Tuesday, August 27, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 78

వేమన శతకం (Vemana Shatakam) - 78

బందెతాళ్ల దెచ్చి బంధించి కట్టంగ
లింగడేమి దొంగిలించినాడొ
ఆత్మలింగమేల నర్పించి చూడరో
విశ్వదాభిరామ వినురవేమ


భావం :
లింగాన్ని కట్టుకున్నారేమి? అరె! కట్టుతాళ్లతో గుచ్చి దొంగలాగ బంధించి మెడలో కట్టుకున్నారేమి? లింగడు (అంటే శివుడు) ఏం దొంగతనం చేశాడని! బాహ్య లింగాన్ని పట్టుకోవడం మాని భావలింగాన్ని ఆరాధించడం మంచిది కదా! అని ఆనాటి ఆరాధ్య శైవులను వెక్కిరిస్తున్నాడు వేమన. సాధారణ శిలాలింగమైతే ఎప్పుడో ఒకప్పుడు తెగిపోవచ్చు. ఆత్మలింగమైతే ఎడబాయకుండా తనతోనే ఉంటుందని తాత్పర్యం.

వీరశైవం శైవం నుంచి వచ్చిన ఒక శాఖ. పండితారాధ్యుడు స్థాపించిన ఆరాధ్య సంప్రదాయం వీరశైవంలోని మరో అవాంతర శాఖ. ఆరాధ్యులు మెడలో లింగకాయ ధరించినా వీరశైవుల్లా వర్ణాశ్రమ ధర్మాన్ని నిరాకరించరు. వీరశైవులు దర్శనపరంగా శివ విశిష్టాద్వైతులు. అయితే మాయావాదాన్ని అంగీకరించరు.

వీరశైవంలో స్థలం, లింగం, అంగం అనేవి ముఖ్యమైన మాటలు. లింగం అంటే జీవుల పట్ల జాలితో లింగరూపం ధరించిన ఉపాస్య దేవత. అంగం అంటే దేవుడు. లింగం కూడా మూడు రకాలు. 1. ప్రాణలింగం. దీనికి రూపం ఉంటుంది. 2. ఇష్టలింగం. ఇది అర్చించుకునే సౌకర్యాన్ని కలిగిస్తుంది. 3. ఇక భావలింగం అంతర దృష్టికి మాత్రమే కనిపిస్తుంది. వేమన్న మాట్లాడుతున్నది దీని గురించే!

వీరశైవంలో మానవ శరీరంతో లింగానికి అభేదాన్ని కల్పించారు. అంటే అంగానికీ లింగానికీ అద్వైతం సూచించబడింది. జీవుడు తన అవధులన్నింటినీ తొలగించుకొని, తనలోనే ఒక నిరవధిక మహాతత్వాన్ని సాక్షాత్కరింపజేసుకోవాలంటున్నాడు వేమన.

No comments:

Post a Comment