Friday, August 30, 2019

కృష్ణ శతకం (Krishna Shathakam) - 26

కృష్ణ శతకం (Krishna Shathakam) - 26

ఇరువదొకమారు నృపతుల
శిరములు ఖండించితౌర చే గొడ్డంటన్
ధర గశ్యపునకు నిచ్చియు
బరగవె జమదగ్ని రామ భద్రుఁడు కృష్ణా!


భావం:-
ఓ కృష్ణా! నువ్వు జమదగ్ని ఋషికి కుమారునిగా పరశురామావతారం దాల్చి రాజులందరినీ ఇరువదియొక్కమార్లు ఖండించావు. ఈ భూమినంతటినీ కశ్యప ప్రజాపతికి అందచేసి గొప్పవానిగా ప్రవర్తించావు.

జమదగ్ని అంటే జమదగ్ని అనే పేరు గల ఋషి యొక్క; రామభద్రుడు అంటే కుమారుడవైన రామభద్రా (పరశురామా); నీవు అంటే నువ్వు; ఇరువది + ఒక్కమారు అంటే ఇరవై ఒక్కసార్లు; నృపతుల అంటే రాజులయొక్క, శిరములు అంటే తలలను, చే గొడ్డంటన్ అంటే చేతిలో ఉన్న గండ్రగొడ్డలితో; ఖండించితివి అంటే నరికేశావు; ధరన్ అంటే భూమిని; కశ్యపునకున్ అంటే కశ్యపుడనే పేరు గల మహామునికి; ఇచ్చి అంటే అందచేసి; పరగవే అంటే ప్రవర్తింపవా!
సప్తఋషులలో జమదగ్ని ఒకరు. ఆయన కుమారుడు పరశురాముడు. విష్ణుమూర్తి అవతారాలలో నరసింహావతారం తరవాత అంత క్రోధాన్ని ప్రదర్శించిన అవతారం ఇదే. తండ్రి కోరిక మేరకు తల్లి అయిన రేణుక శిరసు ఖండించి తండ్రికి ఇష్టుడయ్యాడు. ఏదైనా వరం కోరుకోమని తండ్రి అడుగగా, తల్లిని బతికించమని కోరాడు. కవి ఈ పద్యంలో పరశురామావతారాన్ని వర్ణించాడు.

No comments:

Post a Comment