Sunday, August 25, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 67

వేమన శతకం (Vemana Shatakam) - 67

ఆనుకూల్యము గల అంగన కలిగిన
సతికి పతికి పరమ సౌఖ్యమమరు
ప్రాతికూల్యయైన పరిహరింప సుఖంబు
విశ్వదాభిరామ వినురవేమ!


తాత్పర్యం:
ఒద్దిక కలిగిన భార్య ఉన్నట్టయితే ఆమెకూ ఆమె భర్తకూ సుఖ సంతోషాలు సమకూరి ఆ కాపురం ఒడిదుడుకులు లేకుండా నడుస్తుంది. విరుద్ధమైతే మాత్రం ఆ దాంపత్యం నిలువదు. అట్లాంటప్పుడు ఆమెను వదిలెయ్యటం తప్ప గత్యంతరం లేదు అంటున్నాడు వేమన.
ఇది 17వ శతాబ్దంలో చెప్పిన పద్యం. మూడున్నర శతాబ్దాలు గడచిపోయాయి.

భార్యాభర్తలిద్దరికీ అసలే పడకపోతే ఇద్దరూ విడిపోవడం ఇద్దరికీ మంచిది. ఇక్కడ ఇద్దరూ ఒకరినొకరు వదిలేస్తారన్న మాట. కాని ఈ పద్యంలో అతడు ఆమెను వదిలెయ్యాలని ఉంది. అంటే ఇక్కడ పురుషాధిపత్యం ఉంది. ఇది ఒక్క వేమన్న పద్ధతే కాదు వ్యష్టి ప్రత్యేకతకూ సమష్టి ప్రయోజనానికీ సంఘర్షణ ఈనాటిది కాదు. ఒకప్పటి నిరక్షరాస్య స్త్రీకీ, నేటి చదువుకున్న మహిళకూ పరిస్థితిలో మార్పు వచ్చింది.

అప్పటి ఉమ్మడి కుటుంబాలు కూడా నేడు నామమాత్రమయ్యాయి. కాని విడిపోవడం ఆనాడూ ఈనాడూ అంత సులభం కాదు. సంఘ వ్యవస్థలన్నీ దీని చుట్టే తిరుగుతున్నాయి. వేదాంతాలన్నీ దీని గురించే చింతన చేస్తున్నాయి. అలాగే సి.పి.బ్రౌన్ "But if she be disagreeable, the only happiness is in quitting her'’ అనటాన్ని కేవలం పాశ్చాత్య వ్యాఖ్యగా కొట్టిపారెయ్యలేం.

ఆధిపత్యాన్ని కాసేపు పక్కన పెడితే ఇద్దరి మధ్య ఇష్టం బలంగా ఉంటే కష్టం ప్రసక్తి రాకపోవచ్చు. ఇది స్వభావాలకు సంబంధించిన సమస్య కూడా. ఎవరికి ఇష్టమున్నా లేకున్నా భారతీయ సమాజంలో, భారతీయ సమాజంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఇతర సమాజాల్లో కూడా అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి ఇటువంటి వేమన పద్యాలు మంచి చర్చకు దారితీసి మరింత అర్థవంతమైన మానవ సంబంధాలను, ముఖ్యంగా స్త్రీ పురుష సంబంధాలను బేరీజు వేసుకోవడానికి వీలు కల్పించవచ్చు.

ఆనుకూల్యం అంటే అనుకూలమైన భావం. హితమైన, ఆరోగ్యకరమైన ప్రవర్తన. అనుగుణమైన ఆలోచన. ప్రతికూలం కానిది అనుకూలం. మొత్తానికి ఇష్టంగా ఉండేదని. అనుకూలుడు అనేది ఒక నాయక భేదం కూడా. అనుకూలుడు అంటే ఒకే స్త్రీయందు అనురాగం గల నాయకుడు, సహచరుడు, మిత్రుడు అనే అర్థాలు కూడా ఉన్నాయి.

ప్రకృతిలో కూడా సస్యానుకూల వర్షం, స్పర్శానుకూలం అనే అభివ్యక్తులున్నాయి. అనుకూల వాయువులు సరేసరి. ‘‘అనుకూల పవన మోహనమ్ములే ఈ దినమ్ములు?’’ అని రాయప్రోలు వారి తృణ కంకణంలో ఓ ప్రయోగం. ఆనుకూల్యానికి వ్యతిరేకమైంది ప్రాతికూల్యం. సౌఖ్యము+అమరు. అమరు అంటే కుదరటం, ఒప్పడం.

ఆ కాలంలో ఎదురు తిరిగే భార్యను భర్త పరిహరించాలన్నాడు వేమన. మరి ఈనాడు భర్త భార్యను పరిహరిస్తాడా? భార్య భర్తను పరిహరిస్తుందా, లేక ఇద్దరూ ఒకరినొకరు పరిహరిస్తారా అనేది ఇప్పటిదాకా గడచిన వారి జీవితం నిర్ణయిస్తుంది. వారిని కలిపి ఉంచే బలం వారి కాపురానికి లేకపోతే వారిని కలిపి ఉంచే శక్తి ఏ బాహ్య శక్తులకూ ఉండదనేది లోక సత్యం.

No comments:

Post a Comment