Wednesday, August 28, 2019

సుమతీ శతకం (Sumathi Shathakam) - 33

సుమతీ శతకం (Sumathi Shathakam) - 33

ఉత్తమ గుణములు నీచున
కెత్తెరగున గలుగనేర్చు? నెయ్యెడలం దా
నెత్తిచ్చి కరగ బోసిన
నిత్తడి బంగారమగునె యిలలో సుమతీ!


భావం :-
గొప్పవారికి మంచిగుణాలు సహజంగానే అలవడతాయి. అల్పులు ఎంత ప్రయత్నించినా ఆ గుణాలు వారికి అలవడవు. ఇత్తడి గొప్పదని భావించి, విలువ ఏర్పడేలా చేయాలనే తలంపుతో దానిని కర గించి అచ్చుగా పోసినా అది బంగారం కాలేదు.

ఇలలోన్ అంటే ఈ భూమి మీద. నీచునకున్ అంటే దుష్టస్వభావం కలవానికి. ఉత్తమగుణములు అంటే గొప్పవి అయిన సుగుణాలు. ఎత్తెరగున అంటే ఏవిధంగా. కలుగనేర్చున్ అంటే అలవాటు చేసుకోవడం సాధ్యమవుతుంది. ఎయ్యెడలన్ అంటే ఏ ప్రాంతంలోనైనా. ఎత్తిచ్చి అంటే గొప్పదాన్ని. కరగి అంటే ద్రవరూపంలోకి మారేటట్ల్లు కాచి. పోసినన్ అంటే అచ్చులో పోసినప్పటికీ. ఇత్తడి అంటే ఒకానొక లోహం. తాను అంటే అది. బంగారము అంటే స్వర్ణం. అగునె అంటే కాగలదా.

ఇత్తడి, బంగారం చూడటానికి ఒకే తీరులో ఉంటాయి. కాని బంగారానికున్న విలువ ఇత్తడికి లేదు. అదేవిధంగా మంచి గుణాలు కలవారికి ఉండే సంస్కారం చెడు గుణాలు ఉన్నవారికి కలుగదు అని కవి వివరించాడు.

No comments:

Post a Comment