Wednesday, August 28, 2019

సుమతీ శతకం (Sumathi Shathakam) - 35

సుమతీ శతకం (Sumathi Shathakam) - 35

ఎప్పటికెయ్యది ప్రస్తుత
మప్పటికా మాటలాడి యన్యుల మనముల్
నొప్పింపక తా నొవ్వక
తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతీ


ఎప్పటికిన్ + ఏ + అది అంటే ఆయా సందర్భాలను బట్టి. ఎయ్యది అంటే ఏ మాట. ప్రస్తుతం అంటే అనుకూలంగా ఉండి మన్నన పొందుతుందో. (ఏ సమయంలో ఏ మాట మాట్లాడితే అక్కడ గౌరవమర్యాదలు కలుగుతాయో). అప్పటికిన్ అంటే ఆ సమయానికి.

ఆ మాటలు అంటే అటువంటి పలుకులు. ఆడి అంటే పలికి. అన్యులమనముల్ అంటే ఇతరుల మనసులను. నొప్పింపక అంటే బాధపడేటట్లు చేయక. తాన్ అంటే తాను కూడా. నొవ్వక అంటే బాధపడవలసిన స్థితి కల్పించుకుని బాధపడకుండా. (తన మాటలకు ప్రతిగా ఇతరులు తన మనసు కష్టపెట్టేలా మాట్లాడనివ్వకుండా). తప్పించుక అంటే అటువంటి పరిస్థితులను తొలగించుకొని. తిరుగువాడు అంటే ప్రవర్తించే వ్యక్తి. ధన్యుడు అంటే కృతకృత్యుడు.

విజ్ఞతను ప్రదర్శించి ఏ సందర్భానికి ఎలా మాట్లాడితే అది తగినదని ప్రశంసిస్తారో, ఆ సందర్భంలో అలా మాట్లాడాలి. ఎప్పుడూ ఇతరుల మనస్సులు కష్టం కలిగేలా మాట్లాడకూడదు. మనం మాట్లాడే మాటల వల్ల ఎదుటివ్యక్తి మనస్సు కష్టపడకుండా ఉండాలి. ఇలా ప్రవర్తించేవాడు మాట్లాడటంలో కృతకృత్యుడయ్యినట్లే.

No comments:

Post a Comment