Monday, August 26, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 74

వేమన శతకం (Vemana Shatakam) - 74

మనసులోన నున్న మమతలన్నియు గోసి
దృఢము చేసి మనసు తేటపరచి
ఘటము నిల్పు వాడు ఘనతర యోగిరా
విశ్వదాభిరామ వినురవేమ


తాత్పర్యం:-
మనసులోని అహంకారాన్ని తొలగించుకోవాలి. మనసును స్థిరపరచుకోవాలి, శుభ్రపరుచుకోవాలి. అట్లా మనసును ఉంచుకొని దేహాన్ని అదుపు చేసుకోగలిగినవాడే నిజమైన యోగి అవుతాడు అంటున్నాడు వేమన.

మనసు అంటే చిత్తం, హృదయం అని అర్థాలున్నా తాత్వికంగా చెప్పాలంటే ఇది జీవాత్మ కంటే భిన్నమైన జ్ఞాన జనక ద్రవ్యం. దీనికి మనన ధర్మం ఉంటుంది. దీనికో రూపం ఉండదు కాబట్టి ఇంద్రియాల ద్వారానే వ్యక్తమౌతుంది. లోకంలో ప్రేమికులు మనసును పారేసుకున్నామంటారు. ఇది కవితాత్మకంగా చెప్పడం. నిజానికి పారేసుకునేది తలపులనే కాని మనసుని కాదు.

మమత అంటే నాది అనే అభిమానం. దీనిని నిర్దాక్షిణ్యంగా తీసేసుకోవాలి. కోసి అనే మాట వాడాడు వేమన. దృఢం చేసి అంటే పటిష్ఠ పరచుకొని. తేట అంటే స్వచ్ఛత, నిర్మలత్వం. తేట అంటే ఒక పదార్థంలోని సారం. ద్రవ పదార్థాలపైన తేరే భాగాన్ని తేట అంటారు. అట్లా పరిశుభ్రమైన మనస్సుతో శరీరాన్ని నిర్వహించుకోవాలి. ఇక ఘటం. ఘటం అంటే కుండ. ఇది దేహానికి సంకేతం. ఘటం అనేది శరీరానికి వేదాంత పరిభాష. ఘటం అంటే కుంభకం అనే ఒక ప్రాణాయామ భేదం కూడ.

ఘనం అంటే దృఢత్వం, దిటవు అని అర్థాలు. గట్టిదైన అని. తోడుకొన్న పెరుగులో పైదీ కిందదీ కాక నడిమి గట్టి భాగాన్ని ఘనం అంటారు. ఘనతరం అంటే మరింత గట్టిదని. యోగ సాధనకు ముందుగా కావల్సినవి నిర్మమమత్వం, మానసిక నిర్మలత్వం. ఇవి పూజకు ముందు ఇల్లు అలకటం లాంటివి. ‘మనసులోన నున్న మర్మమెల్ల దెలసి, దిట్టపరచి మనసు తేటజేసి అనేవి పాఠాంతరాలు.

No comments:

Post a Comment