Wednesday, August 21, 2019

కృష్ణ శతకం (Krishna Shathakam) - 15

కృష్ణ శతకం (Krishna Shathakam) - 15

అందఱు సురలును దనుజులు
పొందుగ క్షీరాబ్ధి దఱవ పొలుపున నీవా
నందముగ కూర్మరూపున
మందరగిరి యెత్తితౌర మాధవ! కృష్ణా!


భావం:-
లక్ష్మీదేవి భర్తవైన ఓ శ్రీకృష్ణా! దేవతలు, రాక్షసులు ఇద్దరూ కలిసి స్నేహంగా పాలసముద్రాన్ని చిలికారు. ఆ సమయంలో నువ్వు తాబేలు రూపం ధరించి, ఎంతో చాకచక్యంగా కవ్వంగా ఉన్న మందరపర్వతాన్ని ఎత్తావు. నిజంగా అది ఎంత ఆశ్చర్యం.

విష్ణుమూర్తి అవతారాలలో రెండవది కూర్మావతారం. దేవతలు, రాక్షసులు కలిసి అమృతం కోసం పాలసముద్రాన్ని చిలకాలనుకున్నారు. అందుకు వాసుకి అనే పామును తాడుగానూ, మందరగిరి అనే పర్వతాన్ని కవ్వంగానూ ఎంచుకున్నారు. ఆ కవ్వంతో సముద్రాన్ని చిలుకుతుంటే అది నెమ్మదిగా కుంగిపోసాగింది. ఆ సమయంలో విష్ణుమూర్తి కూర్మ (తాబేలు) రూపంలో వచ్చి మందరగిరిని తన వీపు మీద మోశాడు. ఆ సన్నివేశాన్ని కవి ఈపద్యంలో వివరించాడు.


ప్రతిపదార్థం:-
మాధవా! అంటే మౌనం, ధ్యానం, యోగం అనే మూడు మార్గాలద్వారా భక్తులను అనుగ్రహించేవాడా లేదా లక్ష్మీదేవి భర్తయైనవాడా; కృష్ణా అంటే ఓ శ్రీకృష్ణా; సురలును అంటే దేవతలు; దనుజులు అంటే రాక్షసులు; అందరు అంటే వీరందరూ; పొందుగ అంటే ఒకరితో ఒకరు కలిసి; క్షీర + అబ్ధిన్ అంటే అంటే పాలసముద్రాన్ని; తఱవన్ అంటే కవ్వంతో చిలుకగాచిలుకగా;పొలుపునన్ అంటే నేర్పుతో; నీవు + ఆనందముగ అంటే సంతోషం కలిగేటట్లు నువ్వు; కూర్మరూపునన్ అంటే తాబేలు ఆకారంలో; మందరగిరి అంటే కవ్వంగా ఉన్న మందరగిరి అనే పేరుగల పర్వతాన్ని; ఎత్తితివి + ఔర అంటే పైకి ఎత్తటం ఎంత ఆశ్చర్యం!


No comments:

Post a Comment