Thursday, August 22, 2019

భాస్కర శతకం (Bhaskara Shatakam) - 13

భాస్కర శతకం (Bhaskara Shatakam) - 13

అలఘు గుణ ప్రసిద్ధుడగు నట్టి ఘనుండొక డిష్టుడై తనన్
వలచి యొకించు కేమిడిన వానికి మిక్కిలి మేలు చేయగా
తెలిసి కుచేలుడొక్క కొణిదెం డటుకుల్ దనకిచ్చిన మహా
ఫలదుడు కృష్ణుడత్యధిక భాగ్యము నాతనికిడె భాస్కరా


భావం:-
పేదవాడు అయిన కుచేలుడు తన స్నేహితుడైన శ్రీకృష్ణునికి చారెడు అటుకులు ఇచ్చాడు. ఆ మాత్రం స్నేహానికే సంతోషపడిన శ్రీకృష్ణ్ణుడు కుచేలుడికి సకల సంపదలు ఇచ్చాడు. అలాగే ఉన్నత గుణాలతో గొప్పవారైనవారు... నిరుపేద స్నేహితుడు ప్రేమతో తనకు ఏది ఇచ్చినా దానిని గొప్పగా భావించి, దానికి తగిన ప్రతిఫలాన్ని కూడా గొప్పగా ఇస్తాడు.


ప్రతిపదార్థం:-
అలఘు గుణ ప్రసిద్ధులు అంటే ఉన్నతమైన లక్షణాలతో ప్రసిద్ధిపొందిన; అగునట్టి అంటే అయినటువంటి; ఘనుండు అంటే గొప్పవాడు; ఒకడు అంటే ఒకానొకడు; ఇష్టుడు + ఐ అంటే స్నేహితుడై; తనన్ వలచి అంటే తనను ఇష్టపడి; ఒక + ఇంచుక అంటే కాస్తంత; ఏమిడినన్ అంటే ఏమి ఇచ్చినప్పటికీ; వానికిన్ అంటే ఇచ్చినవానికి; మిక్కిలి అంటే అధికంగా; మేలుచేయగా అంటే మేలు కలిగిస్తాడు; తెలిసి అంటే స్వయంగా తెలిసి; కుచేలుడు అంటే శ్రీకృష్ణుని బాల్యస్నేహితుడైన కృష్ణుడు; ఒక్క కొణిదెడు అంటే ఒక చారెడు; అటుకుల్ అంటే అటుకులు; తనకున్ అంటే శ్రీకృష్ణునికి; ఇచ్చినన్ అంటే ఇచ్చినంతనే; మహాఫలదుడు అంటే గొప్ప వరాలను ప్రసాదించే; కృష్ణుడే అంటే శ్రీకృష్ణభగవానుడు; అతనికిన్ అంటే కుచేలునికి; అత్యధిక భాగ్యములు అంటే అంతులేని సంపదలను; ఇడె అంటే ఇచ్చాడు కదా!

No comments:

Post a Comment