Sunday, August 25, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 64

వేమన శతకం (Vemana Shatakam) - 64

ఆశచేత మనుజులాయువు గలనాళ్ళు
తిరుగుచుందురు భ్రమ తిప్పుదాక
మురికి భాండమందు ముసురు నీగల భంగి
విశ్వదాభిరామ వినురవేమ


తాత్పర్యం:
మురికి కుండపైన ఈగలు ముసురునట్లుగా మనిషి భౌతిక సుఖాల చుట్టూ జీవితాంతం తిరుగుతూనే ఉంటాడు. ఎన్నాళ్లు తిరుగుతాడు? ఎన్నాళ్లంటే భ్రమ తొలిగేదాక. భ్రమ తొలిగేది లేదు ఆశ చచ్చేది లేదు అని సారాంశం.

బతకడానికి ఆశ అవసరమే కాని ఇది నిరంతర అత్యాశ. అందుకే ఆశాపాశం, ఆశాబంధం అనే మాటలు పుట్టాయి. ఆశలో చిక్కుబడిపోతే అంతే సంగతులు అంటున్నాడు వేమన. ఆశను వదులుకుందామన్నా భ్రమ వదలనివ్వదు.

ఆశ అంటే కోరికే. తెలియని సుఖాలపైన ఆసక్తే ఆశ. భ్రమ అంటే ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టుగా తోపింపజేసేది. ‘ఆయువు గలనాళ్లు’ అంటే బతికి ఉన్నంతవరకు. ఆయువు అంటే వయస్సు, జీవితాన్ని పెంచేదని కూడ. ఆయుష్యం అంటే సుదీర్ఘ జీవితం. భ్రమ పరిభ్రమానికి హేతువు. భ్రమ వల్లనే ఆశకు అంతటి ఆరాటం. ఉన్నదాన్ని స్పష్టంగా చూడగలిగితే తప్ప భ్రమ తొలగదు.

భ్రమను తొలగించుకోవాలనేది సందేశం. మురికి భాండమంటే మురికి కుండ. శుభ్రపరచని వంటపాత్ర కావొచ్చు. వ్యవసాయ కుటుంబాల్లోనైతే కుడితి పాత్ర కావొచ్చు. వాటికి అంటుకొని ఉన్న మురికి పదార్థం కోసం ఈగలు ముసురుకుంటాయి. భాండం అంటే కుండ, మురికి అంటే మాలిన్యం.

No comments:

Post a Comment