయాలి. అలాగే యుద్ధాలలో ఉపయోగించటం కోసమని రాజుల వంటివారు గుర్రాలను పెంచుకుంటారు. యుద్ధరంగంలో శత్రువు మీదకు దాడికి వెళ్లడంకోసం ఆ గుర్రాన్ని ఎక్కినప్పుడు అది పరుగెత్తకపోతే దానిని కూడా వెంటనే వదిలివెయ్యాలి.

‘అక్కరకు రావటం’ అంటే అవసరానికి ఉపయోగపడడం, వేల్పు అంటే దేవుడు, గ్రక్కున అంటే వెంటనే అని అర్థం. ఇందులో గ్రక్కున అనే పదం అన్నిటికీ సంబంధించినది. అవసరానికి ఉపయోగపడని బంధువును, దేవతను, గుర్రాన్ని... ఈ మూడిటినీ వెంటనే విడిచిపెట్టాలి అని సుమతీ శ తకం రచించిన బద్దెన వివరించాడు.

No comments:

Post a Comment