Wednesday, August 21, 2019

సుమతీ శతకం (Sumathi Shathakam) - 24

సుమతీ శతకం (Sumathi Shathakam) - 24

పెట్టిన దినములలోపల
నట్టడవులకైన వచ్చు నానార్థములున్
పెట్టని దినముల గనకపు
గట్టెక్కిన నేమి లేదు గదరా సుమతీ!

భావం:-
ఇతరులకు దానం చేసిన రోజులలో దట్టమైన అరణ్యమధ్యభాగాలలో ఉన్నప్పటికీ అక్కడ కావలసిన వస్తువులన్నీ దొరుకుతాయి. అదే ఇతరులకు దానం చేయని రోజులలో అయితే బంగారపు కొండ మీద ఉన్నప్పటికీ అక్కడ అనుభవించదగినదేదీ దొరకదు కదా! కనుక ఉన్నంతలో ఇతరులకు దానం చేయాలి.

ఇతరులకు పెట్టనిదే మనకు పుట్టదని ఒక సామెత ప్రచారంలో ఉంది. మనకు ఉన్నంతలోనే ఇతరులకు సహాయం చేయాలి. చేయమన్నారు కదా అని అపాత్రదానం చేయకూడదు. మనం సంపాదించిన దానిలో ఎనిమిద వ వంతు ఇతరులకు దానం చేయాలని శాస్త్రం చెబుతోంది. కనుక వీలయినంతగా అవసరంలో ఉన్నవారికి దానం చేయవలసిందిగా కవి ఈ పద్యం ద్వారా నొక్కి చెప్పాడు.


పెట్టిన దినములలోపలన్ అంటే ఇతరులకు దానం చేసిన రోజులలో; నడు + అడవులకున్+ ఐనన్ అంటే దట్టమైన అడవుల మధ్యభాగంలో ఉన్నప్పటికీ; నానా + అర్థములున్ అంటే కావలసిన ద్రవ్యాలన్నీ; వచ్చున్ అంటే దొరుకుతాయి; పెట్టని దినములన్ అంటే ఇతరులకు దానం చేయని రోజులలో; కనకము + గట్టు అంటే బంగారంతో నిండిన కొండ ను; ఎక్కినన్ అంటే అధిరోహించినప్పటికీ; ఏమి అంటే అనుభవించదగినదేదీ; లేదు + కదరా అంటే ఉండదు కదయ్యా!

No comments:

Post a Comment