Monday, August 26, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 72

వేమన శతకం (Vemana Shatakam) - 72

కడగి వట్టి యాస కడతేరనివ్వదు
యిడుములందు బెట్టి యీడ్చుగాని
పుడమి జనుల భక్తి పొడమంగనియ్యదు
విశ్వదాభిరామ వినురవేమ


భావం:
అతిశయించిన ఆశ వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. పైగా అది నువ్వనుకున్న దానిని నెరవేరనివ్వదు. అంతేకాదు నిన్ను కష్టాలపాలు చేస్తుంది. అట్లా కష్టాల్లో ఉన్నప్పుడు నిన్ను అటు లాగి ఇటు లాగి ఎటూ కాకుండా చేస్తుంది. కాబట్టి దీనివల్ల గ్రహించవలసిందేమిటంటే ఆశ అనేది నిన్నే కాదు లోకంలోని జనుల్లో కూడా భక్తి పుట్టడానికి ఆటంకంగా పరిణమిస్తుంది అంటున్నాడు వేమన.
బాహ్య సుఖాల కోసం అతిగా ఆశపడకు. కర్మబద్ధుడివౌతావ్, దుఃఖాల పాలవుతావ్, జన్మల్లో చిక్కుకుపోతావ్. ఆశ నిన్ను భక్తి వైపు పోనివ్వదు. భక్తి మార్గం లేకపోతే నీకు ముక్తి గమ్యం అందదు అని సారాంశం.

కడగి అంటే ఉద్యమించడం. ఇక్కడ ఇది పాదపూరణ శబ్దం కాదు. వట్టి అంటే ఉత్త అని అర్థం. దీనికి అనేక ఛాయలు. వట్టి ఆవు అంటే పాలింకిన ఆవు అని, వట్టివాడు అంటే పనికిరానివాడని, వట్టి కాళ్లు అంటే చెప్పులు లేకుండా అని. వట్టిగాలి అంటే వాన పడని గాలి అని, ఇంకెన్నో! ఆశ అంటే కోరిక. కడ అంటే దరి, ఒడ్డు. కడతేరు అంటే సిద్ధించు. ఇడుము అంటే క్లేశం, ఆయాసం.

పుడమి అంటే భూమి, పృథివి, భూలోకమన్నమాట. పొడముట అంటే జనించడం, ఉదయించడం. ‘విభీ/షణుడున్ గైకసి గర్భవార్ధి బొడమెన్ సంపూర్ణ చంద్రాకృతిన్’ అనేది ప్రయోగం.
ఒక్క ఆశ తప్ప కడగి, కడ, ఇడుము, పుడమి, పొడము వంటివన్నీ దేశీయ పదాలే కావడం గమనార్హం.

No comments:

Post a Comment