Wednesday, August 28, 2019

సుమతీ శతకం (Sumathi Shathakam) - 31

సుమతీ శతకం (Sumathi Shathakam) - 31

అప్పుగొని చేయు విభవము
ముప్పున బ్రాయంపుటాలు మూర్ఖుని తపమున్
దప్పరయని నృపురాజ్యము
దెప్పరమై మీద గీడు దెచ్చుర సుమతీ!


భావం :-
అప్పు చేసి ఆస్తి సంపాదించవచ్చు. ఔదార్యం ప్రదర్శించి దానం చేయవచ్చు. అదేవిధంగా ఉన్నతస్థితిని, దర్పాన్ని ప్రదర్శించవచ్చు. తాను ముసలివాడై ఉండి వయసులో బాగా చిన్నదైన యువతిని వివాహం చేసుకోవచ్చు. మూర్ఖుడైన వాడు మునులలాగ తపస్సు చేయవచ్చు. తప్పుచేసిన దోషిలోని తప్పును ప్రజలను పరిపాలించే పాలకుడు గమనించకపోవచ్చు. అయితే ముందుముందు అంటే తరువాతి కాలంలో ఈ సంపద, దాతృత్వం, పడుచుభార్య, తపస్సు, దోషాన్ని పసిగట్టని రాజు... ఇవన్నీ కీడును తీసుకువస్తాయి.


ప్రతిపదార్థం:-
సుమతీ అంటే మంచిబుద్ధిగలవాడా! అప్పు + కొని అంటే ఇతరుల దగ్గర అప్పు చేసి. చేయు విభవము అంటే సంపాదించిన ఆస్తి, ఆ ఆస్తితో చేసేదానం, దాని కారణంగా అనుభవించే హోదా. ముప్పునన్ అంటే ముసలితనంలో. ప్రాయము + ఆలు అంటే యౌవనంలో ఉన్న భార్య. మూర్ఖుని తపమున్ అంటే మూర్ఖుడైనవాడు (తనకు తోచని, ఇతరులు చెబితే వినని) చేసే తపస్సూ. తప్పు + అరయని అంటే తప్పు చేసిన వ్యక్తిలో ఉన్న దోషాన్ని గమనించని. నృపు అంటే రాజు యొక్క. రాజ్యము అంటే పరిపాలన. ఇవన్నీ కూడా... మీదన్ అంటే తరువాతి కాలంలో. దెప్పరము + ఐ అంటే ఆపద, కష్టం కలిగించేవిగా మారి. కీడు అంటే వినాశనాన్ని లేదా కీడును. తెచ్చున్ + ర అంటే తీసుకుని వస్తాయి నాయనా!


ఈ పద్యంలో ఏయే పనులు చేయకూడదో సూచించాడు కవి. ఈ సూచనలను పాటించినవారు బుద్ధిమంతులుగా పేరుప్రఖ్యాతులు తెచ్చుకుంటారనేది ఈ పద్యం అంతరార్థం.

No comments:

Post a Comment