Wednesday, August 14, 2019

భాస్కర శతకం (Bhaskara Shatakam) - 12

భాస్కర శతకం (Bhaskara Shatakam) - 12

ఎడపక దుర్జనుండొరుల కెంతయు గీడొనరించును గాని యే
యెడలను మేలు సేయడొక యించుకయైనను; జీడపుర్వు తా
జెడదిను నింతెకాక పుడిసెండు జలంబిడి పెంచనేర్చునే
పొడవగుచున్న పుష్ప ఫలభూరుహ మొక్కటిైనె న భాస్కరా!


భావం:-
చెడుస్వభావం కలిగినవారు ఇతరులకు చెడు చేస్తారే గాని, ఎటువంటి పరిస్థితులలోనూ ఏ మాత్రం మంచి చేయరు. ఇటువంటివారి ప్రవర్తన చీడపురుగును పోలి ఉంటుంది. చీడపురుగు చెట్టుకు ఎటువంటి మేలు అంటే కనీసం పుడిసెడు నీరైనా పోయకపోగా... పూలు, పండ్లతో నిండుగా ఉండి, చక్కగా పెరుగుతున్న చెట్లను పాడుచేస్తుంది.


ప్రతిపదార్థం:-
దుర్జనుండు అంటే చెడు స్వభావం కలిగినవాడు; ఎడపక అంటే విడిచిపెట్టకుండా; ఒరులకున్ అంటే ఇతరులకు; ఎంతయున్ అంటే ఎంతగానో, కీడు అంటే చెడు; ఒనరించున్ అంటే చేయును; కాని అంటే అంతేకాని; ఏ యెడలను అంటే ఏసమయంలోకూడా; ఒకించుకయైనను అంటే ఏమాత్రమూ; మేలుచేయడు అంటే మంచి చేయడు; చీడపుర్వు అంటే అన్నిటినీ నాశనం చేసే స్వభావం ఉన్న చీడపురుగు; తాన్ అంటే ఆ పురుగు; చెడన్ అంటే నాశనమయ్యేట్లుగా; తినున్ అంటే తింటుందేకాని; పుడిసెండు అంటే దోసిలిలో పట్టేంత; జలంబు అంటే నీరు; ఇడి అంటే పోసి; పొడవు + అగుచున్న అంటే ఏపుగా పెరుగుతున్న పుష్పఫల అంటే పూవులు, కాయలు గల; భూరుహమున్ అంటే చెట్టును; ఒకటిన్ ఐనన్ అంటే కనీసం ఒకదానినైనా; పెంచన్+ నేర్చనే అంటే పెంచి పోషిస్తుందా! (పోషించదు అని అర్థం). 

No comments:

Post a Comment