Saturday, August 24, 2019

సుమతీ శతకం (Sumathi Shathakam) - 26

సుమతీ శతకం (Sumathi Shathakam) - 26

నడువకుమీ తెరువొక్కట
కుడువకుమీ శత్రునింట కూరిమి తోడన్
ముడువకుమీ పరధనముల
నుడువకుమీ యొరుల మనసు నొవ్వగ సుమతీ!


భావం:-
మంచిబుద్ధిగలవాడా! ఎవరో ఒకరు పక్కన తోడు లేకుండా ఒంటరిగా ఎక్కడికీ వెళ్లవద్దు. శత్రువు ఇంటికి వెళ్లినప్పుడు, తినడానికి ఏవైనా పదార్థాలను స్నేహంగా పెట్టినప్పటికీ ఏమీ తినవద్దు. ఇతరులకు సంబంధించిన ఏ వస్తువునూ తీసుకోవద్దు. ఇతరుల మనసు బాధపడేలాగ మాట్లాడవద్దు. పూర్వం ఒకప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాలంటే అడవులు దాటి వెళ్లవలసి వచ్చేది. అలాగే శుభ్రంచేసిన దారులు కూడా తక్కువగా ఉండేవి. అందువల్ల పాములు, క్రూరమృగాలు, దోపిడీదొంగలు - వీరి బాధ ఎక్కువగా ఉండేది. ప్రజలందరూ గుంపులుగా ప్రయాణాలు చేసేవారు. ఒంటరిప్రయాణం మంచిది కాదు.

శత్రువు ఇంటికి వెళ్లవలసి వచ్చినప్పుడు, అక్కడ వారు ఎంత ప్రేమగా ఏ పదార్థం పెట్టినా తినకుండా వ చ్చేయాలి. ఎందుకంటే శత్రువు తన పగ తీర్చుకోవటానికి ఆహారంలో విషంవంటివి కలిపే అవకాశం ఉంటుంది. అందువల్ల ఏమీ తినకుండా వచ్చేయాలి. ఇతరుల మనసులను బాధపెట్టేలా మాట్లాడటం వలన వారి మనసు విరిగిపోతుంది. ఇంక ఎప్పటికీ మనతో సరిగా మాట్లాడలేరు. ఈ మూడు సూత్రాలను పాటించడం ప్రతిమనిషికీ అవసరమని బద్దెన చక్కగా వివరించాడు.

No comments:

Post a Comment