Monday, August 26, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 73

వేమన శతకం (Vemana Shatakam) - 73

తావసించు చోట తగనల్జడాయెనా
సౌఖ్యము గల భూమి జరుగవలయు
కొలకులింకెనేని కొంగలందుండునా?
విశ్వదాభిరామ వినురవేమ


తాత్పర్యం:-
మడుగుల్లో నీళ్లు ఇంకిపోయి ఆహారం దొరక్కపోతే కొంగలు ఏం చేస్తాయి? నీళ్లున్న మరోచోటికి వలస పోతాయి. అట్లాగే ఎవరైనా తాను ఉన్న ఊరిలో ఆపదలు, బాధలు ఎదురైతే ప్రశాంతత గల మరో ఊరికి తరలిపోవడం మంచిది అని సూచిస్తున్నాడు వేమన.

వేమన పద్యాలు కేవలం వైయక్తిక అనుభవాలు కాదు. అవి చాలా వరకు నాటి పరిస్థితులను ప్రతిబింబించాయి. విజయ నగర సామ్రాజ్యం చాలాకాలం కొన ఊపిరితోనే కొట్టుమిట్టాడింది. పాలెగాండ్లు కేంద్రాధికారాన్ని సాగనివ్వలేదు. పాలెగాళ్ల మూకుమ్మడి దాడులతో గ్రామాలు తల్లడిల్లాయి. శాంతి కరువైన పల్లెల నుండి వలసలు మొదలైనాయి. బహుశా అట్లాంటి సందర్భాన్ని ఈ పద్యం ప్రతిబింబిస్తున్నదనుకోవాలి.

రాజకీయంగా గాని, సాంఘికంగా గాని, ఆర్థికంగా గాని శాంతి లేకపోతే ఎక్కడైనా జీవనోపాధి కరువౌతుంది. భద్రతకు ముప్పు ఏర్పడుతుంది. అటువంటప్పుడు మరోచోటికి వలస పోవాల్సిన అగత్యం ఏర్పడుతుంది.

తా అంటే తాను, వ్యక్తి, వసించు చోటు అంటే నివసించే ఊరు. అలజడి (అల్జడి) అంటే అశాంతి, ఆపద, బాధ అని అర్థాలు. ఇది దేశీయ పదం. కన్నడంలో అలసికె అంటారు. అంటే అలసట. తమిళంలో అలచటి, అలైచటి అంటే విసుగు. మలయాళంలో అలసల్, అలశల్ అంటే కలత. ఇంచుమించు అర్థమొక్కటే, ఇవన్నీ ఛాయాభేదాలు.

‘నృపతికి లేవలజళ్లు భయలోక లీలల యందున్’ అని ప్రయోగం. సౌఖ్యం అంటే వెసులుబాటు, హాయి. ఈ ఇంట్లో నాకు సౌఖ్యంగా లేదు అంటే సౌకర్యంగా లేదని. భూమి అంటే ఇక్కడ మరోచోట. ‘జరుగవలయు’ అంటే వెళ్లిపోవాలని. చోటు మార్పు అన్నమాట. ఇది నుడికారం. ‘అతడు జరిగిపోయినాడు’ అంటే చనిపోయాడని. ‘ఇక్కడ జరుగుబాటు లేదు’ అంటే గడవటం లేదని.

కొలకు అంటే అడవిలో ఉండే నీటి మడుగు. కొలను. కొలకులు అనేది కొలనుకు బహువచనం. జనవరి, ఫిబ్రవరి నెలల్లో రష్యాలోని సైబీరియా నుండి మన కొల్లేరుకు కొంగలు వలస వస్తాయి. కొల్లేటి కొంగలని పేరు వీటికి. ఆ సమయంలో ఇక్కడి చిన్న చేపలు, తుంగ గడ్డి, రెల్లుగడ్డి చిగుళ్లు వాటికి ఆహారం. సైబీరియాలో వాటికి ఈ సమయం ప్రతికూలం కావొచ్చు. వేలాది మైళ్లు ఎగుర్తూ రావడం విశేషం.

ఒక్కసారి అవి వచ్చేటప్పుడు అది రమణీయ దృశ్యమని అకారంలో తెల్లటి మేఘాలు కమ్మినట్లుందని అక్కడివారు చెప్తారు. అయితే అప్పటివరకు కొల్లేటి పరిసరాల్లో ఉండే పిట్టలు వీటి ధాటికి పారి పోతాయంటారు. ఈనాటి మన కలుషిత పరాక్రమానికి కొంగలు కూడా ముఖం చాటేస్తున్నాయంటున్నారు.మొదటి పాదంలోని ‘తగ’ తరచుగా పాద పూరణమే. సరిపోయినట్లుగా అని అర్థం. తగుట నుంచి వచ్చిందే తగ.

No comments:

Post a Comment