Monday, August 26, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 71

వేమన శతకం (Vemana Shatakam) - 71

దానములను సేయ ధరచేతులాడక
బహు ధనంబు గూర్చి పాతిపెట్టి
తుదను దండుగనిడి మొదలు చెడు నరుడు
విశ్వదాభిరామ వినురవేమ


భావం:-
ఈ మనిషి ఉన్నాడే అపార ధన రాసులను సంపాదిస్తాడు. కాని చిత్రమేమిటంటే దాన ధర్మాల రూపంలో ఒక్క పైసా అయినా విదల్చడు. పైగా వాటిని భూమిలో పాతి పెడతాడు. ఇది ఎవరి కోసం? దీని గురించి వేమన్న ఏమంటున్నాడంటే ఇతడు దానాలు చెయ్యక అపరాధం చేశాడు. అపరాధికి ద్రవ్య శిక్ష తప్పదు. అతని మరణానంతరం అది అధికారుల పాలో, రాజుల పాలో అవుతుంది. అది అతడు చెల్లించిన దండుగ. అంతేకాదు పుణ్యం మిగలని అతని జీవితం నిర్మూలమైపోయింది. కాబట్టి సంపాదించిన దానిలో కొంతైనా నలుగురి సాయానికి వెచ్చించడం మంచిది అని వేమన్న సందేశం.

చేతులాడక అంటే మనసొప్పక అని. ఇది మంచి నుడికారం. దండుగ అంటే వృథా. కాని ఇక్కడ జరిమానా. నేరం చేసిన వారికి చెల్లించాలని విధించే సొమ్ము. అపరాధి నుండి అపరాధ పరిహారంగా అధికారి తీసుకునే దండుగ గురించి హనుమకొండ శాసనం (క్రీ.శ. 1079)లో ఉంది. ఈ దండుగను రాజులు ధనవంతుల నుంచి బలాత్కారంగా తీసుకునేవారు. ఎవరినైనా బాధిస్తే దండుగ ఈనాం అని కూడా ఇచ్చేవారు. అంటే అనవసరంగా బాధించినందుకు ప్రతిఫలంగా ఇచ్చే భూమి. ‘కలవారిగని దండుగలు వెట్టె నృపుడు’ అని ప్రయోగం.

పాతిపెట్టిన ధనంతో తనకూ సుఖం లేదు. మరణిస్తే గుప్తంగా వ్యర్థంగా భూమిలోనే ఉండిపోతుంది. ఈ రకంగా కూడా ఇది దండుగే.
తుదను అంటే అవసాన వేళ. ‘మొదలు చెడు’ అంటే వేళ్లూ కొమ్మలూ లేని చెట్టులా నామ రూపాలు లేకుండా పోతాడని.

No comments:

Post a Comment