Sunday, August 25, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 66

వేమన శతకం (Vemana Shatakam) - 66

ఉత్తమోత్తముండు తత్వజ్ఞుడిల మీద
మహిమ జూపువాడు మధ్యముండు
వేషధారి యుదర పోషకుండధముండు
విశ్వదాభిరామ వినురవేమ


తాత్పర్యం:
తారతమ్యాన్ని బట్టి లోకంలో మూడు రకాల గురువులుంటారు. మొదటివాడు పరమాత్మ సంబంధమైన జ్ఞాని. ఇతడు శిష్యులకు తత్త్వజ్ఞానం బోధిస్తాడు. ఉత్తమ శ్రేణికి చెందిన గురువంటే ఇతడే. రెండోవాడు మధ్య రకం వాడు. ఇతడు జనులను ఆకట్టుకోడానికి మహిమలు చేసి చూపిస్తాడు. ఇక మూడోరకం వాడున్నాడే ఇతడు పొట్ట కూటికోసం గురువు వేషం వేసుకొని ప్రజలను మోసం చేస్తాడు. ఇతనిది అతి తక్కువ స్థాయి. ఇటువంటివారిని నమ్మకూడదంటున్నాడు వేమన.

ఉత్తమోత్తముడు అంటే ఉత్తముల్లో ఉత్తముడు. బహు శ్రేష్ఠుడన్నమాట. ఈయన ఆత్మజ్ఞాని. కోరికలు లేనివాడు. నిర్వికార స్థితికి చేరుకున్నవాడు. సద్గురువు అనే మాట ఇతనికి సరిపోతుంది. తత్త్వజ్ఞుడనే మాట పెద్దది.

మధ్యముడంటే పైవాడి కంటె తక్కువవాడు. ఇతడు జనుల్లో విశ్వాసం కల్పించటానికి మహిమలు చేసి చూపిస్తాడు. యోగ సాధనలో సమకూరే చమత్కారాలు ఇతని సొత్తు. మహిమ అంటే గొప్పతనం. అంతేకాక అణిమ, మహిమ, గరిమ అంటూ అష్ట సిద్ధుల్లోని మహిమ కూడా కావొచ్చు. ఇతనికి కీర్తి ప్రతిష్టలపైన, భోగ భాగ్యాలపైన దృష్టి ఉంటుంది. ఇటువంటివారి వల్ల సమాజానికి నష్టం ఉండకపోవచ్చు గాని తాత్త్విక యోగి కంటే కింది స్థాయి.

ఇక మన మూడోవాడు మహానుభావుడు! పరమ లౌకికుడు. వేషానికే గురువు. బోధించేవన్నీ కల్లలు. ఉదరం అంటే కడుపు. కుక్షింభరుడన్నమాట. ఇటువంటి వారి వల్ల లోకానికి నష్టం ఉంది. కాబట్టి ఓ కంట కనిపెట్టి ఉండాలని వేమన్న హెచ్చరిక.

No comments:

Post a Comment