Sunday, August 4, 2019

సుమతీ శతకం (Sumathi Shathakam) - 18

సుమతీ శతకం (Sumathi Shathakam) - 18

ఆకొన్నకూడె యమృతము
తాకొందక నిచ్చువాడె దాత ధరిత్రిన్
సోకోర్చువాడె మనుజుడు
తేకువ గలవాడె వంశతిలకుడు సుమతీ


భావం :-
ఈ భూమి మీద బాగా ఆకలివేసినప్పుడు తిన్న అన్నమే అమృతం. అది చాలా రుచిగా ఉంటుంది. ఎవరైనా దానం కోరితే విసుక్కోకుండా దానం చేసేవాడే నిజమైన దాతృత్వం కలిగినవాడు. అలాగే ఎప్పుడైనా కష్టాలు కలిగితే వాటిని ఓర్చుకోగలవాడే నిజమైన మానవుడు. ధైర్యం ఉన్నవాడే వంశానికి మంచి పేరు తేగలుగుతాడు.

ఈ పద్యంలో మనిషికి ఉండవలసిన కొన్ని మంచి లక్షణాలను వివరించాడు కవి. ఆ లక్షణాలను అలవరచుకుంటే మానవ జీవితం ఎటువంటి ఇబ్బందులూ లేకుండా హాయిగా నడుస్తుంది. అందుకే వీటిలో కొన్నిటినైనా నేర్చుకోవడానికి ప్రయత్నించాలి.

ప్రతిపదార్థం :-
ధరిత్రిన్ అంటే భూమి మీద. ఆకొన అంటే బాగా ఆకలివేసినప్పుడు దొరికిన. కూడు + ఎ అంటే అన్నమే. అమృతం అంటే అమృతంతో సమానం. (ఆ అన్నం ఎంతో రుచిగా ఉంటుంది). తాకు + ఒందకన్ అంటే విసుగుకోకుండా. ఇచ్చువాడు + ఎ అంటే దానం చేసేవాడే . దాత అంటే నిజమైన దానశీలుడు. సోకు + ఓర్చువాడు + ఎ అంటే ఇబ్బందులు కలిగినప్పుడు వాటిని తట్టుకోగలవాడే. మనుజుడు అంటే నిజమైన మనుష్యుడు. తేకు అంటే ధైర్యం. కలవాడు + ఎ అంటే ఉన్నవాడే. వంశతిలకుడు అంటే వంశానికి పేరు ప్రఖ్యాతులు తెచ్చేవాడు.

No comments:

Post a Comment