Sunday, August 25, 2019

సుమతీ శతకం (Sumathi Shathakam) - 27

సుమతీ శతకం (Sumathi Shathakam) - 27

లావుగలవానికంటెను
భావింపగ నీతిపరుడు బలవంతుండౌ
గ్రావంబంత గజంబును
మావటివాడెక్కినట్లు మహిలో సుమతీ!


భావం:-
మంచిబుద్ధికలవాడా! శరీర బలం ఉన్నవాని కంటె తెలివితేటలు ఉన్నవాడు అందరికంటే బలవంతుడు. పర్వతమంత ఆకారంలో ఉండే ఏనుగును సైతం మావటివాడు అవలీలగా లొంగదీసి దానిమీదకు ఎక్కగలడు. కండలు తిరిగి, శరీరం దృఢంగా ఉండి బలవంతులైనవారు చాలామంది ఉంటారు. అలాగే బాగా చదువుకుని తెలివితేటలు సంపాదించుకున్న నీతిమంతులు కూడా ఉంటారు.

అయితే వీరి శరీరం దృఢంగా ఉండకపోవచ్చు. కాని వారికున్న తెలివితేటలతో దేహబలం ఉన్నవారి కంటె బలవంతులుగా ఉంటారు సంఘంలో. ఏనుగు కొండంత ఉంటుంది. జంతువులన్నిటిలోకీ శరీరబలం ఉన్నది ఏనుగు మాత్రమే. మరే ప్రాణికీ అంత బలం లేదు. మావటివాడు ఏనుగు పరిమాణంలో పదోవంతు కూడా ఉండడు. అయినప్పటికీ కొండంత ఉన్న ఏనుగును మావటివాడు (ఏనుగుల సంరక్షకుడు) తన దగ్గరుండే అంకుశం (చిన్న కత్తివంటి ఆయుధం) తో లొంగదీసుకుని దాని మీద ఎక్కి కూర్చోగలుగుతున్నాడు. దీనికి కారణం అతనికి ఉన్న తెలివితేటలు. తెలివితేటలకుండే శక్తి గురించి బద్దెన ఈ విధంగా వివరించాడు.

No comments:

Post a Comment