Monday, August 26, 2019

సుమతీ శతకం (Sumathi Shathakam) - 30

సుమతీ శతకం (Sumathi Shathakam) - 30

ఉపకారికి నుపకారము
విపరీతము కాదు సేయ వివరింపంగా
నపకారికి నుపకారము
నెపమెన్నక సేయువాడె నేర్పరి సుమతీ!


భావం:-
బుద్ధిమతీ! తనకు మేలు చేసిన వారికి ఎవరైనా తిరిగి మేలుచేస్తారు. అది ప్రకృతి లో సర్వసాధారణం. అలాచేయడంలో పెద్ద విశేషమేమీలేదు. తనకు కీడు చేసినవానికి మేలు చేయడం, అది కూడా ఏ తప్పును ఎత్తిచూపకుండా చేసేవాడు నేర్పు కలవాడు.

ఇతరులు ఎవరైనా సహాయం కోరినప్పుడు మనం వారికి సహాయం చేస్తుంటాం. మళ్లీ మనకు అవసరం వచ్చినప్పుడు వారు తిరిగి సహాయం చేస్తారు. ఇందులో పెద్ద విశేషమేమీ లేదు. ఎందుకంటే ఇది అందరూ చేసేదే. మనకు సహాయం చేసిన వారి రుణం తీర్చుకోవడం కోసం ఇలా చేస్తారు. అలాకాక మనకు ఎవరో ఒకరు అపకారం చేసినవారుంటారు. వారికి ఎప్పుడో ఒకప్పుడు మన అవసరం వస్తుంది. అటువంటప్పుడు మనం వారు చేసిన తప్పును ఎత్తిచూపుతూ వారికి సహాయం చేయకుండా ఉండకూడదు. వారు తెలియక తప్పు చేశారులే అని మంచిమనసుతో భావించి, ఆపదలో ఉన్నప్పుడు తప్పకుండా సహాయం చేయాలి. అటువంటివారే నేర్పరులవుతారని బద్దెన ఈ పద్యంలో వివరించాడు.

No comments:

Post a Comment