Monday, August 12, 2019

కృష్ణ శతకం (Krishna Shathakam) - 13

కృష్ణ శతకం (Krishna Shathakam) - 13

హరి నీవె దిక్కు నాకును
సిరితో నేతెంచి మకరి శిక్షించి దయన్
బరమేష్ఠి సురలు బొగడగ
కరి గాచిన రీతి నన్ను గావుము కృష్ణా!


భావం:-
కృష్ణా! నువ్వు లక్ష్మీదేవితో కూడివచ్చి బ్రహ్మాది దేవతలు పొగిడేలా... మొసలిని చంపి దయతో ఏ విధంగా ఏనుగును కాపాడావో, నన్ను కూడా అదేవిధంగా రక్షించు. నాకు నీవే శరణు అవుతున్నావు.

ఏనుగుకి, మొసలికి జరిగిన భయంకర యుద్ధంలో ఏనుగు బలం తగ్గిపోవడం మొదలయ్యింది. ఆ సమయంలో ఏనుగు తనను రక్షించమని విష్ణుమూర్తిని ప్రార్థించింది. అప్పుడు విష్ణుమూర్తి ఎలా ఉన్నవాడు అలాగే వచ్చి ఏనుగును రక్షించాడు. తనను కూడా అదేవిధంగా రక్షించమని కవి ఈ పద్యంలో విన్నవించుకున్నాడు.

ప్రతిపదార్థం; హరి అంటే పాపాలను హరించువాడా; నాకును అంటే నాకు; నీవె అంటే నువ్వు మాత్రమే; దిక్కు అంటే అండ అవుతున్నావు; సిరితోన్ అంటే లక్ష్మీదేవితో; ఏతెంచి అంటే కలసివచ్చి; మకరిన్ అంటే మొసలిని; శిక్షించి అంటే వధించి; పరమేష్ఠి అంటే బ్రహ్మ మొదలుగా; సురలు అంటే దేవతలు; పొగడగా అంటే కీర్తించగా; దయన్ అంటే కరుణతో; కరిన్ అంటే ఏనుగును; కాచినరీతి అంటే రక్షించిన విధంగా; నన్నున్ అంటే నన్ను కూడా; కావుము అంటే రక్షించుము.

No comments:

Post a Comment